హమ్మయ్య మొత్తానికి 1000 మైలురాయి దాటేసా. 8 టపాలు, 26 రోజులు 37 వ్యాఖ్యలతో మొత్తానికి ఏదో ఒకలా మొదటి మెట్టు ఎక్కేసా.
అయినా అంత వీజీగా అయ్యిందనుకుంటున్నారా? అసలు ఎన్ని భాధలు పడ్డానని. అప్పుడెప్పుడో ఈనాడు లో తెలుగు బ్లాగుల గురించి చదివినప్పుడు అనుకున్నా, ఎలా అయినా నేనూ ఒక బ్లాగు మొదలు పెట్టి తీరవలసినదే అని. ఎక్కడిదీ కుదిరి చస్తేనా. ఏదో ఆ మధ్య నేను పనిమాని Internet లో ఊసుపోని విషయాలన్నీ చదువుతున్నా అని నాకో వంక పెట్టి మా కంపెనీ వాళ్ళు నా స్కోర్ కార్డ్ గోవిందా అనిపించిన తరువాత గానీ ఖాళీ సమయం దొరకలేదు. ఒకసారి పార్కు లో పట్టుబడ్డ ప్రేమజంట భయం పోయి కళ్ళముందే తిరిగినట్టు, నేను కూడా ఈ మధ్య భయంపోయి కొంత సమయం దీనికి కేటాయించేసా. ఇంక వ్రాయటం మొదలుపెట్టిన తరువాత, నా చుట్టూ ఉన్నవాళ్ళ లో తెలుగు బ్లాగులు చదివే వాళ్ళు కాగడా పెట్టి వెతికినా దొరికి చావలే.
ఇంక లాభం లేదని దీన్నో ఉద్యమంగా భావించి మా వాళ్ళకి మెయిల్లు పెట్టి, క్లాసు పీకి నానా భాదలు పడ్డా. అసలు డి.ఎస్.సి. కోసం ప్రయత్నిస్తున్న వారి దగ్గర్నుండి, సాఫ్ట్ వేర్ వాళ్ళ దాక తెలుగు లోనా? అని దీర్ఘం తీసేవాళ్ళే. నాకు ఇంగ్లీష్ రాకే తెలుగు లో వ్రాస్తున్నా అని నిర్దారణ కి వచ్చేసారు. ఇంక నేను నా 10, ఇంటర్ లో వచ్చిన ఇంగ్లీష్ మార్కులు చూపించినా నమ్మరే అసలు. కొంత మందయితే ఇంకాస్త ముందుకి వెళ్ళి “సారీ బాస్ ! నాకు తెలుగు మాట్లాడటమే తప్ప చదవటం రాదు ” అనేసారు.అయ్యో రామ. ఆంధ్రదేశం లో పుట్టి, పెరిగి, చదువు కూడా ఇక్కడే చదివిన మనవాళ్ళకి తెలుగు చదవటం రాకపోవడమేమిటండీ. చోద్యం కాకపోతే. స్కూల్లో మాకు తెలుగు లేదు అనేసారు. అవునులెండి సెలవు ఇవ్వకపోతే, మందుషాపులు మూయించక పోతే, గాంధీ జయంతి ని మరిచి పోయే రోజులు. ఇంక మార్కులకు పనికి రాని తెలుగు ఎందుకు నేర్చుకుంటారు? వీళ్ళ తో వేగటం నావల్ల కాదని, వీలుంటే తెలుగు చదవటం ఎలా అని ఒక బ్లాగు వ్రాస్తానని చెప్పి వచ్చేసా. ఇంక తెలుగు చదవటం వచ్చినవాళ్ళ దగ్గరకి వెళ్ళి నేనే బ్లాగు ఓపెన్ చేసి చదవమని చెబితే, మరీ ఇంత పెద్దపెద్దవి రాస్తే ఎలా అనేసారు. ఇంకొంతమంది పల్లీ-బటాణీ ని పిల్లిబటాణీ అని, ఇంకా వాళ్ళ పరిధి లో కొన్ని భూతులు చదివాక, ఇక తప్పదని వాళ్ళందరిని కూర్చోబెట్టి నేనే చదివి వినిపించాల్సి వచ్చింది. విని ఊరుకున్నారా? అబ్బే
“ఇవి నీ సొంతమా?”(అబ్బే లేదు. నా మొహం నాకంత సీన్ ఎక్కడిది, ఎదో అరవం సినిమా లోనివి.)
“ప్రేమలేఖ అంత బాగా వ్రాసావ్ కొంపదీసి ప్రేమలో పడ్డావా.” (లేదమ్మ మీ దయ వల్ల రోడ్డు మీద పడ్డాను.)
ఇంకా శతకోటి ప్రశ్నలు, జోకులు.
మొదటి 1000 కే ఇన్ని పాట్లు పడ్డాను. ముందు ముందు ఎలా నెగ్గుకు రాగలనో అంతా భగవంతుడి దయ.
నాకు సహకరిస్తున్న, విశ్లేషణలిస్తున్న బ్లాగర్లకి, మిత్రులకి ధన్యవాదాలు. సదా మీ సహకారం కోరుకుంటూ,
మీ
మురళీ.
ముందుగా హృదయపూర్వక శుభాకాంక్షలు. మొదటి అడ్డంకిని అధిగమించటమే కష్టం … బుడిబుడి నడకలతో ప్రారంభమైనా ఇక నుంచి వాకింగ్, జాగింగ్, రన్నింగ్ లోకి మారి దుసుకుపోవటానికి ఎక్కువ సమయం పట్టకపోవచ్చు…మీ ఈ వెయ్యి అంకెతో అది విజయవంతమైనట్లే కనుక ఆ కష్టం వెనుక ఉన్న ఆనందాన్ని (ముఖ్యంగా మీ రెండో సెటైర్ అదేనండి ప్రేమ మీదది … సూపరో సూపర్), ఫలితాన్ని ఎంజాయ్ చేస్తూ ఇంకా ఎక్కువ ఓర్పు నేర్పుతో మరిన్ని టపాలు నిర్విఘ్నంగా రాయండి.
“అనంతమైన చీకటి లో ఓ చిరు దివ్వెను వెలిగించాను.
చూడాలి గెలుపు చీకటిదో? చిరు దివ్వెదో?”
చిరు దివ్వె వెలిగే, చీకటి పారద్రోలే
గొపీలోలా నీ పాల బడ్డామురా
ధైర్యంగా జనస్రవంతిలోకి వచ్చి పరిచయం చేసుకోండి.
అభినందనలు. తెలుగు చదవడం రాదు అని తప్పించుకునేవారిని కూడా మనం వదలం కదా! మన నిఖిలే ఉంది కదా!!
http://lekhini.org/nikhile.html
అభినందనలు. నిజమే నేను నా బ్లాగ్ ఫార్వార్డ్ చేసీ చేసి, చాలా మందికి తెలుగు చదవడం రాదని తెల్సీ బోలెడంత డిజప్పాయింట్ అయిపోయా..
మురళిగారు,
ముందుగా అభినందనలు.. మీ బ్లాగు చదవమని అందరికి చెప్పాల్సిన పని లేదు. చక్కని టపా రాయండి. మిగతా బ్లాగులు చదివి కామెంట్టండి. ఇక చదువరులు మీ బ్లాగుకు లైన్ కడతారు. ..
good point. మా ఇంట్లో (అత్తారింట్లో) ఎవరికీ తెలుగు చదవడం రాదు. నేను ఏమి రాస్తున్నానో వీళ్ళకి అస్సలు తెలియదు. సగం మంది స్నేహితులకు తెలుగు చదవడం రాదు. ‘వై డొంట్ యూ రైట్ ఇన్ ఇంగ్లీష్ యార్..’ అంటారు. అయితే ఈ సమస్య నాదే కాదన్న మాట.
రెండు.. మీరు వెయ్యి పోస్టులు రాసారా ? వెయ్యి హిట్లు వచ్చాయా ? నాకు అర్ధం కాలేదు. ఏది ఎమైనా.. మీకు అభినందనలు! ఏమైయినా.. మీరు బ్లాగులకు ఎంత దాకా ఎడిక్ట్ అయారో కాస్త కాస్త అర్ధం అవుతుంది.
అభినందనలు.త్వరలోనే 1000 టపాల పండగ కూడా జరుపుకోవాలి.
“ఇవి నీ సొంతమా?”(అబ్బే లేదు. నా మొహం నాకంత సీన్ ఎక్కడిది, ఎదో అరవం సినిమా లోనివి.)
bagunnayi ee lines
వెయ్యి దాటినందుకు అభినందనలు.
దూసుకుపోండి.
“పిల్లి బటాణీ” హి హి హీ.
చదవడానికి మేమంతా ఉన్నాంలే .. మీర్రాయడవే ఆలస్యం.
అభినందనలు
శుభం. ఇప్పుడు ౨౦౦౦ దాటడానికి సిద్ధం కండి మరి.
నన్ను ప్రోత్సహిస్తున్న బ్లాగు మితృలందరికి ధన్యవాదాలు.