ముంగిలి » Uncategorized » హ హా హాసిని

హ హా హాసిని

కొన్నేళ్ళ క్రితం శంకరాభరణం సినిమా వచ్చిన కొత్తలో వయస్సు మళ్ళిన తాతగార్లంతా “స రీఈఈఈఈఈఈ గాఆఆఆఆఆఆఆఆ మాఆఆఆఆఆ” అంటూ బ్యాటరీ అయిపోయిన రేడియోలా రోడ్లమీద ‘ఖూనీ’రాగాలు తీస్తూ హీరోల్లా ఫోజులు కొట్టారంటా. (నాకు తెలియదులెండి నేనప్పటికి పుట్టి చావలే.ఎవరో చెప్పగా విన్నా.) ఆ తరువాత సోగ్గాడు శోభన్ బాబులు, దసరా బుల్లోల్లు, సకల వాహన చోదకులు (ఆటో డ్రైవర్,లారీ డ్రైవర్ తదితరులు), గూండాలు,రౌడీలు అంతెందుకు నిన్న కాక మొన్న జె.డి.చక్రవర్తి ని చూసి గెడ్డం గాల్లు, నిన్నటికి నిన్న ఆర్య సినిమా చూసి ఒకవైపు ప్రేమికులు అందరూ సినిమాలు చూసి తమని తాము సినిమాలో హీరో గా గుర్తించేసుకొని, ఫోజు కొట్టిన వారే. ఇప్పుడింక మరొకరు తయారయ్యారు. వాళ్ళే హ హ హాసిని లు. బొమ్మరిల్లు,JOB WE MET సినిమాల పుణ్యమా అని లొడ లొడ వాగే వాగుడుకాయలు, పిచ్చి పనులు చేసే టింగరి బుచ్చిలు, మనుషుల పరిమాణం పెరిగినా మెదడులో పరిఙ్ఞానం లేని చవట దద్దమ్మలు ఫోజులు కొట్టేకాలం దాపురించింది. ఇంక అరుదుగా దొరికే ఈ జాతి అమ్మాయిలని తమ ఆడస్నేహితుల జాబితా లో చేర్చుకుంటే ఉన్న పళంగా తాము కూడా సిద్దు అనిపించుకోవచ్చని ఆరాట పడే చవట సన్నాసులంతా అమీర్ పేటలో ఐసుబండ్ల దగ్గర, టాంక్ బండ్ పైన పీసు మిఠాయి కొట్ల దగ్గర పడిగాపులు కాస్తున్నారు. మన హాసినీలు మాత్రం every dog has it’s day. టైం వచినప్పుడే ఫోజు కొట్టాలన్న సూత్రం సిన్సియర్ గా ఆచరిస్తూ తమ చీముడి ముక్కులు ఎగబీలుస్తూ, షోడా బుడ్డీ కళ్ళ జోళ్ళు సవరిస్తూ ఫ్యాషన్ షో చూపిస్తున్నారు. మన సన్నాసులు ఆ మెల్ల కళ్ళలో అందాన్ని పొగుడుతూ, ఆ జడ్డి నవ్వు కై పడి చస్తున్నారు. (అరెరే అరెరే మనసే జారే…, ఎటో వెళ్ళిపోయింది మనసు…)
హు.. ఈ మధ్య నాకో హాసినితో పరిచయం పొందే మహద్భాగ్యం (?) దక్కింది. (కాకపోతే నేను సిద్దు ని కాను. కాదు కూడదు అనుకుంటే భాస్కర్ గా గుర్తించ ప్రార్ధన.) ఈవిడగారెమన్నా తక్కువతిన్నారా? సినిమాలో హాసిని కంటే నాలుగు నాలుగులు పదహారాకులు ఎక్కువ చదివింది. అర్ధరాత్రి టాంక్ బండ్ పైన షికారని వెళ్ళటం, తరువాత భయపడి స్నేహితులని పిలవటం, రైల్లోనో, బస్సులోనో పరిచయమయిన అడ్డమయిన వాళ్ళకి పూర్తి బయొడేటా, మొబైల్ నెంబరు తో కలిపి ఇవ్వటం, తర్వాత తంతు షరామాములే వచ్చే కాల్స్ మాట్లాడలేక నెంబరు మార్చటం, రాత్రి 9 గంటలకి అనగా భోజనానికి 10 నిమిషాల ముందు దుకాణం మొత్తం కట్టేసి వెళ్ళిపోతున్న టీకొట్టువాన్ని పారిపోకుండా పట్టుకొని ఆపి టీ నో కాఫీ నో త్రాగటం ఇంకా.. ఒక్క క్షణం దాహంగా వుంది మంచి నీళ్ళు త్రాగి వస్తా. హమ్మయ్య..ఇంకా ఆటో అంకుల్లు, ఆఫీసులో సెక్యూరిటీ గార్డు ఫ్రెండులు, అప్పుడప్పుడూ చూడటానికి వచ్చి వెళ్ళే  తుమ్మ మొద్దులాంటి పెళ్ళికొడుకులు ఇవన్నీ కలిపితే మా సదరు అప్పలమ్మ గారి వైభోగం లో సగం కూడా కాదు. అందుకనే మొదలుగునవి అని చివర్లో మీరే పెట్టేసుకొని నన్ను క్షమించేసుకోవలసినది గా ప్రార్ధన.
ఎప్పుడూ ప్రత్యక్షంగా చూడని ఆ మనిషి మా వూరే అని తెలిసి మాట్లాడా. మొదట్లో ఆఫీసుకి వెళ్లే తొందరలో టిఫిన్ తినే వాడిలా అరకొరగా మాట్లాడేది. అమ్మాయి నెమ్మదస్తురాలేమో అనుకున్నా. ఒకరోజు అత్యవసరం ఉండి ఫోన్ చేసా. కాసేపటికి మొహమాటం అనే బూజు వదిలిపోయి తన జూలు విదిల్చింది. రాత్రి 10.30 కి మొదలయ్యి తెల్లవారి 3 గంటల వరకూ కొనసాగిన ఏకపక్ష చర్చల్లో (చర్చలు అని ఎందుకన్నా అంటే ఊ.. కొట్టడం, కొన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పటం నా క్రియాశీలక ప్రాతినిధ్యం గా గుర్తించాలి మీరు. ) నాగురించి అన్ని విషయాలు తెలుసుకొని, తన గురించి కొన్ని విషయాలు మాత్రం చెప్పి వాళ్ళ హాస్టల్ లో మరుసటి రోజు కూర వండటానికి తెచ్చిన కోడి కూసేసిందని పడుకోవాలని తొందరపడి ఫోన్ పెట్టేసింది. తరువాత కొన్ని రోజుల పాటు యధాలాపంగా అంతే సమయం జరిగిన ప్రసంగాల్లో (నా క్రియాశీలక ప్రాతినిధ్యం పూర్తిగా అణిచివేయబడిందని ఈ పాటికి గుర్తించే ఉంటారు.) తన గురించి ఒక మాదిరి అవగాహన ఏర్పడింది. అలా రోజులు ఇడ్లి(మా హాస్టల్ ఎల్లారావు వండే సగం ఉడికిన తెల్ల పిండి ముద్దలు) లో సాంబారులా త్వరగా అయిపోయాయి.

కాలచక్రం గిర్రున తిరిగి ఉగాది కి ఇంటికి బయలు దేరాను. మా హాసిని కూడా ఊర్లో పనుందని బయలు దేరింది. ఆప్రకారంగా నేను తనకూడా ప్రయాణం చేసే దుస్సాహసం చెయ్యాల్సి వచ్చింది. సాహసవంతుడు మొండి గా ముందు కి వెళ్తాడు. కానీ నేను ఒక మోస్తరు గడుసువాడ్నే. అందుకే నా స్నేహితుడ్ని తోడుగా తీసుకువచ్చా. అప్పటికే టిక్కెట్ నా దగ్గర ఉంచుకొని చివరి నిమిషంలో రన్నింగ్ లో రైలు ఎక్కినందుకు, నేను రాకముందే మొదలు పెట్టిన తిట్లదండకం కొనసాగించింది. చుట్టూ కూర్చున్న జనాలు తన వాక్ప్రవాహాన్ని గమనించి, అప్పుడే మొదలయిన కొత్త సినిమాని చూస్తున్నంత ఆసక్తి గా చూడటం మొదలు పెట్టారు. కాసేపటికి అర్ధంకాని ఆంగ్ల చిత్రం చూస్తున్నట్టు మొహాలు మారాయి. రైలు గుంటూరు చేరే సరికి జనాల గుండె దైర్యం సడలింది. విజయవాడ వచ్చేసరికి దూరదర్శన్ లో బలవంతంగా బదిరులకి వార్తలు చూపిస్తున్నట్టుగా జనాల్లో కొంచెం కలకలం. వాళ్ళ ధైర్యం పరీక్షించటానికా అన్నట్టూ బ్రిడ్జ్ మీద ట్రైన్ ఆపేసాడు. విజయవాడ లో దిగాల్సిన జనాలు తమ సామాన్లతో అప్పటికే తలుపు దగ్గర కాచుకొని ఉన్నారు. ఆ అవకాశాన్ని దూరం చేస్తూ  ట్రైన్ మరోసారి ఆపేసాడు. అంతే ఒకరిద్దరు కృష్ణ లో దూకటానికి సిద్దపడ్డారు కానీ ఆ కనకదుర్గమ్మ దయవల్ల అప్పటికే ఆకలి అంటున్న మా హాసిని కాస్త విరామం ప్రకటించింది. ట్రైన్ స్టేషన్ కి చేరుకోగానే గబాలున దూకేసిన ఒక కుర్రాడికి గాయమైనా సరే ప్రాణాలు మిగిలినందుకు ఆనందపడ్డాడు. అందరూ ట్రైన్ వైపు ఒకసారి  దుర్గమ్మ గుడి వైపు ఒకసారి చూసి దండాలు పెట్టుకొని బ్రతుకు జీవుడా అని బయట పడ్డారు. మా పక్కనే కూర్చున్నాయన మాత్రం దిగినవారి అదృష్టం మెచ్చుకొని తన దౌర్భాగ్యానికి తిట్టుకొని నిద్ర కి ఉపక్రమించాడు. విజయవాడ వరకు మా హాసిని వేరే స్నేహితునితో మాట్లాడింది. నేను మహాసముద్రం నవల చదువుతూ గడిపేసా. అప్పుడిక నా తో మాటలు మొదలు పెట్టింది. మా ప్రక్కాయన పాపం మధ్యతరగతి లా వుంది. పీనుగులాంటి భర్త, ఒక మోస్తరు ఏనుగు లాంటి భార్య, ముద్దుగా బొద్దుగా కళ్ళద్దాలు పెట్టుకున్న ఒక మాదిరి కూతురు. పాపం ఆ కుటుంబం మొత్తం ఎవో బరువు భాద్యతలు మోస్తున్నట్టుగా భారంగా ఉన్నారు. ఆ పాప ట్రైన్లో కూడా క్లాస్ నోట్సులు చదువుకుంటుంది. అలాంటి వారికి ఒకేసారి హాసిని లాంటి వారు తగిలితే ఎలా వుంటుంది. కుటుంబ భవిష్యత్తు పై బెంగ పడిన అంకులు శివాలెత్తి తనకొచ్చిన ఆంగ్లభాష లో అర్ధగంట ఉపన్యసించి మా హాసినిని మందలించి పడుకొనేదాక ఊరుకోలేదు. వాడి దెబ్బకి పడుకున్న మా మేడం గారు ఉదయం వరకు లేస్తే ఒట్టు.

ఇంక మేము తెల్లవారే విజయనగరంలో దిగాము. టిఫిన్ చేద్దామని ఒక హోటల్కి వెళ్ళాము. మా దౌర్భాగ్యానికి అక్కడ ఒక ముసలాయన ఈవిడ్ని పలకరించి ఊరు,పేరు అడిగాడు. అంతే మాటలు మొదలు. సమయం సబ్బులా కరిగిపోతున్నా చలనం లేదు. మాతో వచ్చిన స్నేహితునికి ఈ వైపరీత్యం చూసిన తరువాత కళ్ళు తిరిగిపడబోయి కాస్త తమాయించుకొన్నాడు. నేనసలే ఢక్కమొక్కీలు తిన్నవాడ్ని కాబట్టి నాకేం కాలేదు. ఇంతలో పాస్ పోర్ట్  ఆఫీస్ కి వెళ్ళాము. ఆ రోజు ఆఫీస్ కి సెలవు. అప్పటికే కాళ్ళు పీకి అక్కడే కూలబడ్డాం. కూర్చోగానే ఓపికొచ్చి మరలా ఎదో ఒకటి మాటలు మొదలు పెట్టింది. మా వాడు దణ్ణం పెట్టి ఒక చెట్టు కిందకెల్లి పడుకొన్నాడు. పాపం ఒక సాఫ్ట్ వేర్  ఇంజినీర్ అలా చెట్టు కింద పడుకుంటే చాలా జాలేసింది నాకు. మా అమ్మాయిగారు కాస్తా తిరిగి వస్తా అని వెల్లింది. కాసేపటికి  ఒక చోట గుంపుగా తయారయ్యింది. ఈవిడగారు ఎదో చేసిందని భయపడ్డా. కానీ అక్కడున్న పోలిసు అంకుల్లతోనూ, అన్నయ్యల తోనూ కబుర్లు మొదలు పెట్టింది. సదరు గుంపు లో ఒక అన్నయ్యకి తన మొబైల్ ఇచ్చి చార్జింగ్ పెట్టమంది. మా వాడి కి ఈ విషయం తెలిస్తే కింద పడే వాడే కాని పడుకొని వుండటం వల్ల తెలియలేదు. నేను అబ్బే ఇలాంటి విషయాలకి జడిసే రకం కాదు. మా వాడు లేచాడు ఈవిడగారు కూడా సమావేశం ముగించి వచ్చింది. ఇంతలో ఒక పోలిసంకులు వచ్చి “నాన్నా ఈ రోజు సెలవు కదా రేపు వస్తే నీ పాస్ పోర్ట్ పని నేను చేయిస్తా. సరే రా ఎస్.పి. గారి తో పనుంది నేను ఉంటా” అని చెప్పి వెళ్ళిపోయాడు. మా వాడికి లీలగా ఏం జరిగిందో అర్ధమవుతూ ఉండగానే ధబ్ మనే శబ్ధంతో కిందపడ్డాడు. మరలా గుండె దిటవు చేసుకొని లేచాడు. ఇంతలో ఒక పోలిసు అన్నయ్య “నీకు ఫోన్ వచ్చింది రా..” మరలా ధబ్. ఇక నావల్ల కాదని బస్ స్టేషన్ కి లాక్కొచ్చా ఇద్దర్నీ. ఇచ్చట రిజర్వేషన్ చేయబడును అనే బోర్డు బస్ స్టేషన్ లో చూసి మేడం గారు  గోదావరికి రిజర్వేషన్ అడిగారు. లౌడ్ స్పీకర్ లో ధబ్. పాపం ఆ టికెట్ కౌంటర్ వాడు కింద పడ్డాడు. వాడి వెదవ జీవితం లో ఊహించి ఉండడు బస్ స్టేషన్ లో ట్రైన్ టికెట్ అడుగుతారని. నేను మాత్రం మా వూరి మధ్యలో ఉన్న తాండ్రపాపారాయుడి విగ్రహంలా ధైర్యంగా ఉన్నా. బొబ్బిలి బస్ వచ్చింది ఎక్కాం. ఖాళీ లేక మధ్యలో నిలబడ్డాం.  మేడంగారు ఇంజను పైన కూర్చున్నారు. ఈ లోగా మరో ధబ్. మా వాడే ముచ్చటగా మూడోసారి పడ్డాడు. ఎమయ్యిందబ్బా అని చూస్తే ఈవిడగారు డ్రైవరుతో మాటలు మొదలు పెట్టింది. ఈ గ్యాప్ లో డ్రైవర్ గారు చిన్న ప్రమాదాన్ని తృటిలో తప్పించారు. బస్సులో ఉన్న అంత మంది ప్రాణాలని దృష్టిలో పెట్టుకొని మేడం ని నాలుగు తిట్టి, చీవాట్లు పెట్టి నోరుమూసుకొని వుండమని గట్టిగా చెప్పి ఒక సీటు ఖాళీ అయితే అందులో పడేసాం. హమ్మయ్యా అని నేను,నా ఫ్రెండు ఊపిరి పీల్చుకున్నాం. ఇంతలో ఎవరివో మాటలు వినబడి అటు చూసా ఇంకేముంది ఈవిడే నిలబడి ఉన్న ఒకమ్మాయి కి చోటిచ్చి మాటలు మొదలు పెట్టింది. ధబ్ నా ఫ్రెండ్. ధబ్ ధబేల్ ధబ్ ఇంకెవరు నేనే.

ఎంతనుకున్నా సరే ఇలాంటి గమ్మతైన స్నేహితులు, స్మృతులు లేకపోతే నిత్యం సంఘర్షణతో సాగే జీవితం మరీ ఉప్పూ,కారం లేని వంట (మంట, పెంట కూడా) అయిపోదూ. అందుకే అందుకోండి హ హా హాసినీ లు జోహార్లు.

51 thoughts on “హ హా హాసిని

 1. మురళి మీరు మరీనూ..
  అమ్మాయి తనకై తాను మాట్లాడుతుంటే మీకేంటండి? కాకపోతే వినడం వినకపోవడమే మన చేతిలో ఉందిలెండి.
  అరచెయ్యిని అడ్డుపెట్టి ఎగసే అలల్ని ఆపలేం. కనులు మూసుకొని ఉదయించే సూర్యున్ని ఆపలేం. అలానే చెవులు మూసుకొని ఇలా లోడలోడా వాగే హా.. హా.. హాసినుల్ని అస్సలాపలేం.

 2. ఇలాంటి హాసిని ఒకత్తి నాకూ తగిలిందిలెండి, మనకసలే తెలియని అమ్మాయిని చూడగానే నాలిక తడారిపోయి గొంతులోంచి మాట పెగలదు.

  లాక్కోలేక పీక్కోలేక చచ్చాననుకోండి.

 3. మీకు 100 మార్కులిచ్చేయాల్సిందే మురళీ! ఓపిగ్గా పెద్ద టపా రాసినందుకు కాదు, హాసిని పాత్రను వాగుడు కాయగా గుర్తించినదుకు! బొమ్మరిల్లు లో దాని గోల భరించలేకపోయాను.ఈ మాటంటే చాలామంది నన్ను పిచ్చిగా చూసారు.

  మొత్తానికి 3 గంటలు కూడా సినిమాలో భరించలేకపోయానే, గంటలతరబడి భరించారంటే మీరు సామాన్యులు కాదు.

 4. అబ్రకదబ్ర గారికి, రాధిక గారికి, కె.మహేష్ కుమార్ గారికి, రాఘవ గారికి, దైవానిక గారికి, జగదీష్ గారికి, శివ గారికి నా ధన్యవాదాలు.

  వేణూ గారు వెన్నపూస రాయకపొతే, నా వెన్నుపూస విరుగుద్ది.

  సుజాత గారు గట్టిగా అనకండి మా హాసిని వింటే యుద్దానికి తయారయిపోతుంది.

  RSG గారు మీరు ఒక టపారయొచ్చన్నమాట.

  ప్రతాప్ గారూ సత్యం గ్రహించారు.

  అంజనీ, సురేష్ అన్న మీకు చూపిస్తాలెండి మన ఊరే కదా.

 5. సుజాత మనసులోమాట గారు,

  హాసిని వాగుడు మీరే కాదు, సినిమాలో హీరోగారి స్నేహబృందమూ తట్టుకోలేకపోయింది. ‘ఆయనకి తాగుడిష్టం, ఈవిడకి వాగుడిష్టం’ అని అందులోనే ఓ డవిలాగు కూడా ఉంది 🙂

 6. అబ్రకదబ్ర,
  ఈవిడ ఓవరాక్షనూ, దానికి తగ్గట్టే ఆవిడ డబ్బింగూ, రెండింటినీ భరించలేము ఆ సినిమాలో! సవితా రెడ్డి డబ్బింగ్ మిస్సమ్మ సినిమాలో భూమిక పాత్రకి టాప్ గా ఉంటుంది.

  కొత్తపాళీ గారు,
  హాసిన పాత్రే ఈ సినిమాకి ప్రాణం అని దర్శకుడు స్టేజీ మీద మెచ్చుకోవడం,ఆవిడ అసందర్భంగా హీరోని కావిలించుకుని ఏడవటం….సినిమా తర్వాత కూడా పెద్ద డ్రామా నడిచింది బొమ్మరిల్లు ప్రమోషన్ షోల్లో!

 7. అవును హాసినా మజాకా నా? ఆ పాత్ర లోనే ఎదో ఉందండి. చూడండి ఎంతమందిని చర్చలోకి లాగిందో.

  శ్రీ విద్య గారు, ప్రవీణ్ గారు నెనర్లు.

  సుజాత గారు,
  ప్రమోషన్ షోల్లో ప్రకాష్ రాజ్ మాత్రం తక్కువ తిన్నాడా? ఆయన కూడా నాలుగు కన్నీళ్ళు కార్చి తన పాత్రకి న్యాయం చేసాడు.

 8. మరీ షో కోసం కళ్ళనీళ్ళు పెట్టుకున్నారంటారా? నమ్మబుద్ధి కావడంలేదు. నిజంగా పెట్టుకున్నా నమ్మలేని రోజులొచ్చాయిలా ఉంది.

 9. నీలిమగారు,
  నెనర్లు.

  శ్రీనివాస్ గారు,
  తమాషకి కాదండి. నిజంగానే చిత్ర విజయోత్సవ సభలో తలా నాలుగు కన్నీటి బొట్లు కారిస్తే, జెనీలియా, సిద్దు వలవలా ఏడ్చారు.
  సిద్దు ప్రకాష్ రాజ్ ని కావలించుకొని, జెనీలియా సిద్దు ని కావలించుకొని ఒకరినొకరు ఓదార్చుకొని పెద్ద మెలోడ్రామా నడిచింది. You Tube లో ఉంటుందేమో ఒకసారి ప్రయత్నించండి.

 10. super gaa undi brother,,,,intaku mundu aa sinimaa ki nandi awardu icchinappudu kooda oka tapaa raasaanu saradaaga chadavandi…vaasini anipincindi mee haasini ..haa!!!! sini…vaa!!! cinee….. ante cinemaa pichollani coosthe vaa ani eadavalanipistundi.. naaku…sinimaa nea oka goppa vishayam annattu..heero edi cheste adi manamu cheyyaalannatuu batikestuntaru….paapam …..

 11. ఫణిమాధవ్ గారు,
  తప్పకుండా చదువుతా మీ టపా.

  శృతిగారు,
  హాసిని ఇప్పుడయితే ఫోన్లోనో, రోడ్డు మీదో ఎవరికో వాయించేస్తూ ఉంటుంది.

 12. ఈ బొమ్మరిల్లు హాసిని పాత్రకు సాగింపు దశావతారం సినిమాలోని ఆసిన్ పాత్ర.చస్తాం ఆ వాగుడువినలేక!
  ఇక శంకరాభరణం సినిమా విజయోత్సవాల్లో అయితే ఎన్ని వందలసార్లు,ఎన్ని ఊర్లల్లో విశ్వనాధ్ కు పాదాభివందనాలో!ఒక ప్రహసనం గా సాగేవి,చివరకు ఆయనకే విసుగొచ్చి ఆపించారు.వాటిముందు బొమ్మరిల్లు ఏడుపులు పిల్లలాట అనిపించాయి నాకైతే!

 13. పింగుబ్యాకు: హాసిని కి పెళ్ళి చూపులోచ్… « మురళీ గానం

 14. పింగుబ్యాకు: జావా జావా కన్నీరు « మురళీ గానం

 15. నాకూ మన “మనసులో మాట సుజాత” గారికి మల్లే హహ హాసిని అంటే పరమ చిరాకు. తెలుఁగు దేశం లో ఏ అమ్మాయిని చూసినా ఇదే వైనం. ఏదో కొజ్జా తెలుఁగు మాట్లాడడం, తమేదో జెనీలియా అనుకోవడం. “నేను yesterdayయే two times twoకెళ్ళాను. నాకు motions ఏమోనని doubt గా వుంది”. దేవుఁడా చంపెయ్యరా అని పిస్తుంది.

  కనీ మీ సఖి చాలా మంచి అమ్మయిలిగా వుంది. లేక పోతే మీరు అలా రాత్రి పదింటికాడ నుండి ప్రొద్దుట మూడింటివఱకూ అంత సేపు ఎందుకు మాట్లాడతారు ఫోనులోఁ? అదీను అంత త్వరగా మీ “స్నేహం” పాసుపోర్టు ఆఫీసుదాకా ఎందుకు పాకింది ?
  చూడబోతే..
  ఎవరో హ హ హాసినీతో ప ప ప్రేమలో పడ్డట్టున్నారు !!!

 16. కొత్తపాళీ గారు,
  అందుకే శశిరేఖా పరిణయం నెల తిరక్కుండా డబ్బాలు తిరిగొచ్చి జీ తెలుగులో వేసేశారు. ఆ మూడు గంటలే(మధ్యలో పది నిమిషాలకో బ్రేకు కూడా ఉంటే)శశిరేఖను, ఆమె వాగుడుని భరించలేకపోయాం. హాసిని కి తాత!

 17. రాకేశ్వ రా- Two times two…. LOL! .ఇంటి కాడుండి తెలుగు భలే బాగా వంట బట్టించుకున్నారుగా!!
  నాగమురళి- Lowell వచ్చాక పాపం హాసిని మరీ గుర్తొస్తుండాలి 🙂

 18. పింగుబ్యాకు: బ్లాగు ప్రయాణంలో మూడేళ్ళు « మురళీగానం

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s