ముంగిలి » కథలు » మలిసంధ్య

మలిసంధ్య

 ఆనందరావు గోదావరిలో హైదరాబాద్ బయలుదేరారు. చిన్న నాటి మితృడు శంకరరావు స్వచ్చంధ పదవీవిరమణ చేస్తూ తన అప్తులందరినీ ఆహ్వానించాడు. ప్రవాహగమనం లో పాయలుగా విడిపోయిన నదీ జలాలు, సముద్రంలో కలిసేచోట తనని తాను కనుగున్న అనుభూతి ఆనందరావుకి ఇప్పటికే మొదలయ్యింది. ఏరోజు విడిపోయే ప్రసక్తే లేదు, స్నేహమేరా జీవితం అని పాడుకొనే యవ్వనం చరిత్ర పుస్తకాల్లో సిరా చుక్కలుగా మారి రెండు దశాబ్దాలయ్యింది. జీవితంలో తలో దిక్కులో చేతనయిన వేగంలో పరిగెడుతూ, వగరుస్తూ ఎన్నో ఎత్తులూ, పల్లాలు చూసారు.పెళ్ళి, పిల్లలు, వాళ్ళ చదువులు, వాళ్ళ పెళ్ళిల్లు ఎన్నో మజిలీలు దాటిపోయాయి. కొన్నిసార్లు కొంతమంది మితృలు కలిసినప్పుడు క్లాసులో అందరిగురించి మాట్లాడుకోవటం, ఎవరు ఏంచేస్తున్నారో తెలుసుకోవటం చేయటం వలన అందరినీ కలుసుకోకపోయినా ఒకరి వివరాలు మరొకరికి తెలిసేవి. కానీ ఈనాటికి అందరూ ఒక్కచోట ఖచ్చితంగా కలుసుకోవాలని నిర్ణయించుకుని బయలుదేరారు. అమెరికాలో ఉన్న పావని, లండన్లో ఉన్న సోమశేఖర్ అందరూ వస్తున్నారు. వాళ్ళ హృదయాల్లో ఉప్పొంగుతున్న సున్నిత భావాల్ని ఘనీభవించి ఒక వేదికను చేయబోతున్నారు.

రాజమండ్రి బ్రిడ్జి మీదకు రాగానే లయబద్దంగా వినిపించే రైలు చప్పుడు వింటూ, తల్లి గోదారమ్మ పరవళ్ళు చూస్తూ గతం లోకి జారుకున్నాడు.

********************************************************************
శంకర్‌గాడంటేనే చిన్నఫ్ఫటి నుండి అందరికి ఒక ప్రత్యేకమైన ఇష్టం. వాడిని ఇష్టపడని అమ్మాయిలు, లెక్చరర్లు ఆ కాలేజీలో లేరు. అందుకు మిగిలిన అబ్బాయిలు కాస్తంత ఉడుక్కున్న వాడిని మాత్రం వదిలి ఉండేవారుకాదు. చదువుల్లో వాడు ఫస్టుకాదు, ఆటల్లో వాడు ఫస్టు కాదు కానీ అన్నింటిలో ప్రవేశం ఉంది, తనకంటూ ఒక ప్రత్యేకమైన తనదైన స్థానం ఉంది. ఇక వాడిది అంటూ తిరుగులేనిది కాలేజీ లో స్టేజ్. కాలేజీలో ఏ కార్యక్రమంచేసిన వాడు వ్రాసినవి, చేసినవి నాటకాలు, ఆటలు, పాటలు అన్ని ఉండాల్సిందే. అక్కడ మాత్రం వాడ్ని కొట్టేవాడు లేడు కాలేజీలో. అందుకే వాడికి ఆ ప్రత్యేక గుర్తింపు. శంకర్‌గాడి కాలేజీ రోజులు గురించి చెప్పేప్పుడు జ్యోతిర్మయి పేరు చెప్పకపోతే పూర్తికాదు. జ్యోతి నాన్న ఒక బడిపంతులు. తనకూతురికి చదువుసంధ్యలతో పాటు చక్కగా సంగీతం, నాట్యం నేర్పించాడు. జ్యోతి చాలా అందమయిన అమ్మాయి. కాలేజీ లో అడుగుపెట్టినది మొదలు ఆమెకి వచ్చిన ప్రేమలేఖలు ఫస్ట్ క్లాస్ క్రికెట్ రన్ రేట్ నుండీ 20-20 రన్ రేట్ లా పెరిగిపోయాయి. కానీ ఆమె ఒక నవ్వు నవ్వి మౌనంగా అన్నింటినీ చెత్త బుట్టలో పడేసింది.

జ్యోతి మొట్ట మొదటిసారి శంకర్ తోనే మాట్లాడింది ఆ కాలేజీలో. ఒక కార్యక్రమంలో పాట పాడాలని. తనగాత్రం విని శంకర్ చాలా అభిమానించాడు. ఆ రోజు నుండి శంకర్,జ్యోతి చాలా గొప్ప మితృలయ్యారు. శంకర్ కి కేవలం మితృడిగా మిగిలి పోవాలని లేదు. ఆ అపురూప లావణ్యాన్ని, గాత్రాన్ని, నాట్యాన్ని వదులుకున్నవాడు పిచ్చివాడే అందులో సందేహం లేదు. కాలేజిలో అందరూ కూడా వీరిద్దరిదీ ముచ్చటయిన జంట అని కితాబునిచ్చారు. జ్యోతి పుట్టినరోజుకి శంకర్ తన ప్రేమ విషయం చెప్పాడు.  జ్యోతి మిగిలినవారిని తిరస్కరించినట్టు తిరస్కరించలేదు. అలా అని అంగీకరించలేదు. మా ఇంటిలో వాళ్ళు అంగీకరిస్తే చేసుకోవటానికి అభ్యంతరం లేదని చెప్పింది. శంకర్ దూకుడు జలపాతానికి ఏమాత్రం తీసిపోదు. వెంటనే వెళ్ళి జ్యోతి ఇంటిలో మాట్లాడాడు. వాళ్ళూ కూడా గతంలో శంకర్ గురించి విని ఉండటం వలన, శంకర్ కుటుంబ పరిస్థితులు కూడా తెలియటం వలన ఆనందంగా అంగీకరించారు.

శంకర్ ఆనందానికి హద్దుల్లేవు, అదే ఊఫూలో వెళ్ళి పరీక్షలన్నీ చాలా బాగా వ్రాశాడు. అనుకున్నట్టే మంచి ఫలితాలు వచ్చాయి. హైదరాబాద్ లో ఒక ఉన్నతమైన కంపెనీ లో ఉద్యోగం వచ్చింది. పెళ్ళి ముహుర్తాలకోసం కుటుంబంతో కలిసి జ్యోతి ఇంటికి వెళ్ళాడు శంకర్. జ్యోతి తండ్రి హైదరాబాద్ ఉద్యోగాన్ని ఇష్టపడలేదు. తన కూతురు దగ్గరలోనే అల్లుడితో చల్లగా కాపురం చేస్తే చూడాలన్న అతని కోరిక శంకర్ కి చెఫ్ఫాడు. శంకర్ తను భవిష్యత్తులో ఎక్కాల్సిన శిఖరాలకి ఈ ఉద్యోగం చక్కని అవకాశమని తాను బావిలో కప్పలాగా ఉండలేనని చెప్పాడు. అంతటితో శంకర్ జీవితంలో జ్యొతి అధ్యాయం ముగిసిపోయింది. జ్యోతి మొదట చెప్పినట్టుగా తండ్రి మాటనే అనుసరించింది. పంతంలో దూకుడులో శంకర్ ప్రళయ రుదృడే. ఇది జరిగిన వారంలో జ్యోతికంటే అందమయిన, చదువుకున్న పెద్దింటి సంభందం చూసి చేసుకున్నాడు. జీవితంలో ఓటమంటే ఏంటో తనకి తెలీదని నిరూపించాడు

పెళ్ళై హైదరాబాద్ వెళ్ళిన శంకర్ జీవితంలో మితృలంతా ఫోన్ నంబర్లుగా మిగిలారు. శుభకార్యాలకి గ్రీటింగులు, గిఫ్టులు, టెలీగ్రాములు సరిపోయేవి. మనిషే యంత్రాన్ని తయారు చేసాడు అని శంకర్ జీవితం చూసి చెప్పటం చాలా కష్టం. ముచ్చట పడి పెళ్ళికి కొనుకున్న గడియారం చుట్టూ శంకర్ పరిగెడుతూనే ఉన్నాడు. సంసారం పిల్లలు, చదువులు, పెళ్ళిల్లు అన్ని కూడా ఒక ఖరీదయిన నాటకంలా జీవితంలో గడిచిపోయాయి. పిల్లలు మంచి ఉద్యోగస్తులయ్యారు. మంచి ఇల్లు కట్టుకున్నాడు, కారు కొనుకున్నాడు. అసలు జీవితంలో అనుకున్నట్టే అన్నీ సాధించాడు. చిన్ననాటి మితృలు శంకర్ నే ఒక ఉదాహరణగా తమ పిల్లలకి చూపించే స్థాయిలో ఉన్నాడు. కాలేజీ రోజుల్లో తెలిసో తెలియకో ఏదో వాగి జీవితంలోని చివరి మజిలీ లో దాన్ని సాధించలేకపోతే ఉండే భాద సామాన్యమైనది కాదు. ఒక జీవితం మొత్తం వ్యర్ధమైపోయింది, ఇంకేమీ మిగల లేదు అనే భావన చాలా భయంకరమయింది. అలాంటి పరిస్థితి తనకి లేదని శంకర్ గర్వపడేవాడు.

కాలచక్రం తో బొంగరాలాడే పైవాడు ఇంకా ఆడుతూనే ఉన్నాడు. అదీ గిర్రున తిరుగుతూనే ఉంది. శంకర్ ఒక పెళ్ళికి రాజమండ్రి వెళ్ళాల్సి వచ్చింది. పెళ్ళిళ్ళకి బొత్తిగా వెళ్ళని శంకర్ వ్యాపార సంభందాలున్న మితృడి కొడుకు పెళ్ళి కావటంతో వెళ్ళక తప్పలేదు. పెళ్ళి లో కూర్చుని వచ్చేపోయే వార్ని గమనిస్తూ ఉన్నాడు. ఇంతలో ఎవరో వస్తున్నారని అందరూ వెళ్ళి పలకరించటంతో అటుగా చూసాడు. పరాకుగా చూసి ఎవరో తెలిసిన వాళ్ళనిపించి పరీక్షగా చూసాడు. జ్యోతి…. 20 ఏళ్ళ తర్వాత తను బాగా ఎరిగిన జ్యోతిని చూసి శంకర్ మనస్సు ఎగిసిపడింది. పట్టు చీరతో పెద్ద బొట్టు మెడ దగ్గర, చేతుల దగ్గర కనిపిస్తున్న పచ్చని చాయ నిండు ముత్తైదువు. సాక్షాత్తు గోదారమ్మ కొబ్బరి తోటల పచ్చదనాన్ని చీరగా కట్టి వచ్చినంత ఆహ్లాదంగా ఉంది. వెళ్ళి పలకరించాలా వద్దా? తను ఉన్న గొప్ప స్థానం తనకి చెప్పాలన్న ఆశ ఉన్నా ఏదో తెలియని అలజడి. అలా సందిగ్దంలో ఉండగా తనే చూసి పలకరించింది. తన వివరాలు చెప్పి వీలయితే ఒకసారి ఇంటికి వచ్చి వెళ్ళమని చెప్పి పెళ్ళి వేదిక వైపు వెళ్ళిపోయింది. తనని కాదన్న జ్యోతి ఎలాంటి స్థితిలో ఉందో చూడలన్న పంతానికి ప్రయాణం ఒక రోజు వాయిదా వేసుకున్నాడు శంకర్రావు.

చిరునామా చూపి మితృడిని అడిగాడు ఎలా వెళ్ళాలని. తానే స్వయంగా తీసుకు వెళతానని చెప్పి లాంచీ ఎక్కించి తీసుకెళ్ళాడు. లాంచీ దిగి కాస్త నడవగానే బృందావనం అని ఒక పెద్ద బోర్దు కనిపించింది. అందులోకి నడుస్తుంటే అందమయిన తోటల మధ్యలో ఇంకా అందమయిన కుటీరాలు. అన్ని రకాల పూలు, చెట్లతో నిజంగా బృందావనమేనేమో అనిపించేలా ఉంది. కమ్మని స్వరం వినిపించటంతో ఇద్దరూ అటుగా కదిలారు. అప్పటికే శంకర్ కి తాను ఉన్నది తను రోజూ బ్రతుకుతున్న భూమి మీదన లేక కలగంటున్నానా అనే అనుమానం వెంటాడుతుంది. పక్షుల అరుపులు, చల్లని గాలి, కళ్ళెదుటే గోదారమ్మ పరవళ్ళు జీవితం ఈ క్షణంలో స్థంబించిపోతే బాగుంటుంది అనే భావన. స్వరం వినిపించిన వైపు వెళితే జ్యోతి కొంతమంది పిల్లల్ని కూర్చో బెట్టుకుని ఆలాపిస్తుంది. శంకర్ తనని పిలిచే ప్రయత్నం చేయలేదు ఎందుకంటే బృందావనంలో వేణుగానం వినే అవకాశం వస్తే వదులుకోవటం సాధ్యమా? తన ఆలాపన పరిసరాలలో మాధుర్యాన్ని నింపుతుంది. అలా సమయం తెలియకుండా చాలాసేపు నిలబడి పోయాడు శంకర్. జ్యోతితో మాట్లాడకుండానే వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఓటమిని అంగీకరించే శక్తి శంకర్ కి ఎప్పుడూ లేదు.మితృడి ద్వారా వివరాలు తెలుసుకున్నాడు.

జ్యోతి భర్త డిగ్రీ వరకు చదివి పెద్దలనుండీ వస్తున్న వ్యవసాయాన్నే ఎంచుకున్నాడు. సాంప్రదాయలని ఇష్టపడే ముచ్చటైన కుటుంబం వారిది. జ్యోతిలో ఉన్న కళ వ్యర్ధంకాకూడదని ఒక ఆశ్రమాన్ని కట్టించి వేసవి సెలవుల్లో పిల్లలకి నామ మాత్రం ఖర్చులతో సంగీతాన్ని, నాట్యాన్ని నేర్పించే ఏర్పాటు చేసాడు జ్యోతి భర్త. చిన్న పిల్లలకి నీతి కధలు, పురాణాలు చెఫ్ఫే ఏర్పాట్లు చేసాడు. వేసవిలో పిల్లలకి వినోదాన్ని, విఙ్ఞానాన్ని అందించే వారు. పిల్లలకి విపరీతంగా నచ్చి వేసవి సెలవులకోసం ఎదురుచూసేలా నడుస్తుంది ఆ ఆశ్రమం. మొత్తం తెలుసుకున్న శంకర్‌కి ఒక అలజడి మొదలయ్యింది. జీవితంలో ఏదో కోల్పోయాననే భావన ఎక్కువయ్యింది. నా తోటి వాళ్ళవద్ద ఓడిపోబోతున్నా అనే ఆలోచన వెంటాడింది. చాలా రోజులు తిండి, నిద్ర సహించలేదు. ఏం చెయ్యాలి అని ఆలోచిస్తునే గడిపాడు. పనిమీదకి మనసు బొత్తిగా పోలేదు. ఇంటిలో కూడా అందరూ ఆందోళన పడ్డారు. అప్పుడు ఒక నిర్ణయానికి వచ్చాడు. స్వచ్చంధ పదవీవిరమణ చేస్తున్నట్టుగా ఆఫీస్ లో అందరికీ చెప్పేసాడు.
*********************************************************************************

ఆనందరావ గోదావరి దిగి ఫోన్ చేసాడు. కారులో వచ్చి శంకర్ పెద్ద కొడుకు ఇంటికి తీసుకు వెళ్ళాడు. అక్కడనుండి శంకర్  ఊరు చివరకొత్తగా కట్టిన ఇంటికి తీసుకు వెళ్ళాడు. చుట్టూ తోట మధ్యలో ఇల్లు చాలా ఆహ్లాదంగా ఉంది. ఇల్లుకూడ చాలా వరకు పాత కాలం నాటి ఇల్లులా చాలావరకూ చెక్కతో కట్టిన మిద్దె ఇల్లు, కాంక్రీటు భూతం లా కాక ఆహా అనిపించేలా ఉంది. కానీ ఖరీదయిన భవంతుల్లో గడిపే స్థాయి ఉన్న శంకర్ ఇలాంటి ఇల్లు కట్టుకోవటం నమ్మలేకపోయాడు ఆనంద్. లోపల అడుగు పెడితే ఏ చక్రవర్తో మనసు పడి తన రాణీవాసంకోసం కట్టించిన కట్టడంలా అద్భుతంగా నగిషీలు చెక్కి ఉన్నాయి. ఒక గదిలో సంగీత పరికరాలు, గొప్ప గొప్ప సంగీత విద్వాంసుల పాటల సిడీలు, మరో గదిలో ఆధునిక, ప్రాచీన సాహిత్యంలో వెలువడిన పుస్తకాలు పెద్ద పెద్ద చెక్కబీరువాల్లో ఉన్నాయి. ఇంటి వెనుక గా ఒక చిన్న కృత్రిమ సరస్సు అందులో నిజమైన కలువలు. శంకర్ నిజంగా చాలా గొప్పవాడే వాడి శేష జీవితం కూడా మన తరాలకి ఉదాహరణ కాబోతుందని అనుకున్నాడు ఆనంద్.

అక్కడ నుండి కార్యక్రమ వేదిక వద్దకి అందరూ సమయానికి చేరుకున్నారు. ఊరిలో పెద్దలంతా వచ్చారు. ఏవో సాంస్కృతిక కార్యక్రమాలు సాగుతునే ఉన్నాయి. ఎన్నో ఏళ్ళ తర్వాత కల్సిన మితృల కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి, ఉద్వేగం, ఉద్రేకం అభిమానం, ఆనందం అన్నీ ఆక్కడే కనిపిస్తున్నాయి. అందరి జీవితాల్లోని కష్టాలు, సుఖాలు మాటల రూపంలో ఆ ప్రదేశంలో పొంగి పొర్లుతున్నాయి. వేదికనెక్కి అందరూ శంకర్ విజయాల గురించి, కాలేజి నుండి నేటి వరకు అతని విజయ వంతమైన జీవితం గురించి మాట్లాడుతూనే ఉన్నారు. కార్యక్రమం అధ్బుతంగా జరిగింది, అంతా ఒక కలలా జరిగి ముగింపుకి వచ్చింది. శంకర్ ఇద్దరు కొడుకులూ ఒక మంచి కారు కొని తెచ్చి శంకర్ కి బహుమతిగా ఇచ్చారు. అందులో శంకర్, శంకర్ భార్య ఎక్కి కొత్త ఇంటికి బయలుదేరి వెళ్ళాలని కొడుకులు పట్టుబట్టారు. శంకర్ పెదవులమీద ఒక గర్వంతో కూడిన నవ్వు. జీవితంలో తనకి ఎప్పటికీ ఓటమే లేదని మనసులో అనుకుంటూ కారు ఎక్కుతూ కుప్పకూలి పడిపోయాడు. ఆసుపత్రికి తీసుకు వెళ్ళేసరికే చనిపోయాడు. ఒక్కచోట చేరిన మితృలంతా హృదయ విదారకంగా ఏడ్చారు ఏడ్చారు ఏడుస్తునే ఉన్నారు. అన్నీ ముగిసాయి. గోదారమ్మ శంకర్ అస్థికలని తన ఒడిలో చేర్చుకుంది. ఒక్కొక్కరూ తలో మాట అనుకుంటూ భాదగా నిట్టూర్చి తిరుగు ప్రయాణమయ్యారు. “శంకర్ తెలివైనవాడు, సమర్ధుడు. ఒక మంచి అభిరుచి గలవాడీ జీవితం వ్యర్ధమయిపోయిందేమో? వాడు  తలచుకుంటే అతని జీవితం వెన్నెల్లో గోడరిలా ఉండేది కానీ నిరంతరం పరిగెట్టి నిజం తెలుసుకునే సరికే సమయం ముగిసిపోయింది” అన్నారెవరో. “వాడికేం రా? రాజాలా బ్రతికాడు లేని వాడు చెప్పే పనికిమాలిన ఓర్వలేని మాటలివి. ఇదో అల్ప సంతోషం”అన్నాడొకడు. ఎవరి జీవితాల పక్షి గూడులలోకి వాళ్ళు తిరిగి దూరిపోయారు.

మనలో చాలామంది జీవితాలు మొదలు కావటం ఒకేలా చిన్నగా ఉంటుంది. నది జన్మస్థలంలో నీటి ప్రవాహంలా. కానీ ప్రవాహం ముందుకు సాగుతున్న కొద్దీ ప్రతీ మలుపులో కొన్ని పాయలు విడిపోతుంటాయి. కానీ చివరికి చేరాల్సిన గమ్యం మహా సముద్రమే. మనకి కూడా జీవితంలో కొన్ని మలుపుల్లో మన జీవితాన్ని నిర్వచించే ఎంపికలు అనివార్యమవుతాయి. ఆలస్యం చెయ్యొద్దు, కొన్నిసార్లు జీవితంలో రెండో అవకాశం దొరకదు. ఇంతకి శంకర్ గెలిచాడా? ఓడాడా? మీ జీవితంలో మీ ఎంపికలే శంకర్ గెలిచాడో ఓడాడో మీ వరకు నిర్ణయిస్తాయి. ఎంతమంది చదివితే అన్ని ముగింపులు ఈ శంకర్ కధకి.

6 thoughts on “మలిసంధ్య

 1. మురళి గారూ !మంచి టపా రాశారు .మనిషి తనేం కోల్పోయాడో తెలుసు కోవడానికి ఓ జీవితకాలం పడితే …..అది అందుకొనే లోగా జీవితమే ముగిసి పోతుంది .మీ మలిసంధ్య లాగా …ముగింపు బావుంది ….

 2. మురళి గారు, నాకు శంకర్ విజేత అని మాత్రమే అనిపిస్తుంది.
  శంకర్ చేసిన తప్పేంటి? తనకు ఏది కావాలను కొన్నదో అది పొందాడు. మలి దశలో మరో విధం గా ఉండాలను కొన్నాడు. . దురదృష్ట వశాత్తు ఉండలేకే పోయడు.
  అతని మనస్తత్వానికి అతను జ్యోతి కోసం పల్లె టూర్లో ఉండి పొతే ఆనంద పడ గలిగే వాడు కాదు.
  తను అనుకొన్నది పొందాడు కనుక ఇప్పుడు మరో టార్గెట్ వైపు చూడ గలిగాడు. రెండవ గమ్యం పూర్తిగా చేరనివ్వలేదు మీరు [:)]
  అందరూ కళలకు అంకితం అయితే ఇతర వ్యాపకాలు ఎలా ? శంకర్ లాంటి కాస్త పడి పైకొచ్చిన (మోసం తో కాదు) వాళ్ళను తప్పు చేసిన వాళ్ళ లా చూపించటం నాకు నచ్చలా.

 3. జీవితంలో సంతోషాన్నీ, ఆనందాన్నీ నిర్వచించేది ఇతరుల(సమాజ) విలువలు కాదు. మనం మనతో ఎంత సుఖంగా ఉన్నామా అన్న ఎరుక. That consciousness of how contented we are should determine how happy we are in life.

  శంకరంలో వచ్చిన మార్పుని అర్జంటుగా జ్యోతి ఆనందంతో బేరీజు చేయ్యడం అంత మంచిది కాదు. ఎందుకంటే వారిరివురూ ఎప్పటికీ కలవకపోయినా తోడుగా నడిచే రైలు పట్టాల్లాంటి వారు. ఇద్దరి గమ్యం వారు నమ్మిన విలువల్ని పాటించి జీవితాన్ని ఆనందమయం చేసుకోవడం. వీరి మూల సిద్ధాంతం, వ్యక్తిగత నిబద్ధత. నమ్మిన విలువలపట్ల నమ్మకం.

  శంకరం “ప్రగతి” కోసం హైదరాబాద్ వచ్చినా అందులో ఆనందంగా లేడని అనుకోవలసిన అవసరం లేదు. అప్పుడు తను నమ్మిన ఆనందం కోసం వదులుకోలేక జ్యోతిని వదులుకున్నా, ఇప్పుడున్న జ్యోతి జీవితంలాగా తన జీవిత విలువల్ని మార్చుకుంటే, మరింత ఆనందంగా ఉండొచ్చన్న ఎరుక తో, మరో ఆనందపు మజిలీవైపు అడుగు వేసాడు. అప్పుడూ ఇప్పుడూ శంకరంలో ఉన్నది తన మీద తనకు గల నమ్మకం.

  మనలో చాలా మందికి ఆ నమ్మకం ఆత్మవిశ్వాసం ఉండదు. అందుకే మన విలువల్ని కాక, ఇతరుల విలువల్ని కాంక్షించి, ఆ తూలిక రాళ్ళకు ప్రతిగా మన జీవిన మూల్యాల్ని ఉంచి, ఎక్కడా బేరీజు కావట్లేదని అఘోరిస్తూ ఉంటాం.

  మంచి కథ. ఆలొచనకు ప్రేరణ నిచ్చే కథ. విలువల్ని అర్థం చేసుకునే ప్రయత్నాన్నిచ్చే కథ. అభినందనలు.

 4. ఎంతమంది చదివితే అన్ని ముగింపులు ఈ శంకర్ కధకి – 🙂 బావుంది.

  ఎక్జాక్ట్ గా మిమ్మల్ని అందుకోలేదేమో గానీ, నిజానికి శంకర్ సంతృప్తిగా నే పోయాడు.

  చావు ఎప్పుడొస్తుందో ఎవరికి తెలుసు!?ఒకేవేళ కంపేరిజన్లో “ఓడిపోతున్నాను” అని వ్యధ చెందుతున్న సమయంలో పోతే, అప్పుడు అసంతృప్తితో పోయినట్టు.ఇప్పుడు అతను కోరుకున్నట్టు – ఒకవేళ బ్రతికుంటే,ఆ జీవితం కూడా మనకి ఆదర్శప్రాయమే – అనుకునే విధంగా పోయాడు.శంకర్ పాత్రలో మిగితావాళ్ళు ఏమనుకుంటున్నారో అనేది ముఖ్యంగా ఫీలయ్యాడు.

  వాళ్ళకి గొప్పగా కనపడాలి అనుకున్నాడు – చివరంటా కనపడ్డాడు!

  వెన్నెల్లో గోదారిలా జీవిద్దాం అనుకులేదు!కానీ ఆ జీవితం మిస్ అయ్యాడు అని తన జీవిత కాలంలో ఎవరూ అనుకోకూడదను కున్నాడు.అదే పిక్చర్ ఇచ్చేడు.ఇంకొద్దికాలం బ్రతికుంటే,అది నిరూపించేవాడు – ఈ సైకిల్ కి అంతెక్కడ!

 5. ఎంత మంది చదివితే అన్ని ముగింపులు… బాగుంది. ముగింపు, గెలుపు ఓటములు సంగతి నేను మాట్లాడను. ఇందులో జ్యోతి పాత్ర చిత్రీకరణ నాకు నచ్చింది. తన నిర్ణయం స్పష్ఠముగా చెప్పింది.దాని కనుగుణంగా నడిచింది.అదృష్టం సహకరించింది కనుక ఆనందముగా వుంది. ఒకవేళ దురదృష్ఠవంతురాలిగా జీవితం మార్చినా ఆమెకు శంకర్ పట్ల ఏ కంప్లైంట్ వుండదు. అప్పుడు కూడ ఆమె శంకర్ ఎదురైతే ఇలాగే ఏ సంకోచమూ లేకుండా పల్కరించి వుండేది.ఇది నిజమైన వ్యక్తిత్వం కలిగిన స్త్రీ లక్షణం. మురళీగారు! మీరు చిత్రీకరించిన ఈ పాత్ర నాకు చాలా చాలా నచ్చింది. well done!

 6. ఒకవేళ – కధ గెలుపోటములు గురించి కాకపోతే,శంకర్ మనస్సు మిస్ అయ్యింది జ్యోతి నే ఐతే – ఇక్కడ ఓ నిజ జీవితపు డ్రామా :
  http://magavaadu.wordpress.com/2009/03/03/నిన్నేలా-మరిచి-పోతాను-బా

  కానీ మీరు రాసిన జీ… సారీ..సి…సారీ కధలో సమస్య – గెలుపు -ప్రపంచం శంకర్ ని ఎలా చూస్తోంది అన్న అనుమానం 🙂

  అందుకనే , మీర్రాసిన కథ ప్రకారం ఐతే – శంకర్, జ్యోతి రెండూ గెలుపులే! రెండూ పాత్రలో ఓ స్టేజీలో ఓ అశాంతిని పొందవచ్చు – తరువాత వాటిని అధిక మించ వచ్చు – కానీ ప్రపంచం దృష్టిలో రెండూ గెలుపులే!

  ఒక వేళ – జ్యోతే శంకర్ తో పెళ్ళి చేసుకొని, అమెరికా వెళ్ళినా, అక్కడ శంకర్ సుదూరంలో మరణించినా, జ్యోతి తిరిగి గోదావరి కొచ్చి పాటలు పాడుకున్నా నేను రెండూ పాత్రలో గెలిచాయి అనే అనుకుంటాను! 🙂

  వాట్ మురళీ!యా మై ఇన్ సింక్ నవ్!
  what Murali Am i in sync now!?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s