ముంగిలి » ఙ్ఞాపకాలు » మనసున మనసై బ్రతుకున బ్రతుకై..

మనసున మనసై బ్రతుకున బ్రతుకై..

మనసున మనసై బ్రతుకున బ్రతుకై
తోడొకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము
నిన్ను నిన్నుగా ప్రేమించుటకు నీకోసమే కన్నీరు నింపుటకు…

మహానుభావుడు ఎంత అద్భుతంగా వ్రాసాడండి. తోడు ఉంటే సరిపోదు నిన్ను నిన్నుగా అంగీకరించే తోడు. నిజం మనవాళ్ళు మనపక్కనే లేని జీవితం అన్నీ ఉన్నా ఏమీ తినలేని, నిద్రలేని ధనవంతుడి రోగంతో సమానం. ఒకతరం క్రితం ఎంత కష్టం వచ్చినా ఊరువదిలి వెళ్ళేవారు కాదు. ఎవరయినా ఉద్యోగరిత్యా వెళ్ళినా అందరూ భాదపడేవారు ఎంత కష్టం వచ్చింది ఊరువదిలిపోవాల్సి వస్తుందీ అని. పొట్టకూటికి ఎన్నిపాట్లు అని అందరూ జాలి పడేవారు. కానీ ఇప్పుడో మన నాయకులకు భాగ్యనగరం మీద ఉన్న ప్రేమ మనల్ని చచ్చినట్టు ఇక్కడికి రప్పిస్తుంది. తల్లిదండ్రులను, ప్రాణస్నేహితులను వదిలి రావటం. ఎంత కష్టం అండి. దూరాలు పెరిగి ప్రేమలు పెరిగే రోజులు పోయాయి, ఎవరి పనుల్లో వాళ్ళు ఉండిపోయి వారి మధ్య ఒక తెలియని అగాధం ఎర్పడుతుంది. చాలాసార్లు నా చినప్పటి స్నేహితులు అనుకోకుండా కలిసినప్పుడు ఏమి మాట్లాడటానికి ఉండదు. ఎవో ఉద్యోగాల గురించి అడిగి ఊరుకుంటా. ప్రవర్తనలో కూడా చనువుపోవటం చూసాను.

నేను హైదరాబాద్ వచ్చినప్పుడు, నా చాలామంది స్నేహితులు నా కూడా వచ్చారు. అందరం ఒకే దగ్గర ఉండటం కొంత బాగుండేది. ఇంటిలో వాళ్ళని దూరమయ్యా అనే భాద ఉన్నా స్నేహితుల మధ్యే ఉండటం వలన మా ఊరిలోనే ఉన్నానేమో అనేట్టు ఉండేది. అయినా మనం ఇష్టపడే మన సొంత ఊరు, మనల్ని మనంగా గుర్తించే మన ఊరివాళ్ళని వదిలి మన ఉనికి మనకే తెలియని, మన ఉనికికి ఏమాత్రం ప్రాముఖ్యత లేని చోటకి రావటం ఏంటండి మన పిచ్చిగానీ.

ఇప్పుడు నా పరిస్థితి మరీ దారుణం. పెనంలో నుండి పొయ్యలో పడ్డట్టు అయ్యింది. ఆఫీసు పని మీద చద్దికూడూ తినే ఈ అమెరికాకి పొట్టకూటికి వచ్చా(ఈ వ్యాఖ్య ఎవరినయినా భాదిస్తే క్షమించండి). కనీసం నా పక్కనే ఉండే నా స్నేహితులు కూడా లేకపోయేసరికి నా మీద నాకే జాలి కలుగుతుంది. ఎంత పనికిమాలిన పసలేని జీవంలేని జీవితం గడుపుతున్నాను అని. మన ఇంటిలో ఇరుగు పొరుగు స్నేహితులతో తినే పచ్చడిమెతుకుల్లో ఉండే ఆనందం ఇక్కడ డాలర్లు పెట్టి కొనుక్కుతినే చద్దికూడు లో ఉంటుందా? పోనీ నా జీవితం లో వయస్సు 50 వచ్చేవరకు ఇలాగే కష్టపడి కడుపుకట్టుకుని, అందరికి దూరంగా నేను ఇష్టపడే నా ఊరికి దూరంగా ఉంటా, ఉండి 50 ఏళ్ళకి నేను దాచుకున్నదానితో ఏమి చెయ్యాలి? హాస్పిటల్కి కట్టాలి. ఎందుకంటే అప్పటికి ఖచ్చితంగా అన్ని రోగాలు వచ్చేస్తాయిగా.

నా స్నేహితులని, కుటుంబాన్ని ఎంతగా మిస్సవుతున్నానో నిన్న ఒక గంట ఏకాంతంలో కూర్చున్నప్పుడు తెలిసింది. అవును మనస్సుకి మొహమాటం ఎక్కువ అందరూ ఉన్నప్పుడు సందడిగా ఉన్నప్పుడు మాట్లాడదు. ఏకాంతంలో మాత్రమే మాట్లాడుతుంది.
అవును ఏకాంతం నీతో చాలా ఊసులాడుతుంది.
ఏకాంతం నీలో ఉన్న నిన్ను నీకు చూపిస్తుంది.
ఏకాంతం నీ వాళ్ళని నీకు పరిచయం చేస్తుంది.
ఏకాంతం నీ గత స్మృతులను మోసుకొస్తుంది.
ఏకాంతం నిన్ను ఏడిపిస్తుంది, ఓదారుస్తుంది.

పైన చెప్పినవన్నీ నిజాలు. నేను అనుభూతికి లోనవుతున్న భావాలు. లేకపొతే అక్కడ మనదేశంలో నా వాళ్ళందరూ ఘాడ నిద్రలో ఉంటే నేనెందుకు వారిగురించి ఆలోచిస్తున్నా. ఏకాంతంలో కూర్చుని నా ఫస్ట్ క్రష్ నుండి ప్రతీ ఒక్కరిని తలచుకుని ఎందుకు భదపడుతున్నా. నన్ను వదిలివెళ్ళిపోయిన వాళ్ళని సహితం ఒక్కసారి చూడాలని ఎందుకు అనిపిస్తుంది. ఎందుకంటే ఒంటరితనం. మనకి మనమే తవ్వుకున్న గొయ్యలాంటి ఒంటరితనం. నేను అమెరికా వస్తే మా మురళీ అమెరికా వెళ్ళాడు అని నా స్నేహితులు కుటుంబ సభ్యులు గర్వంగా చెప్పుకుంటుంటే. నేను వాళ్ళకి “ఐ మిస్ యు” అని చాలా కృతకంగా. కృత్రిమంగా చెప్పాలా? చెబితే నన్నో చవటాయి లేదా కెరీర్ ఆబ్జెక్టివ్ లేని వెదవాయి అనుకుంటారు. అవకాశాలు చేతిలో ఉంచుకుని చంటిపిల్లాడిలా ఏంటిది అనుకుంటారు. అనుకోనివ్వండి ఇంతకు మించి నటించటం నావల్ల కాదు. ఇప్పటికే నేను మిమ్మల్నందరిని వదిలి ఉండలేకపోతున్నా అని చెప్పలేక ఇగోతో ఇంతకాలం నడిపించుకుంటూ వచ్చా. ఇక నావల్ల కాదు. గట్టిగా అరవాలని ఉంది నాకు డబ్బు అధికారం దర్పం కంటే మీరు కావాలి. మీ అభిమానం కావాలి.

నే ఇసుకతో ఇల్లు కడితేనే మురిసిపోయి నన్ను ఊరేగించిన భుజాల తోడుకావాలి.
అ ఆ లు రాస్తేనే సంబరపడి హత్తుకున్న చేతులు కావాలి.
గల్లీ క్రికెట్లో సిక్సర్ కొడితే అబ్బురపడి ప్రోత్సహించిన చప్పట్లుకావాలి.
ఏంచేసినా సై అని నావెంటే ఉండే అడుగులు కావాలి.
చింపిరి జుట్టుతో నే స్టైల్ కొట్టినా నా అమాయకపు ప్రేమని గుర్తించిన ఆ చిరునవ్వు కావలి.
ఇవన్నీ మనజీవితంలో రోజూ మరలా మరలా జరగటానికి తగినంత సమయం కావాలి.

ఏదో ఒకటి చేస్తాను ఇవన్నీ తెచ్చి మీకోసం ఎదురుచూస్తూ ఉంటాను…….

11 thoughts on “మనసున మనసై బ్రతుకున బ్రతుకై..

 1. మురళీ, కో-ఇన్సిడెన్స్… వారం రోజులుగా ఈ పాట ఆలోచనల్లో తిరుగుతుంది… ఏంటిరా నువ్వు దీని గురించి ఏమీ రాయడం లేదు అని ఆలోచనలు ప్రశ్నించాయి కూడా… ఇక్కడ కనపడింది… పూర్తిగా చదవకుండానే వ్యాఖ్య రాస్తున్నా…

 2. అరె మురళి గారు, ఏంటండీ!!!! అప్పుడె అంత బాధ పడితే ఎలా? కొత్తగా వెళ్ళారు కదా…. కొద్ది రోజులు అవ్వాలి కదా అలవాటు పడటానికి!!
  ఒంటరితనం మీరు చెప్పినట్లు చాలా విషయాలు నేర్పుతుందనేది నిజమండీ. ఇది నాకు కుడా అనుభవమే. ఇది చాలా బాధని కల్గిస్తుంది, అదే సమయంలో జీవితానికి సరిపడా ధైర్యాన్ని కుడా ఇస్తుంది.

  ఎలాగైతేనేం మీరు త్వరగా, విజయవంతంగా మీ ట్రిప్ పూర్తి చేస్కొని త్వరలో మన భారతావని లో అడుగిడి, మీ వాళ్ళందరితో కలిసి ఎంజాయ్ చేయాలని కోరుకొంటున్నాను.

  విష్ యూ బెస్టాఫ్ లక్…

 3. “ఏకాంతంలో మాత్రమే మాట్లాడుతుంది.
  అవును ఏకాంతం నీతో చాలా ఊసులాడుతుంది.
  ఏకాంతం నీలో ఉన్న నిన్ను నీకు చూపిస్తుంది.
  ఏకాంతం నీ వాళ్ళని నీకు పరిచయం చేస్తుంది.
  ఏకాంతం నీ గత స్మృతులను మోసుకొస్తుంది.
  ఏకాంతం నిన్ను ఏడిపిస్తుంది, ఓదారుస్తుంది.”

  ఇవన్నీ పొల్లుపోకుండా నేను నా స్నేహితులకి చెప్పే మాటల్లాగానే ఉన్నాయి 🙂 నేను మాట్లాడుతున్నట్టే ఉంది…
  ఏకాంతపు దిలీప్

 4. “చాలాసార్లు నా చినప్పటి స్నేహితులు అనుకోకుండా కలిసినప్పుడు ఏమి మాట్లాడటానికి ఉండదు. ఎవో ఉద్యోగాల గురించి అడిగి ఊరుకుంటా. ప్రవర్తనలో కూడా చనువుపోవటం చూసాను.” – అసలైన నిజం ఇది!

  ఒక్కసారి మీరు “నేమ్ సేక్ ” అనే మీరా నయర్ సినిమా చూడండి ; ఇంతకంటే ఎక్కువ బాధని చూపిన సినిమా కానీ అందులో సత్యం వేరు : గోగోల్ అనే పేరు గురించి తెలుసుకొని ఆ సత్యం తెలుసుకోండి.

  తొందర్లో ఇంటికొచ్చేస్తారు ; ఎంజాయ్ చేస్తారు అనే మాటలకి స్వాంతన చెందద్దు.ఆ సినిమా చివర్లో ఒక పాట వస్తుంది టైటిల్స్ అప్పుడు – వినండి (డివిడి లో సబ్ టైటిక్స్ చదవండి!).

  దేశం విడచి వెళ్టేనే తెలిసి సత్యం కాదు – ఉన్న ఊరు వదలి వెళ్ళినా తెలుసుకునే సత్యం!

  (ఆరు నెలలే కాబట్టి ఇది మీకు వర్తించకపోవచ్చు)-
  వెనక్కి వెళితే – మనం అనుకున్నట్టుగా ఇల్లు ఉండదు;అది కూడా కాలంలో మారిపోతుంది; మనుష్యుల్లోనూ మార్పుండొచ్చు.అప్పటికీ మీలోనూ మార్పులుంటయి. మీ దృష్టిలో మీకు ఒకటేదో ఇష్టమే.కానీ మీకిష్టమయ్యిన వాళ్ళు మీకది అంతగా నచ్చదుగా అన్నప్పుడు మొహమాటంగా నవ్వేస్తారు – వీరికి ఎప్పుడు ఎందుకు ఈ భావం కలిగిందో తెలుసుకునే ప్రయత్నంలో మీలో మార్పు మీకు తెలుస్తుంది.

  ఒంటరి తనంలో గుర్తొచ్చిన ఇల్లు – ఓ మధుర స్మ్రృతి.

  ఆఫ్ కోర్స్ మీరు రాకుడదు అని చెప్పట్లేదు; నా మటుకు నేను ఇండియాలోనే ఉండాలని ఉంది.ఆ డెసిషన్ తీసేసుకునే సత్తా ఉండాలిగా!!

  లేనప్పుడు – మీ ఇల్లు ని మీరు నిర్మించుకోవల్సిన సమయం ఆసన్నమయ్యింది.మీ ఇంటిలో ఒకరికి ఆతిధ్యమివ్వగల సమయం ఆసన్నమయ్యింది! మీ అమ్మ చేసింది, నాన్నగారు చేసిందే చేయాలని మీరు ప్రయత్నిస్తారు – త్వరలోనే మీదంటూ ఓ సోంత పద్ధతి ఏర్పడి పోతుంది.అందుకని, జాగ్రత్తగా మీ “పద్ధతి”ని “ఉన్నతం”గా చేసుకునటానికై శ్రద్ధ పెట్టండి.

  చాలా అందంగా రాశారు – ఎవరికన్నా ఈ ఆనందాన్ని మీరు కల్పించండి:

  నే ఇసుకతో ఇల్లు కడితేనే మురిసిపోయి నన్ను ఊరేగించిన భుజాల తోడుకావాలి.
  అ ఆ లు రాస్తేనే సంబరపడి హత్తుకున్న చేతులు కావాలి.
  గల్లీ క్రికెట్లో సిక్సర్ కొడితే అబ్బురపడి ప్రోత్సహించిన చప్పట్లుకావాలి.
  ఏంచేసినా సై అని నావెంటే ఉండే అడుగులు కావాలి.
  చింపిరి జుట్టుతో నే స్టైల్ కొట్టినా నా అమాయకపు ప్రేమని గుర్తించిన ఆ చిరునవ్వు కావలి.

  “ఇవన్నీ మనజీవితంలో రోజూ మరలా మరలా జరగటానికి తగినంత సమయం కావాలి” – ఆ సమయం మిదవుతుంది – ఇది చేసి వారినించి ఏమీ ఆశించకండి – మళ్ళీ డిసప్పాయింటవ్వచ్చు.

  ఇది చేస్తే – పెళ్ళికి ముందు (ఒకవేళ కాకపోతే) మీకు ఒక్కసారైనా విశ్వజనీన ప్రేమ అంటే ఏంటో అనుభవానికొస్తింది.(పెళ్ళయితే మళ్ళీ మీ ఇంటికి, కుటుంబానికి లిమిట్ ఔతుంది.అవ్వాలి కూడా!)

 5. “మనసున మనసై బ్రతుకున బ్రతుకై” బావుంది .” మనకి మనమే తవ్వుకున్న గొయ్యలాంటి ఒంటరితనం.” సరైన పదప్రయోగం .చాలామంది బైట పడకుండా డాలర్ల మాటున కప్పేసిన మానసిక సంఘర్షణ అద్భుతంగా రాశారు .

 6. అంత ఏకాంతం అనుభవించకపోతే ఏ కాంతనో పెళ్ళి చేసుకోవచ్చు కదా..
  ఈ ఆధునిక యుగంలో స్నేహితులతో ఎక్కడనుంచైనా మాట్లాడవచ్చు కదా.

  జీవితంలో ఒకటి కావాలనుకొంటే ఇంకోటి కోల్పోవాలి.

 7. నే ఇసుకతో ఇల్లు కడితేనే మురిసిపోయి నన్ను ఊరేగించిన భుజాల తోడుకావాలి.
  అ ఆ లు రాస్తేనే సంబరపడి హత్తుకున్న చేతులు కావాలి.
  బాగుంది మురళి గారు! మీరు ఇక్కడ రాసిన ప్రతీదీ క్రొత్తగా అమెరికాకి వచ్చిన వాళ్లకి అనుభవమేనేమో! ఏడాది క్రితం నా మానసిక సంఘర్షణని మీరు మళ్ళీ తట్టినట్టుంది మీ ఈ టపా చదువుతుంటే!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s