ముంగిలి » కథలు » కాకి దిద్దిన కాఫురం (!?!)

కాకి దిద్దిన కాఫురం (!?!)

“అకాశవాణి విశాఖపట్నం కేంద్రం, ఈ రోజు అదివారం సమయం మధ్యాహ్నం 9 గంటలు దాటి 9 గంటల 5 నిమిషాలు కావస్తుంది. ఈ రోజు ఉరుములతో కూడిన జల్లులు పడవచ్చని విశాఖపట్నం వాతావరణశాఖ తెలిపింది. తీరప్రాంతంలో వేటకి వెళ్ళటం ప్రమాదమని మత్సకారులకు తెలిపింది.” ఎదురింటిలో పాతకాలం నాటి రేడియోలో గర గరలాడుతూ వినిపించింది. వెంటనే అదేదో టి.వి. లో “దంచవే మేనత్త కూతురా!” సీరియల్ లో అత్త కోడల్ని ఎలా చంపాలా అని ఆలోచిస్తూ రెండు ఎపిసోడ్లుగా సాంబారు వండుతున్న ఉత్కంట భరితమైన సన్నివేశంలో మునిగిపోయిన మా అమ్మ తొందరగా వెళ్ళి బట్టలు ఉతకటం ప్రారంభించింది. ఒక మూల మడత మంచం మీద ముసుగుతన్ని ముడుచుకు పడుకున్న మా బామ్మ ఎగిరి నేలమీద దూకి మూడు మొగ్గలేసి వంటగదిలో నుండి ఒకపాత్ర తీసుకుని  పాత సినిమాల్లో కృష్ణలాగ వెనుకనుండి డింగుమంటూ ఒక గెంతులో మా మేడ మీదకి ఎగిరి గుమ్మడి ఒడియాలు పెట్టడం మొదలుపెట్టింది. నాకు దగ్గర్లో పరీక్షలు కూడా ఉండటంతో బాలు బ్యాటు పట్టుకుని మా బ్యాచ్ కోసం ఎదురూచూస్తూ ఇంటి బయట నిలబడ్డా.

ఇంతలో మా బామ్మ కదనకుతూహలరాగంలో “ముక్కాల ముక్కాబులా..” పాట పాడుకుంటూ కిందకు వచ్చి నా చేతిలో బ్యాటును చూసి ఆగింది.

“ఏరా బ్యాటుతో కాకులను కొడతారట కదా! కాసేపు మేడ మీదకు వెళ్ళి కాకులను కొట్టకూడదూ” అంది. (మా బామ్మకి మా తాతయ్య కాకి రూపంలో ఉన్నాడని అనుమానం.)

“అబ్బా బామ్మ ఆ కాకులు ఈ కాకులు కాదే. అసలు ఆ బ్యాటు ఈ బ్యాటు కాదే.” అన్నాను చిరాగ్గా.

అప్పటికే కళ్యాణిరాగంలో “చికుబుకు చికుబుకు రైలే” పాటకి శృతి చేసుకుంటున్న బామ్మ “ఆ కాకులు ఈ కాకులు కానప్పుడు, ఈ బ్యాటు ఆ బ్యాటు కానప్పుడు, ఈ బ్యాటుతో ఈ కాకులను కొట్టచ్చుకదా” అంది.

నా ప్రేమకి “నో” చెప్పిన పక్కింటి పద్మ మీద ఒట్టేసి చెబుతున్నా. మా బామ్మ లాజిక్కేంటో ఇంకా నాకు అర్ధంకాలేదు. కానీ మరలా అడిగితే అసలే సూపర్ స్టార్ కృష్ణ అభిమాని గాల్లోకి ఎగిరి గంట వరకు నేల మీదకి దిగకుండా తంతుందేమో అని భయపడి కాసేపు మా తాత మిత్ర బృందంతో ఆడుకుందామని మేడమీదకి వెళ్ళాను. అప్పటి వరకూ మా మేడ వైపు కనీసం కన్నెత్తి ఛూడకుండా బాగా కునుకుతీస్తున్న కాకులన్నీ కాపలాగా నేను రావటం చూసి దాగుడు మూతలు, చెడుగుడు, కోతికొమ్మచ్చి, టెంకి మీద జెల్ల జాతీయ కాకి జట్టుల్ని పిలుచుకుని మరి నా మీదకి దండయాత్రకి వచ్చాయి.

కాకుల దండయాత్రకి కొంత భయం వేసి “తాత నా తప్పేం లేదు. బామ్మ పంపించింది.” అని ఏడుస్తూ అటూ ఇటూ చూస్తున్నా. మా ఇంటికి కాస్త దూరంలో వేరే మేడ మీద ఒక కొత్తమ్మాయి కనిపించింది. వెంటనే వండే సిరీస్ ఫైనల్ లో 57 బంతులాడి 7 పరుగులు చేసి పిచ్ మద్యలో గర్వంగా నిలబడ్డ ద్రావిడ్ లా ఫోజిచ్చా. నా వైపు అదోలా చూసి “కా కా” అని అరవటం మొదలుపెట్టింది. గిన్నెలో తీసుకు వచ్చిన అన్నం గోడమీద పెట్టి మ్యూజిక్ డైరెక్టర్ చక్రిలా శ్రావ్యంగా “కా కా” అని అరవటం కంటిన్యూ చేసింది. పాపం వాళ్ళింట్లో ఎవరుపోయారో కాస్త సాయం చేద్దామని నేను కూడా “కా కా” అన్నాను. కాకులన్నీ నా వైపు వెటకారంగా చూసి “ఓర్ని లసాకా బరాబర్” అని నవ్వుకుంటూ, అన్నంలో నంచుకోటానికి వడియాలు తీసుకుని పక్కింటికి వెళ్ళిపోయాయి. (తల్లి తోడు లసాకా బరాబర్ అంటే బూతు కాదు. 50 వేల సార్లు “కా కా” కి బరాబర్ అంటే సమానం. ఇందులో ఒక చిన్న పజిల్ ఉంది అదేంటో చెప్పుకోండి చూద్దాం.)

ఆ అమ్మాయి నిజంగా అన్నం కాకులు కు పెడుతుందా లేక దొంగముండ (ఫెమినిజం జిందాబాద్. ప్రపంచ స్త్రీలంతా నాకు అమ్మ,అక్క మరియు చెల్లెల్లు వారి వారి వయసుని బట్టి. ఆఫీస్ లో నా పక్కన కూర్చునే ఆశ తప్ప కుంజరహ) నా ముందు ఫోజు కొడుతుందా అని తన నోటి వైపు చూసా. ఏమనుకుందో ఏమో నా వైపు అసహ్యంగా చూసి “ఇది నిన్న పాచెక్కిన అన్నం మా నాన్న ఊరిలో లేడని కాకులకి పెడుతున్నా” అంది. నా చూపు అంత అందంగా ఉందని అర్దమయ్యి వెంటనే చూపు మార్చాను. ఆ అమ్మాయి అలా కాకులకి అన్నం పెడుతూ “చందమామ రావే జాబిల్లి రావే” పాట పాడుతుంటే నా మనసు పై ఫ్లోర్ నుండి స్విమ్మింగ్ పూల్ లోకి పడ్డ స్పీడులో ప్రేమలో పడింది. వెంటనే ఎ.అర్.రెహమాన్ మూటముళ్ళూ సద్దుకుని వచ్చి నా ముందు గిటార్ బూజు దులపటం మొదలుపెట్టాడు. ఎలాగో ఒకలా మాటకలపాలని “రేపు మెనూ ఏంటో” అన్నా. “నాదా కాకిదా” అని ఆడిగింది.
“అనంతపురం అడవిలో ఆరు రోజులుగా నీరులేక ఏడుస్తున్న అనాధ కాకి మొహం దానా” అని తిట్టాలని అనిపించినా కరీనా కపూర్ ని కత్రినా కైఫ్ ని కైమా కొడీతే వచ్చిన కన్నడ హీరోయిన్ లా ఉంది అనవసరంగా ఫీల్ అవుతుందేమో అని “కాకి దే” అన్నా.
“మటన్ బిరియాని” అని చెప్పి మాట్లాడకుండా వెళ్ళిపోయింది.
“బామ్మా రైతా వండటం ఎలానో చెప్పవే” అనుకుంటూ నేనూ కిందకి వెళ్ళిపోయా.

మరుసటి రోజు పొద్దున్నే తలకి స్నానం చేసి కొత్త బట్టలేసుకుని రైతా పట్టుకుని మేడ మీద కూర్చున్నా. అ అమ్మాయి వచ్చింది. వస్తూనే “మా ఇంట్లో పులిహోర చేస్తారని నీకెలా తెలుసు రైతా తెచ్చావ్” అని అడిగి నా చేతిలో రైతా లాగేసుకుని పులిహోరలో కలిపేసుకుని తినటం మొదలు పెట్టింది. పులిహోరలో రైతా ఏంటే నీ …. డైలీ సీరియల్ అంత తిట్టు మనసులో తిట్టుకున్నా. అంతా తినేసిందనుకునేరు, మధ్య మధ్యలో కాకులకి కూడా పెట్టింది. నేను కూడా ప్రేమగా కాకులకి పెట్టడం మొదలుపెట్టా. “మీకు కూడా కాకులంటే ఇష్టమా?” అని అడిగింది. “ఎంతమాటన్నారండి కాకి మాత్రం జీవి కాదా? అసలు మన జాతీయ పక్షిగా కాకిని పెట్టాలని నేను నా స్నేహితులతో కలిసి ఉద్యం చేద్దామనుకుంటున్నా. మా బామ్మకయితే మరీను. కాకుల్ని మా తాతతో సమానంగా చూస్తుంది.” అని చెప్పాను. కాకులన్నీ “కా కా” గోల చేసాయి. ఆ అమ్మాయి నా వైపు అనుమానంగా చూసింది. “మీరు నమ్మటం లేదు కదా కావాలంటే చిన్నప్పుడు నేను ఎంత అడిగినా ఇవ్వకుండా ఊరించుకుని కొబ్బరుండ తిన్న ఎదురింటి శీను గాడి మీద ఒట్టు” అన్నాను. పనిలో పనిగా “మీకెందుకండీ కాకులంటే అంత ఇష్టం” అని అడిగా. “ఇష్టమా? గుడ్డా? అదో స్టోరీ” అంది. “మూడున్నర ముక్కల్లో చెప్పటం కుదరదా” అడిగేసా.

“సరిగ్గా మూడేళ్ళ క్రితం నేను ఎంతో కష్టపడి “మీ పక్క ఊరి పెంట సారీ వంట” అనే కార్యక్రమం చూసి బంగాలదుంప,అరిటికాయ,క్యాబేజీ కలిపి కొత్తిమీర కారం పెట్టడం ఎలాగో నేర్చుకున్నా. మా ఇంట్లో బంగాలదుంపలు లేకపోవటంతో దాని బదులు బీరకాయ వేసి కూర వండాను. అదికాస్త రుచి చూపిద్దామంటే మా ఇంట్లో ఎవరూ లేరు. మా కుక్క జిమ్మీకి పెట్టాను. అది వాసన చూసి పెరుగు వెయ్యలేదన్న కోపం తో అనుకుంటా పక్కింటి టామీ తో లేచిపోయింది. చేసేదిలేక ఆకలిగా ఎదురుచూస్తున్న ఒక కాకి కి పెట్టాను. అది తిన్న కాకి ఆనందం తట్టుకోలేక గెంతులు వేస్తూ పాపం అదే అనందంలో గిన్నె (మనుషుల బాషలొ బాల్చీ) తన్నేసింది. అప్పటి నుండి కాకులంటే నాకు వల్లమాలిన అభిమానం” అని ముగించింది. “నీ యంకమ్మ.. అన్ని తెలుగు చానెల్స్ లో సీరియల్లు కలిపినంత పొడుగు తిట్టు మనసులో తిట్టుకుని. ఆ కాకి ఎలా ఉండేదండీ” అని అడిగా.
“నల్ల మొహం, నల్లని ముక్కు, నల్లని రెక్కలు” అని చెప్పటం మొదలుపెట్టింది.
“ఓహో ఆ కాక” అన్నాను.
“మీకు తెలుసా?” ఆత్రంగా అడిగింది.
“నీ.. తెలుగు వికీపీడియా అంత తిట్టూ”
“ఓ చాలా బాగా తెలుసు ఎంత అందంగా ఉండేదో” అన్నాను. కానీ ఆ కాకి చనిపోయిన విషయం మా బామ్మకి చెప్పాలని మనసులో అనుకున్నా. “రేపు మెనూ ఏంటో” మరలా అడిగా.
“నాదా కాకిదా” మరలా అదే ప్రశ్న.
“పెద్ద తేడా ఏముందిలే” అని మన్సులో అనుకుని “మీదే” అన్నాను.
“దద్దోజనం” అని చెప్పి వెళ్ళిపోయింది.

ఇది దద్దోజనం అందంటే ఖచ్చితంగా బిరియానీ తో వస్తుంది. దీనికి బిరియానీలో కొబ్బరి పచ్చడే నచ్చుతుంది అనుకుని కొబ్బరికాయ కొనటానికి బజారుకి బయలుదేరాను.

మరుసటి రోజు ఆ అమ్మాయి టేస్టుకి నచ్చినట్టు గులాబీరంగు ఫ్యాంటు మీద పసుపు పచ్చని షర్టు వేసుకుని కొబ్బరిచట్నీతో మేడ మీద రాత్రి వరకు ఎదురుచూసా. ఆ అమ్మాయి రాలేదు. విషయం కనుక్కుందామని వాళ్ళింటికి వెళితే ఇల్లు తాళం వేసి ఉంది. ఆ అమ్మాయి వాళ్ళ నాన్న వ్రాసిన అకౌంట్స్ అర్ధంకాక మేనేజర్ కి పిచ్చేక్కి వాళ్ళావిడా చెవికొరికాడంట. దానితో మేనేజర్ బందువులంతా దీనికి కారణమయిన వాళ్ళ కుటుంబలో ఎవరయినా దొరికితే ముక్కు కొరుకుతామని ప్రతిఙ్ఞ్ చేసారంట. అందుకే రాత్రికి రాత్రే వాళ్ళ కుటుంబమంతా పారిపోయారు.

అప్పటి నుండి ఆ అమ్మాయికోసం వెతకని కాకి గూడులేదు. ఆ రోజు వండిన కొబ్బరి చట్నీ అలానే పట్టుకుని రాష్ట్రమంతా తిరుగుతున్నా. పేరు కూడా తెలియక “కా కా” అంటూ అరుస్తూ తిరుగుతున్నా. అదిగోండి అక్కడెవరో కాకులకి అన్నం పెడుతున్నట్టు ఉన్నారు. కాకి గోల వినిపిస్తుంది. మరలా కలుస్తా.. కా.. కా…హెలో కా..కా..

19 thoughts on “కాకి దిద్దిన కాఫురం (!?!)

  1. కష్టమేం కాదులెండి కిక్కురుమనకుండా కీలాంటి కునుకుల కూనీరాగాన్ని ఆలాపించండి.
    కన్య కా కామంటూ కిమ్మనకుండా కీలుబొమ్మలా కూలబడుతుంది మీముందు….
    లసాకా బరాబర్ అంటే…..లక్ష సార్లు “కా కా” కి బరాబర్ అంటే సమానం అనుకుంటా సరిచూసుకోండి.

  2. “మరుసటి రోజు ఆ అమ్మాయి టేస్టుకి నచ్చినట్టు గులాబీరంగు ఫ్యాంటు మీద పసుపు పచ్చని షర్టు వేసుకుని కొబ్బరిచట్నీతో మేడ మీద రాత్రి వరకు ఎదురుచూసా.” ee line katti…adiripoyindi

  3. >>ఆ కాకులు ఈ కాకులు కానప్పుడు, ఈ బ్యాటు ఆ బ్యాటు కానప్పుడు, ఈ బ్యాటుతో ఈ కాకులను కొట్టచ్చుకదా.

    బామ్మగారి లాజిక్కు కేక.

    టపా అదిరిందండీ.

  4. అబ్బ బాగు౦దే మీ క గుంణి౦త౦.
    అన్ని౦టి క౦టే కకాకికీ సు౦దరి కా౦బినేశన్స్ బాగున్నాయి.
    మొడ్రన్ బామ్మ గారి కునిరాగాలు.ఇ౦క మీ డ్రెస్ సుపర్.

  5. కాకాకీక కాకికి కోక. కాకీక కాకికే కోక. కాకీక కాకికి కాక కుక్కకా ?కాకీక కాకికే కోక. కుక్కీక కుక్కకే కోక. కాకీక కాకికి కాక కుక్కకా ? కుక్కీక కుక్కకి కాక కాకికా?

  6. అప్పటి నుండి ఆ అమ్మాయికోసం వెతకని కాకి గూడులేదు. ఆ రోజు వండిన కొబ్బరి చట్నీ అలానే పట్టుకుని రాష్ట్రమంతా తిరుగుతున్నా……

    Chicago lo kakulu untaya murali???

  7. పింగుబ్యాకు: బ్లాగు ప్రయాణంలో మూడేళ్ళు « మురళీగానం

  8. చాల బాగా రాసారు, ఆఫీసులో ఇంటర్నెట్ explorer విండోని చిన్నగా చేసుకొని చదువుతూ ఉంటే.. కిస్సిక్కున నవ్వొస్తే ఆపుకోవడానికి చాల తంటాలు పడ్డాను 🙂

    కాకికీ ఒక మనసుంటుంది, అది ఎప్పటికయినా మిమ్మల్ని కోరుకుంటుంది.

Leave a reply to గీతాచార్య స్పందనను రద్దుచేయి