మన తెలుగుబ్లాగర్లందరి తో నా ఆలోచన పంచుకోవాలని ఈ టపా పెడుతున్నాను. నా ఆలోచన వెనక రెండు విషయాలు ఉన్నాయి.
1.ఈ మధ్య కొందరు బ్లాగర్లు కనుమరుగవుతున్న తెలుగు భాష గురించి ఆవేదనగా టపాలు వ్రాసారు. అందరం కూడా చదివి నిజమే కదా అనుకున్నాం.
2.ఇక్కడ బ్లాగులలో ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించి హిపోక్రసీ కి దూరం గా వ్రాయగలిగే ప్రతి ఒక్కరిని రచయితలుగా, విశ్లేషణాత్మక వ్యాఖ్యలు వ్రాసే మిత్రులను విమర్శకులు గా గుర్తిస్తున్నాం.
ఇప్పుడు నా ఆలోచన ఏమిటంటే మన ప్రపంచం లో మన ఆవేదన,ఆక్రోశం మనలోనే ఉండిపోతుంది తప్ప మన ఆంధ్రరాష్ట్రం లో మిగిలిన వారికి చేరటం లేదు.మనలో మనమే భాధపడటం అలానే మనలో మనమే ఓదార్చుకోవటం వలన ఏమిజరగదు.
కానీ మనం ఏమి చేయగలం?
మనం పూర్తిగా ప్రజల్ని మార్చ లేకపోవచ్చు. కానీ ఒక ముందడుగు వేసితెలుగు భాష మీద కాస్త గౌరవాన్ని పెంచగలమని నా భావన. పెద్ద పనులేమీ చేయనక్కరలేదు. పెను చీకటి ని పారద్రోలటానికి ఒక చిన్న దీపం చాలు. అలానే మనమున్న చీకటిని పోగొట్టటానికి ప్రతీ మనసులో ని చిన్న సంకల్పం చాలు.
మన బ్లాగు లోకం తరపున “తెలుగు ఆత్మగౌరవ పునరంకిత దినం” గా ఒకరోజుని గుర్తించి ఆ రోజున తెలుగు వారి గౌరవాన్ని పెంచే చిన్న పనులు చేయవచ్చు. అవి ఎలాంటివి అనేది బ్లాగులోకం లో పెద్దలు నిర్ణయిస్తే బ్లాగు లోకం లో రచయితలుగా, విమర్శకులు గా ఉన్న పిన్నలూ,పెద్దలూ భుజానికెత్తుకోవడమే. విస్తృతంగా వ్యాపించిన మీడియా(టి.వి.9,ఎఫ్.ఎం., వార్తాపత్రికలు) సహాయం తీసుకొని ప్రజల లోకి తీసుకుపోవచ్చు. బత్తిబంద్ కి ఇచ్చినట్టే దీనికి కూడా పిలుపునివ్వవచ్చు.
నా చిన్ని మెదడు కి తట్టిన ఆలోచన.
ఆ రోజు ఒక బ్యాడ్జి ధరించవచ్చు “నేను తెలుగువాడిగా పుట్టినందుకు గర్విస్తున్నా” అని. ఇలాంటి చిన్న చిన్న పనులను ఒక ఉద్యమంలా తీసుకొని ఆ రోజున మనం చేసి పదిమంది చేత చేయించవచ్చు. ఇది తెలుగు బ్లాగుప్రపంచం తెలుగుభాషకి చేసే చిన్న సేవ.
ఇది ఆచరణయోగ్యం కాదు, ఆమోదం కాదు అంటే వదిలి పెట్టండి.
జై తెలుగు తల్లి.
ముంగిలి » Uncategorized » తెలుగు ఆత్మగౌరవ పునరంకిత దినం
బానే ఉంది ఆలోచన!! ఆలోచించాలి దీని గురించి!!
మంచి సంకల్పం. ప్రస్తుతం బ్లాగులకున్న పరిమితమైన పరిధి వల్ల ఆచరణకు కాస్త సమయం పట్టవచ్చు. కాని అసాధ్యం కాదు. విజయోస్తు.
మంచి ఆలోచన.
మంచి ఆలోచన! ఇప్పటికే భాషా పరిరక్షణ సమితి వాళ్ళు ఒక పరిరక్షణ దినం జరుపుతున్నట్టున్నారు. మనం ఆరోజే జరపొచ్చు.., లేదా మరో రోజునైనా జరపొచ్చు.
ఆలోచన బావుందండి. ముఖ్యంగా ఇది అందరిలో తెలుగుభాషమీద అభిమానం, అవగాహనా రెండూ కలిగించేట్టు ఉంటే బావుంటుంది.
దీన్ని ఎలా చెయ్యాలన్నదానిగురించి నలుగురూ కలిసి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇలాటి ఆశయంతోనే నేను తెలుగువీరలేవరా (teluguviralevara.blogspot.com) బ్లాగు మొదలుపెట్టాను. మీకు అభ్యంతరం లేకపోతే, ఈ చర్చని అక్కడ మొదలుపెట్టవచ్చు.
ఆలోచన మంచిదే అందరు అన్నట్టు,
కని ఆగస్ట్ 15 తర్వాత మనం (ప్రజలు) మల్ల దేశం గురించో / స్వతంత్రం కు ఉన్న విలువ గురించో అలోచించం, ఇదిగూడ అట్లనే అయ్యే ప్రమాదం ఉన్నది.
కాక పోతె మన అలోచనలను, మనకు ఉన్న పరిచయాలతోటి మనకు ఉన్న ప్రచార మాధ్యమాల (TV /Electronic / Print media) ద్వార మిగిలిన ప్రజల దగ్గరికి తీసుక పోవాలి. అప్పుడు ఎక్కువ మందికి అవగాహన పెరుగుతదని నా ఆలోచన.
(This is just a personal thought, please add to it)
పింగుబ్యాకు: బ్లాగుదినోత్సవం « మురళీ గానం
మురళిగారు,
ఇదే ఆశయంతో ఒక గూగులు గుంపుని మొదలుపెట్టాను.
దాని గురించి ఇక్కడ వట్టి మాటలు కట్టి పెట్టోయ్! గట్టి మేల్ తలపెట్టవోయ్! చూడవచ్చు.
ఆసక్తి ఉంటే అందులో చేరి మీ ఆలోచనలు పంచుకోండి.
అప్పటి బ్లాగులు ఇప్పుడు అస్సలు activeగా లేవు – మీ బ్లాగ్‌తో సహా – కారణం ఏంటో మరి?!
అప్పటిలో బ్లాగులు వ్రాసే వాళ్ళలో ఎక్కువమంది ఉద్యోగం కోసం ఊరు మారి సింగిల్‌గా సిటీలో ఉన్న అబ్బాయిలు/అమ్మాయిలు లేదా కొత్తగా పెళ్ళయ్యి సిటీకి వచ్చి ఇంటిలో ఉబుసుపోక నెట్ లో అడుగుపెట్టిన అమ్మాయిలు. జనరలైజ్ చెయ్యటం లేదు, మేజర్ పర్సెంటేజ్ అని చెబుతున్నా. వీళ్ళంతా పెళ్ళయ్యాక లేదా పిల్లలు పుట్టాక కనుమరుగైపోయారు. మరికొందరు స్థాన చలనాలు, పని ఒత్తిడి పెరిగటం వంటి కారణాలతో వ్రాయటం ఆపేసారు.
ఇలాంటి వ్యక్తిగత కారణాలు పక్కన పెడితే, సోషల్ మీడియా అతి పెద్ద కారణంగా చెప్పుకోవచ్చు. ఫేస్బుక్, వాట్సాప్ వచ్చాక బ్లాగులో రీడర్షిప్ బాగా తగ్గింది. దానితో పాటే జనాల్లో ఆసక్తి. మొబైల్ మన టైమ్ చాలావరకూ కన్జ్యూమ్ చేసేస్తుంది కదండి. అందరూ మరలా వ్రాయాలని కోరుకుందాం.