ముంగిలి » కథలు » నేటికి నెరవేరిన మూషికవరం

నేటికి నెరవేరిన మూషికవరం

ఆ ప్రకారంగా నైమిషారణ్యంలో సేదతీరుతున్న ఋషిపుంగవలకి అటువైపుగా వచ్చుచున్న శుకమహర్షి దర్శనం కలిగింది. అందరూ ఆ మహా భాగవతునికి సపర్యలు చేసి,స్తుతించిన పిమ్మట ఆ మహానుభావుని ద్వార కధాకాలక్షేపాన్ని ఆశించినవారై “స్వామీ! ఇది వరకు మానవమాత్రులెవరికి తెలియనిది, ఎవరికి ఎవరిచేత చెప్పబడనిది, ఇంకనూ దైవరహస్యముగానే ఉన్న వృత్తాంతమేమైనా ఉంటే ఈ సమయం లో మాకు చెప్పవలసినది” అని వినమ్రంగా ప్రార్దించారు. వారి సపర్యలకి సంతుష్ఠుడైన శుకమహర్షి చిరునవ్వు తో “తప్పకుండా చెబుతా. కానీ ఈ విపరీత కోరిక ఎందుకు కలిగింది నాయన?” అని అడిగారు.

ఇంతలో చిరు జల్లులు మొదలయ్యాయి. చంద్రబాబు హయాంలో ఆకస్మిక తనిఖీ లు, వైయస్ పాలనలో అకాల వర్షాలు తప్పవని అనుకుంటుంటే ఋష్యశృంగులవారు విచ్చేసారు. ఆ చిరుజల్లులు ఆయన రావటం చేత అని గ్రహించిన ఋషులు దేవునిపాలనను (అంధ్రప్రదేశ్ లో) అనుమానించినందుకు కించిత్తు చింతించి మిగిలిన కార్యక్రమాన్ని కొనసాగించేందుకు కుటీరాలలోకి పరుగు తీసారు.శుకమహర్షి తనకై ఉద్దేశించబడిన ఆసనం లో ఆసీనులయ్యాక ఋషులు సమాధానం చెప్పనారంభించారు.

“స్వామీ! మేము చదవని పురాణాలు, వినని వృత్తాంతాలు లేవు. ఆ కారణం చేత కొత్త కధలు వినాలన్న ఆరాటం లో మానవులలాగా సినిమాలకి అలవాటుపడ్డాం. ఈ మధ్య కాలం లో వస్తున్న తెలుగు సినిమాల్లో పాత్రలు తప్ప కధలు అంతరించిపోయాయి. సినిమాకి వెళితే చేతి చమురు వదులుతుందే తప్ప ఇసుమంతైనా కొత్త దనం లేదు. కధానాయకుల విన్యాసాలకు అంతులేదు. దేవదేవుడైనా సింహాసనం వద్దకి వెళ్ళి ఆసీనుడవుతాడు. కానీ తెలుగు హీరోల వద్దకే సింహాసనాలు పరుగెత్తుకొస్తాయి. సాక్షాత్తు భగవంతుడు రధసారధి గా వీరాధివీరుడు ఆర్జునుడు యుద్దానికి వెల్లినా కౌరవసైన్యం లో భంటు కూడా వెన్ను చూపలేదు. కానీ తెలుగు హీరో ని చూస్తే అరివీర భయంకరులు, మహా ముష్కరులు అయిన దుండగులు అస్త్రసన్యాసం చేసి పారిపోతారు. టైటిల్ పడక ముందే మలుపులు, పోష్టర్లు చూడగానే కధలు తెలిసిపోతున్నాయి కాబట్టి చిన్నదైనా ఒక కొత్త వృత్తాంతం కోసం మనసు పరిపరి విధాల తపిస్తుంది” అని తన సుదీర్ఘమైన ప్రసంగాన్ని ముగించాడు దిగులు ముఖంతో, గడ్డం సగం ఊడిన కుర్ర ఋషి.

ఋష్యశృంగులవారు విషయం అవగతమైన వారై  “మహర్షి! ఈ కుర్ర రిషి తన భాధని సుదీర్ఘంగా శేఖర్ కమ్ముల గోదావరి సినిమాలా సాగతీస్తూ వెల్లగక్కాడు.  తమరు మాత్రం ఎన్నాళ్ళు ఆ శ్రీ హరి కధలు చెబుతారు, బి.గోపాల్ బాలకృష్ణ తో వరసగా సినిమాలు తీసినట్టు. పాపం వీళ్ళ కోసం ఒక సరి కొత్త కధ చెప్పండి.” అని వివరించారు. శుకమహర్షి చిరునవ్వుతో చెప్పనారంభించారు.

పూర్వం ఒకానొక మహారణ్యంలో జంతువులన్నీ ఒక గొప్ప ఉత్సవాన్ని జరుపుంటున్నాయి. ఆ ఉత్సవంలో లేని వింతలు,విశేషాలు లేవు. ఆ ఉత్సవానికి దేవతల వద్ద ఉండే జంతువులని, మృగాలని పిలిచారు. వీరిని సంతోషబెట్టి తమపనులు దేవతలకి వీరిద్వారా విన్నవించవచ్చని ఆలోచన. విందులు, వినోదాలు ఘనంగా జరుగుతున్నాయి. సురాపానం (అదే లెండి కల్లు తాగాయి) చేసిన జంతువులన్నీ పిచ్చి ఆననదంతో గెంతులు వేస్తున్నాయి.అతిధులుగా వచ్చిన జంతాగ్రేసరులనందరినీ ఘనంగా సత్కరిస్తున్నారు. సింహాలని, పులులని, ఏనుగులని అలా అందరిని ఘనంగా సత్కరించారు. తన సకల పరివారం తో సహా వేంచేసిన మూషికరాజుని మాత్రం ఎవరూ గుర్తించలేదు.

దానితో తన పరివారం ముందు జరిగిన అవమానాన్ని భరించలేని మూషికరాజు ఆగ్రహంతో ఊగిపోతూ “లోకంలో ప్రధమ పూజ్యుడు, విఘ్నరాజు వాహానాన్ని నేను. ఆ మహాదేవుని కి సమస్త లోకాలని చూపేది నేనే. మరి నేను లెజెండ్ ని కాదా? ఇప్పుడే తేలిపోవాలి ఎవరు లెజెండు, ఎవరు సెలబ్రిటీ?”

ఇంతలో ఎవరో వజ్రోత్సవాలు అయిపోయాక మోహన్ బాబు గారిని అడిగి చెబుతామన్నారు.

“మీరు పుస్తకాలు అచ్చేసే వరకు ఆగే ఓపిక లేదు. ఇప్పుడే తేల్చండి.”

అప్పుడు అక్కడుండే జంతువులన్నీ అవహేళన చేసాయి. ఎవరూ లెక్క చేయలేదు. “నీకు అంత గౌరవం కావాలంటే నీ ప్రభువినే అడుగు పో. ఇన్నాళ్ళు  మోసినందుకు ఆయన నీకు ఏమాత్రం గౌరవమిస్తారో చూస్తాం” అని హేళన చేసాయి. ఆ ఆగ్రహంతో మూషికరాజు తన పరివరానికి అక్కడ ఉత్సవాన్ని నాశనం చేయమని ఆదేశించి సరాసరి వినాయకుని వద్దకు వెల్లింది.

జరిగినది మొత్తం చెప్పి “తమరు లోకంలో ఉన్న భక్తులందరి కీ వరాలు ఇస్తారు. ఇన్నాళ్ళుగా నాకు మాత్రం ఒక్క వరం కూడా ఇవ్వలేదు. ఈ రోజు వరం ఇచ్చి తీరవలసినదే” అని పట్టుబట్టింది. కాదనలేని స్వామి కోరుకోమన్నాడు.

“ఇకనించి తమరు పూర్తిగా నా మీదే ఆధారపడి ఉండాలి. ప్రపంచం మొత్తం నా మీదే ఆధారపడి నడవాలి. నన్నందరూ అందలమెక్కించాలి. నేను లేకపోతే ప్రపంచం లో పనులన్నీ ఆగిపోవాలి.” అని ఆవేశంతో చుంచు గోల చేసింది.

స్వామి ఇరుకున పడ్డాడు. కాదంటే రేపటినుంచి నిర్వాహనుడయిపోతాడు. హోండా లు, ఆడీలు వాడేంత ధనవంతుడు కాడు. భిక్షాటన చేసే తండ్రి, ఇల్లేమో శ్మశానం. ఇప్పుడు వాహనంకూడా లేకపోతే సాటి దేవతల ముందు పరువుపోతుంది.

“సరే మూషికా, అట్లే కానివ్వు. వరం ఇస్తున్నా తీసుకో. నీవు కోరినట్టు కలియుగంలో ప్రపంచం మొత్తం నీ ఆకారపు మూర్తులని చేపట్టి నీ మీదే ఆధారపడి నడుస్తుంది. ఇకపోతే నాకు ఎలాగూ నీవే ఆధారం. కాబట్టి ఇకపైన  నీ మూర్తులని చేపట్టిన మానవులు నా వంటి రూపాన్ని పొందుతారు. అనగా బానపొట్ట తో నా వలెనే కనిపిస్తారు. కావున నేనే నీ పై ఆధారపడినట్టు నీకు సంతృప్తి కలుగుతుంది.” అని వరమిచ్చాడు. ఈవిధంగా కధని పూర్తి చేసి శుకమహర్షి, ఋష్యశృంగులు సెలవుతీసుకొని వెళ్ళిపోయారు.

అదండీ సంగతి ఆ వరం వల్ల ప్రపంచం ఈ రోజున మౌస్ మీద ఆధారపడి నడుస్తుంది. మౌస్ చేతపట్టిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్లకి పొట్ట సంక్రమించింది. ఈ విషయం తెలీక నానా హైరానా పడి మా వాళ్ళు జిమ్ము లనీ, యోగా అనీ చాలా చేస్తారు. అయినా ప్రయోజనం లేదు. పై పెచ్చు ఈ టెన్షన్ వల్ల జుత్తు ఊడిపోవడమనే కొత్త సమస్య. అందుకే ప్రియతమ సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు జరగాల్సిందే జరుగుతుంది. మీరు అనవసర హైరానా పడకండి. జై మూషికా జై జై మూషికా అని సరిపెట్టుకోండి..

23 thoughts on “నేటికి నెరవేరిన మూషికవరం

  1. సెబాష్!
    వచ్చే భాద్రపదమాసంలో వినాయక చవితితోబాటు మూషిక వ్రతం కూడా చేసి ఈ పుణ్య కథని విన్నవారు గొప్పగొప్ప సాఫ్టువేరు జాబులను బడసి సౌఖ్యమున నుండెదరు గాక!

  2. ఛూస్తే కంప్యుటర్ యుగానికి చెందినట్టున్నారు, ఈ పురాణాల గ్రిప్ ఎక్కడినుంచి సంపాదించారు స్వామీ?
    పోష్టు బాగా నవ్వించింది.
    బొల్లోజు బాబా

  3. నరేంద్ర భాస్కర్ S.P
    చాలా బాగుందడీ మీ నైమిశారణ్యం లో మూషిక పర్వం,
    ప్రత్యేకించి
    రాజకీయ, సినీమా, వర్తమానానికి లంకు కలపడం, సరళమైన భాష,
    నెనర్లు, మంచి టపా

  4. అయ్య బాబోయ్ మురళీ,,,,, నీ దగ్గర చాలా విషయం ఉందబ్బా…… ఎక్కడ మూషికము…. ఎక్కడ సాఫ్ట్ వేర్…. చివరకు వచ్చేటప్పటికి ఇంత పెద్ద ఝలక్ ఇస్తావనుకోలేదు…. టోపీ తీసి పెట్టేశా…. ఇలాగే నరికెయ్

  5. పింగుబ్యాకు: బ్లాగు ప్రయాణంలో మూడేళ్ళు « మురళీగానం

  6. బగా హాస్యం పండించావు 🙂
    current/voltage affairs ని బాగా లింకు చేశావు. ౠషులూ, నైమిషారణ్యమూ రావడంవలనేమో శైలీలో అక్కడక్కడా ఉషశ్రీ వారు కనబడుతున్నారు. బాగుంది, మురళీ.

  7. బాగుంది మురళి గారు. అప్పుడప్పుడు నా మూషిక రాజు మొరాయిస్తున్నాడు. దీని నివారణార్ధం వ్రతవిధానం ఏమైనా ఉంటే తెలియ చేయండి. 🙂

Leave a reply to నరేంద్ర భాస్కర్ S.P స్పందనను రద్దుచేయి