ఆ మధ్య మన నైమిషారణ్యం లో సాధుపుంగవులంతా పూజలు,పునస్కారాలు చేసుకొని,భోజనం కూడా పూర్తి అయిన తరువాత పిచ్చాపాఠి మాట్లాడుకుంటున్నారు. ఇంతలో ఉరుములు లేని వానలా అఖిల ప్రపంచ దేవతలంతా తమ తమ వాహనాల్లో దిగారు. ఋషిపత్నులు స్త్రీ దేవతలనందరినీ లోపలకి సాదరంగా ఆహ్వానించారు. “దేవుడు”లంతా బయట జరుగుతున్న పంచాయితీ లో కూర్చున్నారు. లోపల ఆడవాళ్ళ కి మాటల పండగ మొదలయ్యింది. మా వారికి ప్రపంచం నలుమూలల ఉన్న గుళ్ళు గోపురాలనుంచి ఏడాదికి వచ్చే ఆదాయం ఇంత అని ఒకరంటే, ఆ.. మా ఆయనకి భక్తులు ఇచ్చే బొచ్చే ఆ విలువ ఛేస్తుందని రాగాలు తీసేది ఒకరు. ఈ మధ్య కాలంలో పెరిగిన NRI భక్తుల గురించి,విదేశాలలో వెలసిన తమ ఆలయాలు వాటి ఆస్తులు,ఆదాయాలు మొదలు కొని ఆంధ్రప్రదేశ్ లో కబ్జా కి గురైన తమ ఆస్తుల వరకు అన్నింటినీ ఏకరువుపెడుతున్నారు.
పాపం బయట ఉన్న మన మగవాళ్ళు మాత్రం మంద్రం గా నవ్వుతూ, చూపుల తో పలకరిస్తూ కాలక్షేపం చేస్తున్నారు. ఈ నిశ్శబ్ద వాతావరణానికి చికాకు పడ్డ ఒక కుర్ర ఋషి చివాలున లేచాడు. ఈయన గారు మొన్నటి వరకు మన అమీర్ పేట్ లో అద్దె హాస్టల్ లో ఉండి సాఫ్ట్ వేరు ఉద్యోగం కోసం వెతికి విసిగిపోయాడు. ఇక తపస్సు చేసి వెలగబెడదామని ఇక్కడకి వచ్చాడు. అసలే గ్రూప్ డిస్కషన్ కి కమ్యూనికేషన్ కి అలవాటు పడ్డ ప్రాణం నిశ్శబ్దాన్ని భరించలేడు.
“స్వామి నా కో సందేహం”
“మానవ దేహమే అంత.అన్నీ సందేహాలే. కానివ్వు నాయన”
“తమరు అన్నీ సాధు జంతువులనే సృష్ఠించ వచ్చు కదా. అలా కాక కొన్ని కూర జంతువలని,కొన్ని కౄర జంతువలని ఎందుకు సృష్ఠించారు? సృష్ఠి ధర్మమని చెప్పకండి. ఒకరి ఆహారం కోసం మరొకరు అని చెప్పకండి. ఆహార నియమాలు పెట్టింది మీరే కదా. అలాకాకుండా.. ”
“నాయనా కొంచెం గ్యాప్ ఇవ్వు నాయన. గ్రూప్ డిస్కసన్ లో పాల్గొన్నట్టు ప్రశ్న జవాబు రెండూ నువ్వే చెబితే ఎలా? ఇంతకి కౄర జంతువు అంటే ఎమిటి?”
“పెద్దపులి” అన్నారు ఎవరో.
అంతే పార్కింగ్ ప్లేస్ లో ఉన్న కనకదుర్గమ్మ వాహనానికి వీసా ఇంటర్వ్యూ రోజే పాస్పోర్ట్ ఎవడో కొట్టేసినంత కోపం, అమెరికా లో అడుగు పెట్టిన వెంటనే డాలర్ విలువ పడిపొయినంత భాద వచ్చాయి.
పక్కనే ఇంత భయంకరమైన సింహం ఉండగా నేనేం చేసాను. నా మీద పడ్డారు అని గొడవ మొదలు పెట్టింది.
అంతే మృగరాజు గారికి పేట్రోల్ రేట్ మండినంత మండింది. “పాములు,కొండ చిలువలు, అనకొండలు ఇన్ని ఉండగా నేనే తేర గా దొరికాన? అని పెద్దపులి మీద పడింది.”
కార్నర్ లో పార్క్ చేసిన విష్ణువాహనం అంతా విని “అన్నింటి రుచి చూసాను గాని ఈ అనకొండ ఎక్కడ దొరకలేదు. బాస్ ఫారిన్ టూర్ పెట్టుకుంటె బాగున్ను”అని మనసులోనే అనుకున్నాడు.
జురాసిక్ పార్క్ అర్దంకాక పది సార్లు చూసిన మన సాఫ్ట్వేర్ ఋషి “మరి డైనోసారో?” అని దీర్ఘం తీసాడు.
అలా ఒక్కొక్కరూ ఒక్కో పేరు చెబుతూ పోయారు. దేవతల వాహనాలన్ని అసెంబ్లి హాల్లో ఎమెల్యే ల్లా కొట్టుకోవడం మొదలు పెట్టాయి.
నారదుని కంటే ప్రమాదం సుమీ ఈ సాఫ్ట్వేరోడు అనుకున్నారు దేవతలు. అంతా కలిపి ఒక నిర్ణయానికి వచ్చారు. ఒక నిజనిర్ధారణ కమిటీ వేసారు. అందులో నారదుడు, సాఫ్ట్వేర్ ఋషి తో పాటుగా పులిని సింహాన్ని కూడా చేర్చారు. అంతా కలిపి అప్పటి కప్పుడే భూలోకయాత్రకు బయలు దేరారు.
అంతా తిరిగి అన్నీ తిరిగి చీకటి పడిందిగాని కమిటీ ఏ విషయం లోనూ ఏకాభిప్రాయానికి రాలేదు. ఇంకో రోజు ఉందామంటే విజిటింగ్ వీసా రద్దు అయిపోతుంది. అలవెన్సులు ఇస్తారో ఇవ్వరో తెలియదు. దిగులుతో మన టాంక్ బండ్ వేమన గారి విగ్రహం దగ్గర కూలబడ్డారు.
అటుగా చెత్త ఏరుకోవటానికి వచ్చిన ఒక చిన్న పోరగాడు వచ్చి ఏంటి దిగులు గా ఉన్నారు అని అడిగాడు.మొదట దైవ రహస్యం చెప్పకూడదు అనుకున్న చిన్నపిల్లలు దేవతలతో సమానం కదా అని మొత్తం విషయం చెప్పారు. వాడు పొట్ట చెక్కలయ్యేలా నవ్వి అటు గా పోతున్న ఒక ముసలి యాచకుడ్ని చూపించాడు.
అందరూ అటు చూసారు. చేతి లో కర్రతో చూపు మందగించటం వల్ల ఇబ్బంది పడుతూ నడుస్తున్నాడు.
“ఆయన ఒకప్పుడు పది షాపులకి యజమాని. ఒక్కగానొక్క కూతురికి లక్షలు పోసి పెళ్ళి చేసారు. ఆవిడ చిన్న వయస్సు లోనే మనవరాల్ని ఇచ్చి చనిపోయింది. తల్లి లేని పిల్లని అల్లారు ముద్దుగా పెంచాడు. ఆస్థి మొత్తం ఆమె పేరు మీద రాసాడు. ఒక కుర్రాడ్ని ప్రేమించి పెళ్ళి చేసుకొని ఈయన్ని రోడ్డు మీదకి తోసేసింది.”
“ఏ జంతువు కూడా తన తల్లిని, చెల్లిని, కావల్సిన వాళ్ళని చంపదు. కాని మనిషి మాత్రం డబ్బు కోసం,పైశాచిక ఆనందం కోసం దారుణం గా నమ్మిన వాళ్ళని మోసం చేసి హింస పెట్టి చంపగలడు. అలాంటి మనిషి ని మించిన కౄరమృగం ఇంకేమిటి?”
చిన్న కుర్రాడి మాటల్లో నిజం ఎదురుగా ఉన్న ముసలి వాడి సాక్ష్యం కాదనలేక పోయింది నిజనిర్ధారణ కమిటీ. ఇంతలో సాకీ ఉదంతం గుర్తు వచ్చిందో ఎమిటో పెద్దపులి అరణ్యం వైపు పరుగు తీసింది. మిగిలిన వాళ్ళు కూడా పోరగాడికి టాటా చెప్పి రిపోర్ట్ సమర్పించడానికి బయలుదేరారు.
స్క్రీన్ ప్లే మొత్తం ముందే తెలిసిన విష్ణుమూర్తి మాత్రం నవ్వుతున్నాడు చిద్విలాసంగా.
మీ వ్యంగ్యం బాగుంది. బ్లాగును ‘కూడలి’ లో చేర్చండి. ఎక్కువమంది కళ్లలో పడుతుంది.
మురళీ,
బాగా రాసారు. మంచి స్కెచ్ లా ఉంది. మీరు మీ బ్లాగుని కూడలి లో పెట్టి ఉంటే ఈ పాటికే బోలెడన్ని హిట్లు వచ్చి ఉండేవి.మీ పరుగు కవిత కూడా బాగుంది. కూడలికి స్వాగతం!
బాగుంది. ఇంత మంచి కథనాన్ని ఇన్నాళ్ళూ మిస్సయ్యామన్న మాట!. కొన్ని ఉపమానాలూ…పోలికలూ చాలా బాగున్నాయ్. ఇక ముగింపు అల్టిమేట్.
http://www.parnashaala.blogspot.com
🙂
కూడలి ని పరిచయం చేసిన అబ్రకదబ్ర కి ధన్యవాదాలు.
సుజాత గారూ, నేను కూడలి కే కాదు అసలు బ్లాగులోకానికే కొత్త. అందుకే అందరి కంటా పడేలా ఏం చెయాలో తెలియలేదు.
మహేష్ గారు మీ మాటలు నాకో ప్రశంసాపత్రమే.
కిరణ్ గారు, ధన్యవాదాలు.
good job. Narration is funny .. but it does not suit the serious moral story you want to tell.
మొదటి వాక్యం నుంచి ఆఖరు వాక్యందాకా, చాలా గ్రిప్పింగ్ గా నడిపించారు. (బ్రెత్ లెస్ సింగింగ్ లా అన్న మాట).
వండర్ ఫుల్ ఇమేజెస్. కొత్త కొత్త ఉపమానాలు చాలా బాగున్నాయి. ఉదాహరణకు:
అసలే గ్రూప్ డిస్కషన్ కి కమ్యూనికేషన్ కి అలవాటు పడ్డ ప్రాణం నిషబ్దాన్ని భరించలేడు.
గ్రూప్ డిస్కసన్ లో పాల్గొన్నట్టు ప్రశ్న జవాబు రెండూ నువ్వే చెబితే ఎలా?
వీసా ఇంటర్వ్యూ రోజే…………..
బాస్ ఫారిన్ టూర్ పెట్టుకుంటె బాగున్ను
ఇంతలో సాకీ ఉదంతం గుర్తు వచ్చిందో ఎమిటో …………..
పైవన్నీ ఫ్రెష్ ఎక్స్ ప్రెషన్స్. చాలా చాలా వర్జిన్ థాట్స్.
ఎండింగ్ మాత్రం టెరిఫిక్.
సెంటెన్స్ కనష్ట్రక్షన్ స్పష్టంగా, సూటిగా నే ఉంది.
స్పెల్లింగ్ మిస్టేక్స్ మాత్రం బిర్యాని మద్యలో రాళ్లలా భాదించినయ్.
అభినందనలతో
బొల్లోజు బాబా
బొల్లోజు బాబాగారు, ధన్యవాదాలు. మీ వ్యాఖ్య చదివాక ఏనుగెక్కినంత ఆనందం కలిగింది. స్పెల్లింగ్ మిస్టేక్స్ రాకుండా ఇక ముందు జాగ్రత్త పడతాను.
పింగుబ్యాకు: బ్లాగు ప్రయాణంలో మూడేళ్ళు « మురళీగానం
పింగుబ్యాకు: రెండవ భాగం « మహానగరం
naku matalu ravatam ledu.mee rachanalaki nenu banisanvuthanemo anipisthondhi antha rasavattaram ga saguthunnai mee kadhalu emani varninchalo nakithe teliyatam ledu.okati chadavagane inkoti oka danni minchi maroti.