నేను B.Sc. చదివే రోజుల్లో హ్యాపిడేస్ సినిమా లానే ఒక గ్యాంగ్ లా వుండేవాల్లం. దావుద్ D లాగా మేము కూడా మొదటి అక్షరాలతో MTS అని గ్యాంగ్ పేరు పెట్టుకున్నాం. ఏం చేసినా,ఎంత అల్లరి చేసినా? ఎవరికి దొరికేవాల్లం కాదు. మేము ప్రతిసారి పేపర్ లీక్ చేస్తున్నామని (PUBLIC exams కాదండొయ్) మా ప్రిన్సిపల్ దగ్గర నుండి, ప్యూన్ రమణ వరకు అందరికి మా మీద అనుమానం. మా క్లాస్మేట్స్ కైతే ఎలా అయినా మమ్మల్ని పట్టించాలని, మమ్మల్ని పొగిడే సార్స్ చేత తిట్టించాలని వాళ్ళ జీవితాశయం. అబ్బో అప్పట్లో మా ఇంటి చుట్టూ నిఘాలు, గూఢచారులు చాలా చేసారు. మేము చదువుతూ ఉండగా, ముఖ్యమంత్రి ఆఖస్మిక తనికీ కి వచినట్టు వచ్చి మా పుస్తకాలు పరిశీలించటం, అందులో పెన్నుతో మేము నక్షత్రం గుర్తులు పెట్టిన ప్రశ్నలు రాసుకొని వెల్లటం ఎన్ని చేసినా ఊహూ.. ప్రయోజనం లేదు. సూత్రధారిని నేనే అయినా పాత్రధారుల ఆచరణ అమోఘం. ముఖ్యంగా మా శ్రీనుగాడు. వాడి నట చాతుర్యానికి ఆస్కారులు, పురస్కారాలు ఎన్ని అయినా తక్కువే.
ఒకసారి ఎలా అయినా మా గుట్టు బయటపెట్టాలని ఒక మిత్రుడు, శ్రీనుగాడి ఇంటికి సాముహిక విద్యాభ్యాసం కోసం వచ్చి కూర్చున్నాడు. అప్పటికే పేపరు తెచ్చుకొని ఇక చదవటం మొదలు పెడదాం అనుకొన్న శ్రీనుగాడికి, శని షేక్ హ్యాండు ఇచ్చినట్టు, గొంతులో పచ్చి పనసకాయ పడ్డట్టూ అయ్యింది. నువ్వు చదువుతూ ఉండు నేనిప్పుడే వస్తా అంటే లేదు నేనూ వస్తా అంటాడు. పోని కాసేపు ఆగి రా రా, నాకు ఇప్ప్పుడు చదివే ఉద్దేశ్యం లేదంటె, ఏం పర్వాలేదు ఇక్కడే ఉంటా కాసేపు ఆగి చదువుదాం అంటాడు. ఆఖరికి బాత్రూం అని చెప్పి కిందకి వచ్చి నాకు ఫోన్ చేసి రమ్మన్నాడు. నేను వస్తే మొత్తం సీను అర్దమవుతుంది నువ్వే ఎదో చెయ్యి అన్నాను.
రాత్రి వరకు ఓపికగా ఉన్న శ్రీనుగాడికి, కోపం వచ్చి ఏం చెయ్యాలో తెలియక ఏడ్చి పడుకున్నాడు. వచ్చిన మిత్రుడు చక్కగా అర్ధరాత్రి వరకు చదువుకొని పడుకున్నాడు. అంతే అంత వరకూ పడుకున్నట్టు కలరిచ్చిన మా శ్రీనుగాడు చక్కగా లేచి పేపరు లో ఉన్న ప్రశ్నలు చదివి పడుకున్నాడు. ఎప్పటిలానే మాకే మంచి మార్కులు వచ్చాయి. మా మిత్రుడి ఆపరేషను ఆవిధంగా ముగిసింది, ఇరాక్ పై అమెరికా యుద్దం లా.
అసలు వీళ్ళందరికి ఒక విషయం అర్ధం కాదండి. పేపరు లీక్ చేసి చదవటం కంటే బుద్దిగా నోట్సులు చదువుకోవటం వీజీ అని. కాదంటే మీకు కొన్ని విషయాలు చెప్పాల్సిందే. పేపరు లీక్ చెయ్యడానికి పేపరు తయారు చేసే సార్ దగ్గర్నుండి, వాటిని ప్రింట్ చేసే ప్యూన్ వరకూ నిఘా పెట్టాల్సిందే. ఆ రోజుల్లో వాళ్ళ పూర్తి టైం టేబుల్ మనకి తెలియాలి. పరిస్థితుల బట్టి, చిత్తు కాగితాలు తుడిచే ఈశ్వరమ్మని కుడా ఇందిరా గాంధీ అంత గొప్పదానివని పొగడాలి. క్రిస్మస్ పండగకి కూడా దసరా మాములివ్వాలి. అర్ధరాత్రి టార్చిలైట్లు పట్టుకొని కాలేజి గోడలు దూకాలి. మచ్చుకి ఒక ఎపిసోడ్ చెబుతా.
BSc లో ఉన్నప్పుడు ఒకసారి Half yearly exams వచ్చాయి.. అందరూ కష్టపడి చదువుతున్నారు. మేము మాత్రం అలవాటు పడ్డ ప్రాణం కదా, చదవకుండా కాలేజి కి ఎదురుగా ఉండే పాత బిల్డింగ్ ఎక్కి కాలేజి మీద అరడజను కల్లేసి వుంచాం. మా మీద అనుమానం ఉన్న ప్యూన్ రమణ పేపరు ప్రింటు తీసి భద్రంగా దాచేసాడు. అన్ని గదులకి తాళాలు వేసారు. మరుసటి రోజు ఆదివారం కాలేజి కి సెలవు. ఎవరూ రారు. పనిమనిషి ఈశ్వరమ్మ కూడా ఆదుకోవటానికి, రాదు ఆదివారం కదా. కళ్ళ ముందు తెల్ల కాగితం కనబడుతుంది. ఇంక ఆశలన్నీ ఆవిరయిపోయాయి. అయినా చావో రెవో తేల్చుకోవాలి. కానీ ఎలా? కాలేజి లో అన్ని గదులకి తాళం వేసి ప్యూన్ వెళ్ళిపోయాడు.మా శ్రీనుగాడి లోని నటవిశ్వరూపం చూపాల్సిన అవసరం వచ్చేసింది. నా లోని దర్శకత్వ ప్రతిభ తోడయ్యి, మంచి ఘట్టం మొదలయ్యింది. శ్రీను గాడు ఆఫీస్ ముందు దిగులుగా ముఖం పెట్టుకొని కూర్చొన్నాడు. ఆ సీన్ మా వాచ్ మేన్ కంటపడాలన్నది మా ప్రయత్నం. వాడి పేరు అభిషేక్ బచ్చన్. ఎందుకంటే వాడి నాన్న కూడా ఒకప్పుడు వాచ్ మేన్, పొడుగ్గా ఉంటాడని అమితాబ్ అని పిలిచే వారు. అతని కొడుకు కావటం చేత, మంచి పొడుగు ఉండటం చేత ఆ పేరు వచ్చింది. వాడు మాత్రం వాడి పనిలో ఉన్నాడు గాని శ్రీనుగాడ్ని చూడలేదు. అప్పుడే అర్ధం అయ్యింది అమ్మాయి దృష్టి లో పడటమే కాదు, అవసరాల్లో వాచ్ మేన్ దృష్టి లో పడటం కూడా కష్టమని. అయినా శ్రీను పట్టువదలని గంగూలీ లా తన ప్రయత్నం చేస్తున్నాడు. అక్కడ ఒకమ్మాయి వచింది. ఖాళీ గా ఉన్న నేను, మా తారకగాడు ఆ అమ్మాయి తో కబుర్లు మొదలుపెట్టాం. కాసేపటి వరకు శ్రీనుగాడు మమ్మల్ని చూడలేదు. చూసిన తరువాత వాడి ముఖం చూడాలి, ఇవతల అమ్మయి తో మేము వాడ్ని పిలవకుండా మాట్లాడుతున్నామన్న భాద, పేపరు భాద. ఏడుపు ముఖం పెట్టాడు. అప్పటికే రెండు రోజులు గా ఇల్లు,తిండి నిద్ర మాని కాలేజి చుట్టూ తిరగటం వల్ల అందరి వాలకాలు రాళ్ళు కొట్టేవాళ్ళ లాగా ఉంది. చీకటి పడే వరకూ శ్రీను అదే ఫోజ్. మొత్తానికి మా మొర ఆలకించిన దేవుడు అప్పటికి వాచ్ మేన్ దృష్టిలో పడేట్టు చేసాడు.
ఇంక మా శ్రీనుగాడు నంది అవార్డ్ వచ్చిన ప్రకాష్ రాజ్ లా విజృంబించాడు. అభిషేక్ వచ్చి ఇంతవరకు ఎందుకున్నారని అడిగాడు.కళ్ళల్లో నీళ్ళు దించి, గుమ్మడిలా పూడుకు పోయిన గొంతుతో నా 10 సర్టిఫికేట్ పోయిందని చెఫ్ఫాడు. అభిషేక్ కనీసం కనికారం లేకుండా సోమవారం రమ్మని చెప్పేసాడు. మా వాడు తక్కువ తిన్నాడా? మనసంతా నువ్వే లో ఉదయ్ కిరణ్ లా రేపు నాకు ఇంటర్వ్యూ ఉంది సర్టిఫికేటు లేకపోతే ఉద్యోగం రాదని చెఫ్ఫాడు. మొత్తానికి కరుణించిన అభిషేక్ క్లర్క్ని తీసుకు వచ్చాడు. ఆఫీస్ రూం తాళం తీసి ఎక్కడన్నా పడిపోయిందేమో వెతుక్కోమని వదిలేసాడు. తలుపులు తీసిన వెంటనే ఆఫ్ఘన్ శరణార్దుల్లా లోపల దూరి మొత్తానికి డస్ట్ బిన్ లో ఉన్న చిత్తుకాగితాలన్నీ జేబులో పెట్టుకొని బయటకి వచ్చి ఆనందంగా దొరకలేదని చెప్పాం. క్లర్క్ పాపం బాగ ఫీలయ్యాడు. ఒక ఉత్తరం రాసి పెట్టాడు మా కోసం. “అయ్యా! నా పదవ తరగతి సర్టిఫికేటు పోయింది. అదిలేకుంటే నాకు ఉద్యోగం రాదు. కావున ఒక డూప్లికేట్ ఇప్పించ ప్రార్ధన.” కానీ మా పని జరిగి పోయిందని వేరే చెప్పాల?
ఒకసారి ప్రింటింగ్ బయట ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళకి ఇచ్చారు. నిఘా వాళ్ళ ఇంటి మీద వేసాం. ప్రింటింగ్ ప్రెస్ ఓనర్ కూతురు ఒకబ్బాయి ని ప్రేమించిన విషయం మా పరిశోధనలో తేలింది. వాడికి ఒక బీరుబాటిల్ బేరం పెట్టి పని చెప్పాం. వాడు ఎంత ప్రయత్నించిన ఏం దొరకలేదు. చిన్న చిత్తు కాగితం ముక్క మాత్రం దొరికింది. అది తెచ్చి ఇచ్చాడు. ఊరికే ఇచ్చాడా? ఒక గొప్ప ఉపాయం చెప్పి మరీ ఇచ్చాడు. అది ఎంత గొప్ప ఐడియా అంటే “న్యూటన్ కి ఆపిల్ పడినప్పుడు వచ్చిన ఐడియా లాంటిది.” తిరగబడి ప్రింట్ అయిన ఆ కాగితాన్ని అద్దం లో చూస్తే మూడు ప్రశ్నలు కనిపించాయి. అదే వరస లో ప్రశ్నలు ఏ టెస్ట్ పేపర్ లో ఉన్నాయో వెతకమన్నాడు. అంతే మొత్తం సమస్య తీరిపోయింది.
ఇలాంటి ఎన్నో అద్భుత ఎపిసోడ్ లతో మొత్తానికి దొరకకుండా నిర్విఘ్నంగా డైలీ సీరియల్ లా మా కాలేజి పూర్తి అయ్యే వరకు కొనసాగించాం. అప్పుడే అసలు ట్విస్టు కొన్ని అనుకోని పరిస్థితులలో మా శ్రీనుగాడు మా కాలేజి లోనే లెక్చరర్ గా జాయిన్ అయ్యాడు. వాడి పేపర్ లీక్ అయ్యినప్పుడు తెలిసింది వాడికి భాద. మరుసటి పరీక్షకి తేలుకుట్టిన దొంగ లా వాడి పేపర్ ని వాడే ప్రింట్ తీసుకొని వాడి దగ్గరే ఉంచుకొని పరీక్ష టైం కి మాత్రమే తేవడం మొదలుపెట్టాడు. పాపం శ్రీను గాడు.
Da Vinci Code range lo undi mee Happy days vruttantam. questions telisina slip lu pettakunda chadivi rasinanduku abhinandanalu. 🙂
హ్హా. హ్హా..
బావుంది.
చదువుతుంటే ఆహ్లాదంగా ఉంది.
బొల్లోజు బాబా
బొల్లోజు బాబా గారు, ప్రతాప్ గారు, మోహన గారు ధన్యవాదాలు.
అబ్బో… మీ నటనా బావుంది, మీ వర్ణనా బావుంది 🙂
రాఘవ గారు నెనర్లు.