భయంగా ఉంది నాన్న…

 
11 డిసెంబర్ 2008 :

“రాణి, నీ పెళ్ళి ముహూర్తం కూడా నిర్ణయం అయిపోయింది. బట్టలు,నగలు కొనటానికి రేపే అమ్మ,నేను విశాఖపట్నం వెళ్తున్నాం. నీకేం కావాలో చెప్పమ్మా?”

“నాన్న, నీ ఒక్కగానొక్క కూతురి పెళ్ళి ఘనంగా చేస్తావుగా మరి. నన్ను కాదని ఫోజు కొట్టిన సాఫ్ట్ వేర్ బావల చూపులు ఆకాశం నుండి నేలకి దిగిరావాలి. మా కొడుకులే పుత్తడి, మీరు ఇత్తడి అన్న అత్తల డాబు దిగేలాగా బందువుల్ని,ఊరందర్ని పిలవాలి. నువ్వు అడిగిన విధంగా ఖర్చులన్నింటినీ వ్రాసిపెట్టా. 20 లక్షలకి దగ్గరగా వచ్చింది.”

“అంతా నీకు నచ్చినట్టే చేద్దాం. మేము పొద్దున్నే బయలుదేరి రాత్రికి వచ్చేస్తాం. నువ్వు నిదానంగా లేచినా పర్వాలేదు. వచ్చేంతవరకు జాగర్త తల్లి.”

“సరే నాన్న.”

12 డిసెంబర్ 2008:

“రాణీ! తల్లి ఎక్కడున్నావు రా. ఇదిగో చూడు నువ్వు అడిగిన దానికంటే అందంగా ఉన్న చీరలు, నగలు. నా చిట్టితల్లి దగదగా మెరిసిపోతుంది ఇవి వేసుకుంటే. ఎక్కడున్నావమ్మా?”

“అమ్మాయి గది తలుపు వేసి ఉంది. పడుకుందేమోనండి? రేపు చూస్తుంది లెండి.”

“ఒక్కసారి ఇవన్నీ చూపించి నా చిట్టి తల్లి కళ్ళలో అనందం చూడకుండా పడుకున్నా నాకు నిద్రపట్టదు. వెళ్ళి కిటికీ లోంచి పిలువు వినిపిస్తుంది.”

“అలాగే. చెబితే వినరుగా….. ఏవండీ! త్వరగా రండీ. అయ్యో చిట్టి తల్లీ ఎంత పని చేసావమ్మా. నీకే కష్టం వచిందమ్మా. మమ్మల్ని ఒంటరిని చేసి వెళ్ళిపోయావా తల్లీ….”

“అమ్మా…..” 

రాణి తనగదిలో చీరతో ఉరివేసుకుని కనిపించింది ఆ తల్లిదండ్రులకి. వాళ్ళ రోదన అలా కొనసాగుతూనే ఉంది. బందువులు, మితృలు, పోలీసులు అందరూ వచ్చివెళ్ళారు. తలా ఒకమాట అన్నారు. ఆ తల్లిదండ్రుల అజాగ్రత్తకు, అతిజాగ్రత్తకు మందలించారు, తోచిన సలహాలిచ్చారు. కొందరు కూపీలాగారు. కానీ ఈ సంఘటనలో వారు పోగొట్టుకున్నది ఎవరు తిరిగి తెచ్చి ఇవ్వలేదు. రాణి కూడా ఒక ఉత్తరమైనా వ్రాసిపెట్టలేదు. తను ఉత్తరం వ్రాయలనుకుని ఉంటే ఏమని వ్రాసేది…….

 

ఆత్మహత్యకి ప్రత్యమ్నాయం లేదా?

ఆత్మహత్యకి ప్రత్యమ్నాయం లేదా?

ప్రియమైన నాన్నగారికి,

నాన్న నీతో చాలా మాట్లాడాలని ఎప్పుడూ అనుకుంటూనే ఉంటా కానీ నీ పెద్దరికానికి, పెద్ద పెద్ద ఆలోచనలకి నావి ఆకతాయి అల్లరి చేష్టల్లా ఉంటాయని కొట్టి పారేస్తావ్. ఈ ఒక్కసారికి విను నాన్న. ఎందుకంటే ఇకముందు ఇలా చెప్పే అవకాశం ఉండదేమో? నాన్న నువ్వెంత గొప్పవాడివో తెలుసా. బయటవాళ్ళకి నువ్వెవరో తెలియదు గాని నాకు మాత్రం నువ్వు దేవుడివి. నువ్వు నాకు ఏమి ఇవ్వలేదని నాన్న. జీవరాశుల్లోనే ఉత్తమమైన మానవ జన్మనిచ్చావ్, అడిగింది కాదనక అల్లారు ముద్దుగా పెంచావ్, చదువు చెప్పించావ్. ఇప్పుడు నా పెళ్ళికోసం కూడా ఎంత కష్టపడుతున్నావ్.

అసలు ప్రతీ మనిషి ఇంతేనేమో, పెళ్ళి కానంతవరకు తనకోసం బ్రతికి, తనకోసం సంపాదించేవాడు పెళ్ళి కుదిరిన మరుక్షణం నుంచే పిల్లలే జీవితంగా బ్రతుకుతారు. నువ్వు పొద్దున్న లేస్తూనే కష్టపడేది, సంపాదించేది, ఆదా చెసేది ప్రతీది నా కోసమేగా. నీ జీవితం లో నీకోసం పావువంతు బ్రతికి మిగిలిన జీవితమంతా నా కోసమే బ్రతికావు కదా!

మరి నాకోసమే ఇంతలా బ్రతికే నువ్వు, నాకు ఏమి కావాలన్నా ఇచ్చే నువ్వు, నా భవిష్యత్తుని నా వందేళ్ళ జీవితాన్ని నిర్ణయించే పెళ్ళి దగ్గర మాత్రం నా ఇష్టాలతో, ఆశలతొ, ఆశయాలతో, నా భవిష్యత్తు నిర్ణయాలతో పనిలేకుండా పరువు, ప్రతిష్ట అంటావేంటి నాన్న. ఈ పరువు, కుటుంబ ప్రతిష్ట అంటే ఏంటి నాన్న? ఆడపిల్ల పద్దతిగా లేకపోతే కుటుంబ పరువు పోతుందని రోజూ అమ్మకి చెబుతావ్, సమాజం లో తలదించుకొనే పరిస్థితి రాకూడదని రోజూ అంటావ్. అమ్మ సంగతి తెలుసుగా 5వ తరగతి చదువుతో ఆడదానికి కుటుంబమే సర్వస్వం, భర్తే దైవం అని తప్ప వేరే ఏది ఆలోచించలేదు. వ్రతాలు, గాజులు, చీరలు, ఆవకాయ, అప్పడాలు ఇవి తప్ప తన దగ్గర ఇంకేదన్నా చర్చిస్తే తనకి అర్ధం కాదు. అందుకే నీ పరువు కోసం నన్ను గడప దాటనివ్వదు. సమాజం లో నీ గౌరవం కోసం నన్ను ఎవరితోనూ స్నేహం చెయ్యనివ్వదు. నీ బాగు చూసి ఓర్వలేకపోతున్నారు బందువులు అని బలంగా నమ్మి ఎవరితోనూ మాట్లాడనివ్వదు.

నా ఆలోచనలు ఆకాశంలో విహరిస్తే, మీ అర్ధంలేని భయాలు నా ప్రపంచాన్ని చిన్నదిగా చేసాయి. నా వయస్సులోనే ఉన్న అక్కలు,అన్నయ్యలు,బావలు,వదినలు ఎందరో మన భందువుల్లో ఉన్నారు. ఒక్కరోజు ఎవరినీ కలిసే అవకాశం లేదు. మనసు విప్పి మాట్లాడే అవకాశంలేదు. వాళ్ళ భవిష్యత్తు ప్రణాలికలు తెలుసుకోవాలన్న నా కోరిక ఇప్పటికీ తీరలేదు. వాళ్ళు కంప్యూటర్ లో ప్రపంచాన్ని చూస్తుంటే, నేనుమాత్రం ఇల్లే ప్రపంచంగా బ్రతికాను. విశాలమైన మన ఇంటి గదుల్లో ఎంత ఇరుకుగా పెరిగానో నీకు తెలుసా నాన్న.

ఒకరోజున హఠాత్తుగా పెళ్ళిచూపులన్నారు, పెళ్ళన్నారు. వచ్చినవాడికి నేనంటే ఇష్టమా? మీరు ఇస్తానన్న కట్నం ఇష్టమా? నా ఆశలని,ఆలోచనలని అర్ధంచేసుకుంటాడా? లేక వండివార్చితే చాలనుకుంటాడో? ఏమీ తెలియదు. ఇవన్నీ పోని మిమ్మల్ని అడుగుదామంటే ఆడది చదివి చెడిందంటారు. అంతేగా? ఇంకెవర్ని అడగాలి? ఎవరితో పంచుకోవాలి. నాకు ఎవర్ని అందిచారు? ఎవర్ని మిగిల్చారు మీరు? నాకు నేను తప్ప ఎవరూ మిగలలేదు.

అసలు లోకులు,బందువులు ఎవరు నాన్న మన జీవితాల్ని శాసించటానికి? ఇప్పుడు రమ్మను వాళ్ళని కళ్ళు చల్లబడతాయి. ఇప్పుడూ నేను లేని లోటుని తీర్చగలరా వాళ్ళు. పశ్చాత్తాప పడి నేను కోల్పోయిన ప్రాణాన్ని తిరిగి ఇవ్వగలరా. నీ మనసులో గూడు కట్టుకు ఉన్న పరువుని, ప్రతిష్టని అడిగి సమాధానం చెప్పు.. ఇకచాలు నాన్నఇంత పెద్ద ప్రపంచంలో నాకు,నా ఆలోచనలకి స్వేచ్చని,స్థానన్ని ఇవ్వలేని సంకుచిత సమాజాన్ని ద్వేషిస్తూ వెళ్ళిపోతున్నా. నీ రూపం లో నా మెడని వంచి విజయాన్ని అందుకుందామన్నా విధిని పరిహసిస్తూ వెళ్ళిపోతున్నా. నా ఇష్టమయిన ఉయ్యాలని చివరిసారిగా ఊగాలని ఉరివేసుకుని ఊగి వెళుతున్నా.

అంతే నాన్న..  నేను చెప్పాలనుకున్నది అంతే…   ఇంకా చాలా చెప్పగలనేమో..  కానీ ఇప్పటికే జరగాల్సిన ఆలస్యం జరిగిపోయింది..  ఇంకా ఏవో చెప్పి ప్రయోజనం లేదు…

ఇన్ని మాటలు చెప్పాను కానీ నాన్న, భయంగా ఉంది నాన్న. చావాలంటే భయంగా ఉంది నాన్న. ఉరితాడు నా మెడకి బిగుసుకుంటూ ఉంటే ఊపిరాడక నొప్పిగా ఉంటుదేమో? నాన్న భయంగా ఉంది. చనిపోయాక ఎమవుతా నాన్న, అక్కడ ఆలోకంలో ఆకలయితే అన్నం పెట్టే వాళ్ళు ఉంటారా? ఒంటరిగా అందర్ని వదిలి వెళ్ళాలంటే చాలా భయంగా ఉందినాన్న. నన్ను మరిచిపోకండి నాన్న… ప్లీజ్

మీ నిర్భాగ్యురాలయిన కూతురు,

రాణి.  

(ఇది ఈమధ్య మా బందువుల్లోనే జరిగిన ఒక సంఘటన. కారణం ఎవరికీ తెలియదు. బందువుల్లో ఎవరితోనూ కలివిడిగా ఉండే అవకాశంలేదు. ఒక చిన్న పల్లెటూరిలోనే తన నిండు నూరేళ్ళు నిండిపోయాయి. తన చివరి క్షణాల్లో పడ్డ సంఘర్షణ ఆవిష్కరించాలని ఎంతగానో ప్రయత్నించా. కానీ తన ఆలోచనలు, నడవడిక, వ్యక్తిత్వం , గతం, భవిష్యత్తుకై తన ఆలోచనలు ఏమీ తెలియని నేను వ్రాసినవి కేవలం నా ఊహలేగాని వాస్తవాలు కావు. వాస్తవాలు తన మనస్సు అనే రహస్యపు పెట్టెలో శాశ్వతంగా దాచేసి తనతో తీసుకుపోయింది. నావాళ్ళకే నాతో కష్టాలు పంచుకునే చనువు ఇవ్వలేకపోయాను. అందుకేనేమొ ఈ సంఘటన నన్ను పదే పదే వెంటాడుతుంది. నాకిప్పుడు కొన్ని నిజాలు తెలియాలి. తను చనిపోవాల్సిన అవసరం ఏంవచ్చింది? తన  చావుకి నిజమయిన కారకులు ఎవరు? చనిపోయినప్పుడు తన ఆత్మసంఘర్షణ  ఏంటి? చావు తర్వాత ఏమవుతుందో ఇప్పటికీ మానవమేధస్సుకి తెలియదు. తను అసలు ఆవిషయం ఆలోచించిందా? ఉరివేసుకోవటానికి భయపడలేదా? బ్రతకటానికి ఏవయినా అవకాశాలు ఉన్నాయేమొ ఆలోచించలేదా? రేపటినుండి తాను ఏమవుతుంది, తనగది ఏమవుతుంది, తన బట్టలు, పుస్తకాలు, తనకిష్టమయిన వస్తువులు అన్నీ ఏమవుతాయి? ఇంకా కొన్ని వేల ప్రశ్నలు నా మనస్సుని తొలిచేస్తున్నాయి. ఇన్ని ప్రశ్నలు తనకి కలగలేదా? మరి ఏం సమాధానం చెప్పుకుంది. తనని తాను చావుకి మానసికంగా ఎలాసిద్దంచేసుకుంది. నా ప్రశ్నలకి ఎవరు సమాధానం చెప్పగలరు………………….)


జావా జావా కన్నీరు

పొద్దున్నే అయ్యప్ప పూజ చేసుకొని కిటికి తలుపు తెరిచా పక్షులింకా అప్పుడే బ్రష్ చేసుకోవటం మొదలు పెట్టాయి. నేను స్నానం కూడా చేసాను అని వాటికి తెలియాలని బట్టలు శబ్దంవచ్చేలా పదిసార్లు దులిపి తీగమీద వేసి వచ్చా. లేకపోతే సాఫ్ట్ వేర్ వాళ్ళంటే ప్రతి ఒక్కడికి లోకువే. “మా లంచ్ అయితే గాని పక్కమీదనుంచి లేవని సాఫ్ట్ వేర్ వాళ్ళు” అని పక్షులు ఒక సామెత కూడా పెట్టేసుకున్నాయి. ఈ రోజుకి వాటి తిక్కకుదిరింది.

పిచ్చుక 1: కిచకిచ కిచ్ కిచ్ కీచ్ కీచ్  (తెలుగులో: ఏంటే మనోడు ఈ రోజు పొద్దున్నే లేచాడు. ఏంటి సంగతి?)

పిచ్చుక 2: కిచో కిచ కిచోకిచ కిచకిచే కిచ కిచకిచే కిచ కిచ్చు కిచ్చు కిచ్చు కిచ్చు   (తెలుగులో: నిద్రపట్టక. మాబావ స్వాలో అమెరికా లోని లీమన్ బ్రదర్స్ లో గూడు కట్టుకొని ఉన్నాడు తెలుసుగా వాడు నిన్నే మెయిల్ పెట్టాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చెయ్యమని. అమెరికాలోని ఆర్ధికమాంధ్యనికి ఇక్కడ సాఫ్ట్ వేర్ కంపెనీలు ఎలాగు మూసుకోవాలి. ఇళ్ళులేని భారతీయ పక్షులన్నింటికీ హైటెక్ సిటీ లో గూళ్ళు కట్టి అమ్ముకో అని. అదీ వీడి ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో అని నిద్రపట్టక లేచుంటాడు.)

వెంటనే నేను కిటికి మూసేసి, కర్టేన్ వేసి లోపలికి వచ్చేసా.

కాసేపు అష్టాచెమ్మా,గుడుగుడు గుంచం ఆడుకున్నాం. కోతికొమ్మచ్చి, కబడ్డీ, కర్రాబిళ్ళ ఆడుకుందామంటే స్థలాభావం. అందుకే “ఎక్కడి సెల్లులు అక్కడే గప్చుప్ సాంబార్ బుడ్డీ” ఆడుకున్నాం.(ఆట నియమావాళి: 1.అందరూ నిజాయితీగా ఆడాలి. 2.రూం లో ఉండే వారు, అమీర్ పేట హాస్టల్లో ఉండేవాళ్ళు బయట వారిని ఆడించకూడదు. 3.కొద్దిరోజులముందే సెల్లు పోగుట్టుకున్న నాలాంటి వారిని ఆడించేప్పుడు తగిన జాగర్తలు తీసుకోవాలి. 4.మీ సెల్లు గాని దొంగ సెల్లు అయితే సెల్లు యజమాని ఉన్నప్పుడు ఆడరాదు. ఆట విధానం: 1 .మొదటగా పంటలు వేసుకోవాలి. (పొలం లో వేసేవి కావు.) 2.దొంగ ఎవరో తెలిసాక వాడి సెల్లు తీసి పండిన వారు దాచేయాలి. 3.దొంగ పసిగట్టకుండా ఎప్పటికప్పుడు స్థలాలు మార్చాలి. 4.చివరగా ఎవరు దాచినప్పుడు దొంగ సెల్లు పట్టేసుకుంటాడో వాడు తర్వాతి ఆటకి దొంగ. ముఖ్య గమనిక: ఇక్కడ చెప్పబడిన ఆటలో జాగర్తవహించకుండా ఆడి సెల్లు పోగొట్టుకుంటే దానికి పూర్తి భాద్యత జానారెడ్డి గారిది. నైతికభాద్యత వహిస్తూ అమ్మ ఆదేశానుసారం ఆయన రాజీనామా చెయ్యాలి. జై ఉండవిల్లి)

గతంలో ఎప్పుడూ అంత పొద్దున్నే లేచిన అనుభవంలేదు. ఆ టైం లో ఏం చేస్తారో తెలియదు. పోని బయటకి వెళ్ళి అందరూ ఏం చేస్తున్నారో చూద్దమంటే చలి. ఇక గత్యంతరం లేక టి.వి. పెట్టా.

టి.వి.99: సాఫ్ట్ వేర్ ఉద్యోగులకి పిల్లనివ్వటానికి మీరు సిద్దమా? (మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.) మీ సమాధానం అవును అయితే ఎఱ్ఱగడ్డ పిచ్చి ఆసుపత్రి కి ఫోన్ చెయ్యండి. కాదు అయితే మీ పక్కింట్లో అద్దెకుండే సాఫ్ట్ వేర్ కుర్రాళ్ళు మీ అమ్మాయి మీద కన్నేసారు జాగర్త.

టి.వి.55: ఆర్ధికమాంధ్యంతో చివరికంటా పోరాడి ఉద్యోగాలు కోల్పోయిన సాఫ్ట్ వేర్ ఉద్యోగుల కుటుంబాలకి మీ సానుభూతి తెలియజేయాలనుకుంటే హైటెక్ సిటీ ముందు కొవ్వొత్తులని వెలిగించండి.

టి.వి. 100: @$!^*!*!)(*%%!$$

టి.వి. 1000000000000001: !@!^$%!!)*!*(!

టి.వి. ఆపేసి ఆఫీస్ కి బయలుదేరాను.

నేను: ఆటో లైఫ్ స్తైల్ కి వస్తావా?

ఆటోవాడు: 100 అవుతుంది.

నేను నా ట్యాగ్ తీసి మెడలో వేసుకున్నా.

ఆటోవాడు: సాఫ్ట్ వేరా?(సంతోషం సినిమా లో బ్రహ్మానందం డబ్బాపాలా అని అడిగినట్టు)

నేను: అవును. (దీనంగా మొహం పెట్టి)

ఆటోవాడు: ఊరుకోండి సార్. కష్టాలు సాఫ్ట్ వేర్ వాళ్ళకి కాకపోతే మనుషులకి వస్తాయా? ఇలాంటి సమయంలోనే ఒకరికొకరు చేదోడు గా ఉండాలి. 30 ఇవ్వండి చాలు.

కట్ చేస్తే మొత్తానికి ఆఫీస్ కి వచ్చిపడ్డా. డబ్బుల్లేక ఆటోవాడికి సొడెక్సో ఇచ్చా. ఆఫీస్ లో అడుగు పెట్టగానే పవన్ గాడు టెన్షన్ గా అటూ ఇటూ తిరుగుతున్నాడు.

నేను: “ఏమయ్యింది రా?”

పవన్: నాకు లీవ్ కావాలి రా. ఆర్.ఆర్.బి., బ్యాంక్ పుస్తకాలు కొనడానికి కోఠికి వెళ్ళాలి. సరోజ తెలుసు గా?

నేను: ఎవరు నువ్వు హౌసింగ్ లోన్ తీసుకున్న 20 లక్షలతో షాపింగ్ చేసిన అమ్మాయే గా ఎలా మరిచిపోతా?

పవన్: అవునవును. గవర్నమెంట్ ఉద్యోగం చూసుకోకపోతే, నన్ను పెళ్ళి చేసుకోను అంది. పోని మరో అమ్మాయిని చుసుకుందామంటే అప్పులివ్వటానికి బ్యాంకులన్నీ ఎత్తేస్తున్నారుగా.

అని హడావుడి గా మా పి.ఎం. ని కలిసాడు. మా పి.ఎం. “ఏంటయ్యా నీ గోల? రోలొచ్చి మద్దెలకి మొరపెట్టుకోవటం అంటే ఇదే. ఇటు ఉద్యోగం సవ్యంగా లేక అటు స్టాక్ మార్కెట్ లో పెట్టిన డబ్బులుపోయి నేను ఏడుస్తుంటే? వెళ్ళి ఏదో ఒకలా తగలడు” అని పవన్ గాడిని పంపేసాడు. నేను వెళ్ళి నా క్యూబ్ లో కూర్చున్నా. హాసిని ప్రమోషన్ వచ్చిందని చెప్పి స్వీట్ ఇచ్చి వెళ్ళిపోయింది. ఉద్యోగాలు తీసేసే కాలంలో ప్రమోషన్ ఏంటబ్బా నాకర్ధం కాలేదు. వాళ్ళ టీం లో ఉండే రాజేష్ ని అడుగుదామని కాల్ చేసా.

నేను: హలో

రాజేష్: అవును నేనే తాజ్ హోటల్లో చనిపొయింది. నా పేరు ఇమ్రాన్. మాది పాకిస్థాన్.

నేను వెంటనే బయపడి ఫొన్ పెట్టేసా. కాసేపట్లో కొందరు వైట్ డ్రెస్ లో వచ్చి రాజేష్ తో పాటు మరికొందర్ని గొలుసులు కట్టి తీసుకుపోయారు. జీవితంలో ఇచ్చిన ఒకేఒక్క సెమినార్ తో 10 మందిని మతిస్థిమితం లేకుండా చేసి హెడ్ కౌంట్ తగ్గించినందుకు హాసిని కి ప్రమోషన్ ఇచ్చారు. ఇంకా మరిన్ని సెమినార్లు చెప్పించాలని మేనేజ్మెంట్ అనుకుంది. ఏదో మెయిల్ చూసుకుంటున్నా.

ఫోన్ వచ్చింది. “సర్! నేను హెచ్.ఎస్.బి.సి. నుంచి మాట్లాడుతున్నా క్రెడిట్ కార్డ్”

నేను: నాకొద్దు.

“ఏడ్చావ్. అదే మేమూ చెప్పేది మీ కార్డ్ క్యాన్సిల్ చేసా పో” ఫొన్ పెట్టేసింది.

నా ఖర్మకి ఏడ్చి కాఫీ త్రాగుదామని వెళ్తుంటే (ఆఫీస్ లో కాదు బాబు. ఆఫీసుల్లో ఎప్పుడో ఎత్తేసారు) మా పి.ఎం. వచ్చి హాసిని ఏదో సెమినార్ అంటా నువ్వుకూడా వెళ్ళు అన్నాడు. విషయం అర్దమయ్యింది “సార్ పొద్దున్నే కాలుకి ముళ్ళు గుచ్చుకుంది అప్పటి నుండి కడుపులో నొప్పిగా ఉంది ఈ రోజు కి ఇంటికి వెళ్ళిపోతా” అని చెప్పి ఆయన ఏం చెబుతున్నాడో కూడా వినకుండా వచ్చేసా.

బయట ఒక కుర్రాడు ఏవో కరపత్రాలు పంచుతున్నాడు. మెడలో ట్యాగ్ వేసుకొని ఉన్నవాళ్ళకి మాత్రమే ఇస్తున్నాడు. నన్ను చూసి “గురూ తీసుకో పనికొస్తుంది” అని ఇచ్చాడు.

అందులో వివరాలు.. ప్రత్యమ్నాయ ఆదాయం కోసం కోచింగ్ సెంటర్. కోర్సులు

1. మిమ్మల్ని ఎవరూ గుర్తించకుండా పల్లీలు, భఠాణీలు అమ్ముకోవటం ఎలా?

2. మిర్చి బజ్జీ తయారీ విధానాలు.

3. దర్జాగా వచ్చి సెల్లు,ల్యాప్పీ పట్టుకొని పారిపోవటం ఎలా?

4…….

5…….

అదిచదువుతూ ఆటోని పిలిస్తే ఆటో వాళ్ళు అదోలా నా వైపు చూసి వెళ్ళిపోతున్నారు. ఒక ముసలి ఆటోడ్రైవర్ వచ్చాడు. “రా బాబు. భాదపడకు. ఆ భాద నాకు తెలుసు నాకూ సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసిన కొడుకు,అల్లుడూ ఉన్నారు” అని కన్నీళ్ళతో ఆటోలో తీసుకు వచ్చి డబ్బులు ఇస్తున్నా తీసుకోకుండా వెళ్ళిపోయాడు. నాకేమి అర్ధం కాలేదు. నేను రావటం చూసిన నా శతృవులైన పిచ్చుకలు తినటం మానేసి వచ్చి అన్ని గుమిగూడి ఒకదాని రెక్కలు ఒకటి పట్టుకొని నా వైపు చూసి ఆనందంగా నవ్వుతూ అరకులోయలో గిరిజన యువతులు చేసే థింసా నృత్యం చేయటం మొదలు పెట్టాయి. “కిచ్చా రే కిచా కిచా కిచ కిచ హో కిచ్చా రే కిచా కిచా కిచ కిచ హో” ఏరోజూ బియ్యం ఏరినప్పుడు కూడా ఒక్క గింజ వేసిన పాపాన పోలేదు నన్ను చూసి ఇంతలా పండగ చేసుకుంటున్నాయేంటి ఏం అర్ధం కాలేదు. బెల్ల్ కొడితే తలుపు తీసిన మా సన్నీ గాడు నన్ను చూసి భోరున ఏడ్వటం మొదలుపెట్టాడు.

నేను: “ఏమయ్యింది రా?”

సన్నీ: “నా ఉద్యోగం ఎలాగూ పోయింది. నీ ఉద్యోగం ఉందన్న ధైర్యం తో ఉన్నడబ్బులన్నీ పెట్టి బియ్యం కూరగాయలు తెచ్చేసా. గ్యాస్ ఆర్డర్ చేసా. లాండ్రీ కి బట్టలు కూడా ఇచ్చా. వా……ఆ డబ్బులే ఉంటే బస్సెక్కి అమలాపురం పోయి పాలవ్యాపారం చేసుకునేవాడిని.. వా….”

నేను: సరే ఇప్పుడేమయ్యింది?

సన్నీ: నీ చేతి లో ఆ పింక్ స్లిప్ ఏంటీ?

నేను: ఓర్ని చంపేసారు పో. అదా అందరు అలా అనుకోవటానికి కారణం.అది కరపత్రమ రా..బాబు.

జెమిని మ్యూజిక్ లో తెలుగు బ్లాగులు

ఈ రోజు మద్యాహ్నం 1:30 కి జెమిని మ్యూజిక్ లో బ్లాగులగురించి ఒక కార్యక్రమం లో వివరించారు. తెలుగు బ్లాగుల గురించి ప్రస్తావించారు. నాకు ఎక్కువసేపు చూసే అవకాశం దొరకలేదు. ఎవరయినా చూసి ఉంటే గనక కార్యక్రమ వివరాల్ని తెలపండి. కానీ యాంకర్ కి తెలుగు బ్లాగుల గురించిన సమాచారం ఎక్కువగా లేక పోవటం వలన అనుకుంటా మాటలు వెతుక్కుని చాలా ఇబ్బంది పడుతున్నట్టు కనిపించారు. ప్రసారమాధ్యమాల మద్దతు మనకి ఇప్పుడు ఎక్కువగా దొరుకుతుంది. ఇలాంటి సమయం లో బ్లాగుల గురించి తగిన సమాచారం వారికి అందేలా చూడటం మన కనీస భాద్యత.

ఒక టపాలో తెలుగు బ్లాగర్ల వివరాలు, బ్లాగు వయస్సు, ప్రత్యేకతలు పొందుపరిస్తే సులువుగా ఉంటుందని నా అభిప్రాయం. బ్లాగర్ గా నా వయస్సు కేవలం ఆరునెలలు మాత్రమే. అందువలన అందరి బ్లాగుల వివరాలు, వాటి పైన నా అవగాహన పరిమితం. అందువలన ఈ భాద్యతని నేను తీసుకోలేకపోతున్నా. లేదా మితృలు వ్యాఖ్యల రూపంలో మీకు తెలిసిన బ్లాగులని క్లుప్తంగా అందిస్తే ఒక టపాగా పొందుపరుస్తా.

జాజు – ఒక కాకి కధ

భద్రాచలం కొండల మధ్యలో ఓ కాకులు దూరే కారడవి. జాజు అనే ఒక కాకి పిల్ల మరి కొన్ని కాకులతో కలిసి ఆ అడవిలో ఉంటుంది. కొన్నేళ్ళ క్రితం ఈ కాకులన్నీ గోదావరి నది ఒడ్డున మైదాన ప్రాంతంలో ఉండేవి. ఒకసారి వచ్చిన పెనుతుఫానులో అన్ని చెల్లాచెదురయ్యి ఇక్కడకి వచ్చి తలదాచుకొన్నాయి. సమూహంలో చాలా కాకులు తమ ఆప్తులని కోల్పోయాయి. జాజు కూడా తన వాళ్ళందరినీ కోల్పోయి ఇక్కడ తలదాచుకుంది. సమూహం లోని కాకులన్నీ రొజూ పగలంతా తిండి వేటలో కష్టపడి చీకటి పడే వేళకి సమావేశమై తాగి,తిని సందడి చేస్తాయి

జాజు ఎప్పుడూ సమూహానికి దూరంగా ఒంటరిగా గడిపేది. ఎప్పుడూ తనవాళ్ళగురించి ఆలోచిస్తూ ఉండేది. జాజు కి చిన్నప్పటి నుండీ పాటలు అంటే చాలా ఇష్టం. జాజు తల్లి మంచిగా పాటలు పాడేది. సమూహంలో అందరూ తనపాట విని మెచ్చుకొనేవారు. ఎప్పుడన్నా ఏదన్నా ఉత్సవం జరిగితే జాజు తల్లి పాట ఉండాల్సిందే. జాజు ఎప్పుడూ తన తల్లి జోలపాడీతే గాని పడుకునేది కాదు. తన తల్లిని ఎప్పుడూ అడిగేది “నేను కూడా పెద్దయ్యాక నీ అంత బాగా పాడగలనా?” అని.కాని జాజు గొంతు శ్రావ్యంగా ఉండదు, కాస్త బండగా ఉంటుంది. కాని జాజు బాధపడకూడదని “నాకంటే బాగా పాడగలవు” అని చెప్పేది జాజు తల్లి. జాజు బాల్యం గుర్తుచేసుకుని ఎప్పుడూ భాదపడుతూ ఉండేది. సమూహంలో అందరూ ఉన్నప్పుడు జాజు పాడితే ఎవరూ వినేవారు కాదు. మంచిపాటలు పాడే తల్లి కి నువ్వెలా పుట్టేవ్ అంతేలే పండితపుత్ర పరమ శుంఠః అని ఏడిపించేవారు. ఒక ఉత్సవంలో పాటల పోటీలో పాడబొతే అందరూ గోల చేసి ఆపేసారు. అప్పటి నుండీ జాజు ఉత్సవాలకి వెళ్ళటం మానేసింది. జాజు కి సమూహంలో ఇద్దరు స్నేహితులు ఉన్నారు.వాళ్ళే చింకి,డుంబు. వాళ్ళు జాజు తో ” సంగీతమనేది పుట్టకతో రావాలి మనకి ఆ విద్య రాలేదు వదిలెయ్ ” అని చెబుతాయి. సమూహంలో తిరగటం, ఉత్సవాల్లో పాల్గొనటం ఇష్టం ఉన్నాసరే జాజు ని ఒంటరిగా వదిలి వెళ్ళటం ఇష్టంలేక చింకి, డుంబు కూడా వెళ్ళటం మానేసారు.

ఒక రోజు ఆ అడవికి ఒక కోకిల దారితప్పి వచ్చింది. దాని పేరు టింకు. టింకు ఒక చెట్టు మీద కూర్చుని మావిచిగురు తిని పాట పాడింది. దాని పాట విని అడవిలో కాకులన్నీ వచ్చి దాన్ని భందిచాయి.రాత్రి సమావేశం లో అన్నీ తప్ప తాగి ఉన్నాయి. సమూహం పెద్ద సాహి గంభీరంగా గద్దెమీద ఉన్నాడు. ఉత్సవాల్లో ఎప్పుడూ పాటలు పాడే కేతు ఆవేశంగా “టింకు జాతి వల్ల కాకి పాటలని అందరూ అసహ్యించుకుంటున్నారు. ఆ జాతి మీద తరతరాలుగా మనం చేస్తున్న యుద్దం ఇంకా ఆగలేదు. కేవలం మన గుట్టు తెలుసుకోవటానికి వచ్చిన గూఢచారి టింకు. దాన్ని చంపెయ్యాలి ” అని అరిచిగోల చేసింది.సమూహంలో కాకులన్నీ “అవును అవును” అన్నాయి. చేసేదిలేక సాహి కూడా అంగీకరించాడు. కానీ జాజుకి టింకుని చంపాలన్న సమూహం నిర్ణయం నచ్చలేదు. కానీ పెద్దల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే సమూహం నుంచి వెలివేస్తారు లేదా కొన్నిసార్లు మరణశిక్ష కూడా పడవచ్చు. అందుకే అందరిముందు ఏమి అనకుండా ఊరుకుంది. చింకి,డుంబులని పిలిచి ఎలాగైనా టింకు ని కాపాడాలని చెప్పింది. చింకి,డుంబు పెద్దలని కాదంటే ఏమవుతుందో అని మొదట భయపడ్డారు. కానీ ప్రాణస్నేహితుడి మాటను కాదనలేక ఒప్పుకున్నారు.

రాత్రి అందరూ తాగి మత్తుగా పడుకున్నారు. తెల్లవారితే టింకుని చంపేస్తారు. చీకటిలో ఎవరూ చూడకుండా జాజు మఱ్ఱిచెట్టు తొర్రలో ఉన్న టింకు కట్లు విప్పి బయటకి తీసుకువచ్చింది. చింకి, డుంబు బయట కాపలాగా ఉన్నాయి. అందరూ రాత్రి ఎవరూ చూడకుండా తప్పించుకుని చాలా దూరం ఎగిరి వచ్చేసాయి. టింకు వాళ్ళకి తన ధన్యవాదాలు తెలిపింది. “ఇక సెలవు మిత్రమా, నీ వాళ్ళ దగ్గరకి నీవు హాయిగా వెళ్ళవచ్చు ” అని టింకుని వదిలి వెనక్కు రావాలని అనుకున్నారు స్నేహితులు. “నా వాళ్ళు ఎక్కడున్నారో ఇప్పుడు ఇక జన్మ లో నేను వాళ్ళని కలవలేనేమొ. ఇక్కడ దగ్గరలో ఏదో మామిడి తోపు చూపించండి అక్కడే ఉండిపోతా.” అంది టింకు. అప్పటికే తెల్లవారింది. తమ సమూహంలో అప్పటికే విషయం తెలిసిపోయుంటుంది ఇక వెనకకు వెళ్ళటం ఆపదకొనితెచ్చుకోవటమే అని మితృలు గ్రహించారు. ఇక అందరూ కలిసే ఉందామని నిర్ణయించుకున్నారు. మానవసంచారానికి దగ్గరలో ఉన్న ఒక చిట్టడవిలో నివాసం ఏర్పరుచుకొన్నారు.

అందరూ దగ్గరలో ఉన్న గ్రామానికి వెళ్ళి తిండి సంపాదించుకొనేవారు. వచ్చే దారిలో ఒక విద్వాంసుడు తన శిష్యులకి సంగీతం నేర్పేవాడు. జాజు అక్కడే చెట్టుమీద కూర్చుని రోజూ ఆ పాటలు విని మనుషులు చాలా అదృష్టవంతులు అనుకునేది. అలాంటప్పుడు ఎప్పుడన్నా టింకు పాడితే గురువు ఆహా కోకిలది ఎంతకమ్మని గొంతు అనేవాడు. చాలా సార్లు అలావిన్న జాజు ఒక రాత్రి “మిత్రమా! నీకు ఇంత కమ్మని గొంతు ఎలా వచ్చింది” అని అడిగింది. “మావిచిగురు తినటంవలనే మా జాతికి ఇంత కమ్మని గొంతు వచ్చింది నేస్తం” అని టింకు చెప్పి పడుకుంది. ఆ రోజు రాత్రంతా జాజు కి నిద్రపట్టలేదు. తన తల్లి గుర్తు వచ్చింది.

మధ్య రాత్రి లో ఏదో శబ్దం వినిపించి టింకు లేచి చూసింది. జాజు మామిడి చెట్టు మీద కూర్చుని చిగురు తిని తిని పాడుతూ ఉంది. దానితో గొంతు కి మామిడి చిగురు అడ్డుపడి మూర్చపోయింది. చింకి, డుంబు వెంటనే లేచి వెళ్ళి పట్టుకున్నారు. టింకు ఒక చిన్న ఆకు తో నీరు తెచ్చింది. నీరు త్రాగిన జాజు కాసేపటికి మొత్తం మామిడి చిగురు కక్కేసింది. రాత్రంతా స్నేహితులంతా దానికి సేవలు చేస్తూ ఉన్నారు. తెల్లవారితే జాజుకి తెలివి వచ్చి అందరినీ చూసి తల దించుకొని ఏడుస్తుంది. “నాకు జన్మలో పాటలు రావు. నాకు చాలా సిగ్గుగా ఉంది” అని జాజు భాదపడింది. “నీకు కూడా మంచిగా పాటలు వస్తాయి బాదపడకు” అంటుంది టింకు.

“నా గొంతు బాగుండదు కదా మరి నేను ఎలా మంచిగా పాడగలను” అని అడిగింది జాజు. “పాడటానికి శ్రావ్యమైన గొంతు తప్పనిసరి కాదు గొంతులో మంచి శృతి,లయ ఉంటే చాలు” అంది టింకు. కానీ జాజు ఆ మాటలు నమ్మదు. ఒక రోజు వీళ్ళు ఉండె అడవికి కొంతమంది మనుషులు పిక్నిక్ వచ్చారు. వాళ్ళు పగలంతా నీట్లో ఆడుకొని రాత్రికి మంట పెట్టి దాని చుట్టూ పాడుతూ డ్యాన్స్ చేస్తున్నారు. వాళ్ళ గొంతు ఊరిలోని విద్వాంసుడి గొంతులా గొప్పగా లేదు. బండ గా ఉంది. అయినా వాళ్ళు పాడుతూ ఉంటే చాలా ఉత్సాహంగా ఉంది. టింకు వాళ్ళని చూపించి “చూసావా సంగీతానికి గొంతు కాదు శృతి లయ ముఖ్యం” అని చెప్పింది. మరుసటి రోజు నుంచి ఒక వారం రోజులు పాటు దగ్గరలో ఉన్న గ్రామాలన్నీ తిరిగి ప్రజలు వినేవి, పాడుకునేవి పాటలన్నీ విన్నారు. అందులో జాస్సిగిఫ్ట్ తో మొదలెట్టి హిమేష్ వరకు ఉన్నాయి. “అ అంటే అమలాపురం” నుండి “ఆకలేస్తే అన్నంపెడతా” వరకు ఉన్నాయి. అప్పుడు టింకు చెప్పింది నిజమే అని జాజు నమ్మింది. ఆ రోజు నుండి టింకునే జాజు కి సంగీత గురువు. జాజు కష్టపడి రాత్రి పగలు పాడుతూనే ఉంటుంది. చింకి, డుంబు జాజు తిండి అవసరాలు చూస్తూ ఉంటారు. వాళ్ళకి కూడా సంగీతం మీద ఇష్టం పెరిగి జాజు పాడూతూ ఉంటే పక్కన ఎండిన ఆకులను తొక్కుతూ, ముక్కులతో కొమ్మలను కొడుతూ శబ్దం చేస్తూ ఉంటారు. ఒక రోజు చింకి కొన్ని చిన్న చిన్న గిన్నెలు చెంచాలు ఎత్తుకొచ్చి వాటిని కొట్టటం మొదలు పెట్టింది. డుంబు ఊరిలోకి పోయి ఒక బూరలమ్మే వాడి బుట్టలో ఉన్న ఏక్తారా ఎత్తుకొచ్చేసి ముక్కుతోను, గోళ్ళతోను వాయించటం మొదలు పెట్టింది. జాజు తెలివిగా తన బండ గొంతుని, టింకు మంచి గొంతుని సరైన పద్దతిలో కలిపి చక్కని బాణీలు కట్టి పాడింది. వాళ్ళు అలా పాడుతూ ఉంటే ఆ చిట్టడవిలో జంతువులన్నీ మెచ్చుకున్నాయి. ఇంకేముంది తాము “4 నోట్స్” అనే ఒక రాక్ బ్యాండ్ గా ప్రకటించుకున్నాయి.

తమ సమూహం లో తన పాటల ప్రతిభ చూపించాలని తన తల్లి పేరు నిలబెట్టాలని జాజు స్నేహితులతో తిరిగి పాత అడవికి బయలుదేరింది. వీరిని చూడగానే కేతు తన బృందంతో దాడి చేసి భందించింది. సాహి ముందు హాజరు పరిచింది. వాళ్ళు చేసిన దాడి లో జాజుకి తీవ్రంగా దెబ్బలు తగిలాయి. సాహి మీరు సమూహం నిర్ణయాన్ని ఎదిరించారు మీకు మరణశిక్ష తప్పదు. కానీ పారిపోయిన మీరు ఎందుకు తిరిగి వచ్చారు చెప్పండి అని అడిగింది. జరిగిన విషయం మొత్తం జాజు చెప్పింది. అంతా విన్న సాహి ఆలోచనలో పడింది. కేతు గర్వంతో పాటలో నన్ను ఓడిస్తే నీకు శిక్ష లేకుండా వదిలేస్తాం అని అంది. అందరూ ఒప్పుకున్నారు. చావు ఎలాగు తప్పదు కాబట్టి చివరి అవకాశంగా జాజు కూడా ఒప్పుకుంది. కానీ పోటిలో ఓడితే తనని మాత్రమే చంపాలని మిగిలిన వాళ్ళని క్షమించాలని ఇదే తన చివరికోరికని చెప్పింది. కేతు వీళ్ళ దగ్గర ఉన్న వస్తువులన్నీ ఎక్కడివి? దొంగతనం గా ఎత్తుకు వచ్చినవిలా ఉన్నాయి వీటిని వాడటానికి వీళ్ళేదంది. కేతూ బృందం మాత్రం పాట మొదలు పెట్టి అద్బుతంగా పాడారు. కాకులన్నీ ఆనందంతో చిత్తుగా తాగి ఊగి రెచ్చిపోయి గెంతాయి. ఇప్పుడిక జాజు బృందం పాడాలి. వాద్యాలు లేవు. జాజు దిగులుగా వేదిక మధ్యలో నిలబడింది. డుంబు కి మెరుపులాంటి ఆలోచన వచ్చింది. తనతోకలో ఒక ఈక పీకి బాణంలా వంచి దానికి చిన్న చిన్న తీగలు కట్టింది. “ట్రంగ్” మని గట్టిగా శబ్దం చేసింది. చింకి కొన్ని కొబ్బరి చిప్పలు తెచ్చి తిరగేసి వాటి మీద ముక్కు తో కాంగో కొట్టటం మొదలుపెట్టింది. టింకు “హే హే లలల లా హే హే లలల లా” అని చిన్న ఆలాపన చేసింది. అప్పుడు జాజు కి ఉత్సాహం వచ్చింది. మితృలందరూ చావుకి సిద్దపడే ఉన్నారు. జీవితంలో చివరిసారి పాడుతున్నాము అనే స్పృహలో ఉన్నారు. తమకిష్టమైన సంగీతం కోసం చావుకి సిద్దపడ్డారు. సంగీతంలో మునిగి చనిపోవాలన్న కాంక్షతో తన్మయత్వం లో ఉన్నారు. వారి ఆత్మలీనమైన ఆ పాట అద్బుతంగా ఉంది. జాజుకి తగిలిన దెబ్బలనుండి రక్తం కారుతూనే ఉంది. కేతు కూడా పాటలో లీనమైపోయాడు.

“నా తల్లి లాలిపాటలో,

నామితృలు పంచిన ప్రేమలో,

కమ్మదనమే నా పాట.

ఈ వరాలన్నీ నాతో ఉంటాయి ప్రతిపూట.

ఈ పూట తో నా ఊపిరి పోయినా,

ఓ పాటగా నే బ్రతికే ఉంటా.

ఆ కొండలో ఆ కోనలో, ఈ చెట్టులో ఈ పుట్టలో,

ప్రతి సవ్వడిలో ఓ పాటగా నే బ్రతికే ఉంటా.”

ఆత్మ ని మిలితంచేసి పాటలోనే కలిసిపోయి పాడూతూ జాజు వేదికపైన ఒక్కసారి కుప్పకూలి పడిపోయింది.   

మరి జాజు తిరిగిలేచిందా? సమూహం వారి గొప్పతనాన్ని ఒప్పుకుందా? వాళ్ళ పాటకి అడవితల్లి జేజేలు పలికిందా? లేక సమాజం ఎప్పటిలానే తన కాఠిన్యం చాటుకుందా? ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పి నాది అనే ఒక ముగింపు ఇవ్వటం నాకిష్టంలేదు. “విఙ్ఞులయిన పాఠకులారా మీకు నచ్చిన ముగింపుతో మీరే కధని చదవటం పూర్తిచేయండి.”

నిప్పా? కంప్యూటరా?

నాకు రాత్రి ఒక కల వచ్చింది. ఆ కలలో ఒక విచిత్రమైన చర్చ జరుగుతుంది. నేనుకూడా వాదిస్తున్నా. ఎవరితో వాదించానో గుర్తులేదు. చర్చావిషయం ఏంటంటే  “మొత్తం మానవ విఙ్ఞాన ప్రయాణంలో  నిప్పుని ఆవిష్కరించటం గొప్పదా? కంప్యూటర్ ఆవిష్కరించటం గొప్పదా? ”

నేనేం వాదించానో స్పష్టంగా గుర్తు లేదు. బ్లాగుమితృలని అడుగుదాం అనుకున్నా. మీరేమనుకుంటున్నారు?

హాసిని కి పెళ్ళి చూపులోచ్…

(గమనిక: హాసిని పాత్ర పూర్వాపరాలు తెలుసుకోవాలనుకుంటే హ హా హాసిని చదవండి. చదవకపోయినా ఈ టపాని చదవటానికి ఇబ్బందిలేదు. )

“ఏంటి మురళీ ఏం చేస్తున్నావ్ ? అలా బయటకి పోయివద్దాం రాకూడదూ” అంటూ వచ్చారు శ్రీ శని గారు. అసలే ఆయన నా చిరకాల మితృడు, తరతరాలుగా మా కుటుంబానికి ఆప్తుడు.
“అయ్యా! తమకేంటి ఇంత ప్రొద్దునే నా మీద ఇంత అభిమానం” అన్నాను.
“ఎన్ని సార్లు చెప్పానయ్యా నిద్రలేస్తూనే అద్దంలో ముఖం చూసుకోవద్దని. వింటావా? వినవు. నేను రాక తప్పింది కాదు” అన్నారు శనిగారు.
“ఏంటో ఎన్నిసార్లు మానుకుందామన్నా ఈ వెధవ అలవాటు మారటం లేదు. ప్రొద్దునే లేస్తూనే ముఖం ఎలావుంది, జుత్తి రేగిందా అని చూసుకోవటం అలవాటయ్యింది” అంటూ మనసులో కాదు బయటకే తిట్టుకున్నా. మనసులో అనుకున్నా ఆయనకి ఎలాగు తెలిసిపోతుందిగా.
“ఎంతవరకూ?” అన్నాను.
“భూమి మీద ఇంకా నీ నూకలు చెల్లిపోలేదులే. అదుగో నీకోసం అన్నపూర్ణా వాడు ఆట్టా, మైసూర్ సేండిల్ వాడు సబ్బులు, రోగాలకి రాన్ బ్యాక్సీ వాడు మందులు …. అన్ని ఫ్యాక్టరీల్లో తయారవుతున్నాయి లే. బయపడకు పదా” అన్నారు శనిగారు శూన్యంలోకి చూస్తూ.
”ఆమాత్రం హామీ ఇచ్చారు చాలు. పదండి. గురువుగారు నాకో మంచి స్నేహితురాలుంది తనని మీకు పరిచయం చేస్తా నన్నొదిలి తనతో దోస్తీ చెయ్యకూడదూ ?” అడిగాను ఆశగా.
“మొదట పరిచయం చెయ్యు తర్వాత ఆలోచిస్తాను.” ఆయన నవ్వులో ఏదో చిద్విలాసం. ”హమ్మయ్యా ఇది బాగుంది పదండి” మానవడు ఆశాజీవి.

అలా ఆయన్ని ఒక కాఫీషాపు కి తీసుకొని వెళ్ళా. ఎదురుగా ద గ్రేట్ హాసిని. ఇక ఈ రోజుతో దీని పని కట్టు. శనిగారు దీని తో స్నేహం చేస్తే దీని నోరు పడిపోతుంది. మాట్లాడకుండా ఇది ఎలాగూ బ్రతకలేదు కాబట్టి నరసింహా లో రమ్యకృష్ణలా ఒక చీకటి గదిలోకి పోతుంది.నన్ను ట్రైనులో పెట్టిన హింసకి ఇదే సరైన ప్రతీకారం. ఒక వేళ కర్మకాలి శనిగారి ప్రభావం చూపించలేకపోతే  ఈ వాగుడుకాయ ఎలాగూ ఈయన టెంకి పీకి  లోపలున్న గుజ్జంతా నంజుకుతినేస్తది. ఆయన జన్మలో ఎవరి జోలికి రాడు, రాలేడు. కాబట్టీ ఏవిధంగా చూసిన నాకే లాభం అనుకుని సంబరపడుతున్నా.
“హాయ్ శనిగారు ఎలా ఉన్నారు? ఏంటి ఈ మధ్య అసలు కనిపించటం మానేసారు?” అని 32 పళ్ళలో 30 కనబడేలా నవ్వుతూ అడిగింది హాసిని. నాకు కళ్ళు బైర్లుకమ్మి ఆ మెరుపులో మా జేజమ్మవాళ్ళ అమ్మమ్మ కనిపించింది. పాపం బాగా చిక్కిపోయింది 😦

“ఏం లేదు రా కన్నా ఈ మధ్య నువ్వు చేసే పనులన్నీ మెదడుకి మేత పనులేగా. శుభకార్యాలేవీ చేయటం లేదు నాకు మరి పనిపడటం లేదు” ఈయనగారు చెబుతున్నారు ఎక్కడలేని ప్రేమా ఒలకపోస్తూ. (గమనిక: మెదడుకి మేత అనగా మేకలాగ మెదడు మేసేయ్యటం.)
నేను ఏడుపులాంటి నవ్వు తో అక్కడ నిలబడ్డాను. నా ఏడుపు మునుపు డోలు శబ్ధంలా ఉండేది, ఇప్పుడు మద్దెల లా ఉంది ఎందుకో మరి.

ఇంతలో హాసిని ఎవరికో మెదడువాపు తెప్పించాటనికి (తగ్గించటానికి కాదు కేవలం తెప్పించటానికి) పక్కకి వెళ్ళింది. మంచి తరుణం మించిన దొరకదు అని పిచ్చికుక్క తరిమినట్టు పరిగెడుతూ వచ్చి ఇంటి దగ్గర పడ్డాను. నా వెనుకే శనిగారు దారిలో ఉన్న పనులు పూర్తి చేసుకోని వచ్చారు. “ఈవిడ మీకెలా తెలుసు స్వామీ?” అన్నాను.
“అసలు ఆవిడ నీకు పరిచయం  కావటమే నా ప్రభావం వలన. నీకో విషయం చెప్పనా” అని ఒక చిన్న పిట్టకధ చెప్పారు. అదే హాసిని పెళ్ళి చూపుల కధ.

హాసిని ఎప్పటిలాగే ఆఫీస్ కి టైముకి వచ్చేసి సిన్సియర్ గా చాటింగు చేసుకుంటూ ఉంది. ఇంతలో తనని పెళ్ళి చూపులు చూసిన 18 వ పెళ్ళికొడుకు ఉదయ్ కిరణ్ పింగ్ చేసాడు. వాడి బాసుగారి కూతురి స్నేహితురాలయిన రమ్య లేచిపోయి పెళ్ళిచేసుకున్న విషయం చర్చించాక, ఆఫీస్ ప్యూన్ సుబ్బారావు పట్టబుర్ర మీద ఈకలు మొలవక పోవటనికి కారణాం గురించి గొడవ పడుతున్నారు. ఇంతలో 19 వ పెళ్ళికొడుకు రాంచరణ్ “నాకిష్టమయిన పాట మౌనమే నా భాష ఓ మూగ మనసా ” అని మెసేజ్ పెట్టాడు. అప్పుడే రాబోయే పెళ్ళికొడుకు పవన్ కళ్యాణ్ ఫోన్ చేసాడు. రింగ్ టోన్ లోనే “మే..మే..” అని మేక అరుపు వినిపించింది. బకరా వాసన కొత్త బకరా వాసన అని హాసిని లోని వాగుడు దెయ్యం ఫోన్ ఎత్తింది.  “ఈ పాటికి మీ ఇంట్లో వాళ్ళు నా గురించి చెప్పే ఉంటారు. రేపు శనివారం సెలవు కదా కలుద్దామా?” అని అడిగాడు.  ఆ విషయం మీద ఒకగంట మాట్లాడిన తరువాత “సరే రండి” అని చెప్పి ఫోన్ పెట్టేసింది.

శనివారం ఉదయాన్నే పవన్ కళ్యాణ్ ఫోన్ చేసాడు నేను బయలుదేరాను మీరు రెడీ అవ్వండి అని. ఇక తప్పదని హాసిని 9 గంటలకే లేచి తయారవ్వటం మొదలు పెట్టింది. పవన్ మేఘాల్లో తేలిపోతూ,పాట పాడుకుంటూ వస్తున్నాడు. “హహ హా హహ హా హాసిని నీ నవ్వుల్లో ఎవరునట్టూ…. మేరి సఝనా.. మేరి సఝనా..  ధడేల్ ధడేల్ డమాల్”  శనిగారు ఎంట్రీ వలన వచ్చిన శబ్ధం. పవన్ ఆగి ఉన్న ఆటో ని అరవై కిలోమీటర్ల వేగం తో గుద్ది ఎగిరి, అంబులెన్స్ టాపు మీద పడ్డారు. ఆయన బైకు జారుతూ పోయి 108 క్రిందకి దూరింది. హాసిని కాసేపు ఆయన కోసం చూసింది రాలేదు. ఫోన్ చేసింది ఎత్తలేదు. సర్లే అని అన్నపూర్ణా మెస్ కి వెళ్ళి ఆంధ్రా తాలి తెప్పించుకొని దానిలోకి సర్వర్ ని నంజుకొని తినేసింది.

ఇది జరిగిన నెల రోజులకి పవన్ కోలుకుని పట్టు వదలని పప్పూ మరలా పరీక్షలు రాసినట్టుగా పెళ్ళిచూపులకి మరోసారి సిద్దపడ్డాడు. శనివారం కలిసి రాలేదని ఆదివారం ఫోన్ చేసి బయలుదేరాడు. కూకట్ పల్లి నుండి ఎర్రగడ్డ వరకు ప్రశాంతంగా ఉన్న ఆకాశం ఒక్కసారిగా ఉరిమింది. పిడుగులతో కూడిన వర్షం. వరదగా వచ్చిన నీటిలో పవన్ బైకు కొట్టుకుపోయి ఒక మేన్ హోల్ లొ ఇరుక్కుంది. ఈతరాని పవన్ ని భద్రతాదళాలు కాపాడాయన్న వార్తని బావర్చి లో ఇస్మాయిల్ తో  మాటాడుతూ బిరియాని తింటూ ఉన్న హాసిని కి టి.వి. చూస్తే గాని తెలియలేదు.(అమ్మతోడు సదరు ఇస్మాయిల్ ఎవరో నాకే కాదు హాసినికి కూడా అప్పటి వరకు తెలియదు)

అయినా పవన్ మరలా ఆదివారం రాగానే నేను రెడీ అని పోన్ చేసాడు. ఈ సారి హాసిని హృదయం చలించింది. పెళ్ళిభోజనాల్లో లో ఎంగిలి ఆకు కోసం ఎదురు చూస్తున్న మున్సిపాలిటి కుక్కలా తనకోసం ఎదురు చూస్తున్న పవన్ మీద మంచి అభిప్రాయం కలిగింది.వినాయకుడికి కొబ్బరికాయలు కొట్టి, జేబులో నిమ్మకాయలు పెట్టుకుని బయలుదేరిన పవన్ ఏ ఆటంకాలు లేకుండా వచ్చేసాడు. మేడమీదనుంచి దిగి పవన్ ని చూసిన హాసిని కెవ్వుమన్న కేకతో పడిపోయింది. తుమ్మ మొద్దుకి, తారుడబ్బా కి పుట్టిన సింగరేణి బొగ్గులా ఉన్నాడు. ఐరన్ లెగ్ శాస్త్రిని తలపై సుత్తి దెబ్బలేసి ఎత్తు తగ్గిస్తే  ఎలా ఉంటాడో అదే ఆకారం లో (నిరాకారమేమో?) గుండ్రంగా ఉన్నాడు. కరెంట్ పోతే ఎక్కడున్నాడో పోల్చుకోవటానికి కళ్ళే ఆధారం, ఎందుకంటే పళ్ళు కూడా తెల్లగా లేవు.

పవన్ హాసిని ని ఐ-మాక్స్ కి తీసుకెళ్ళాడు. పవన్ ఉత్సాహం కోసం కాఫీ తాగితే, హాసిని షాక్ నుంచి తేరుకోవటానికి ఐస్ క్రీం తీసుకుంది. అయినా తనకోసం కష్టపడ్డ పవన్ మీద ఏదోమూల మంచి అభిప్రాయం. మొదటిసారిగా హాసిని నోటికి తాళం వేసిన మొనగాడు పవన్ (మాటలు ఆపినవాడే మొనగాడు). ఇద్దరుకాసేపు మాట్లాడాక ఇక వెళ్దాం అనిలేచింది. సరే హాసిని హాస్టల్ దగ్గరలో ఉందనగా ఒక స్నేహితురాలు స్వప్న కనిపించింది. హాసిని గుండెళ్ళో రైళ్ళు పరిగెడుతున్నాయి. ఇతను ఎవరంటే ఏం చెప్పాలి? ఏమని చెప్పగలదు, ఎలా చెప్పగలదు. హమ్మో తన పరువు ప్రతిష్టలు. స్వప్న బాగా దగ్గిరకి వచ్చేసింది. చేయి చాపింది. హాసిని కూడ చేయి చాపింది. కానీ స్వప్న చేయిని పవన్ ముందు అందుకున్నాడు. అయిపోయాను మొత్తం చెప్పేస్తాడు అనుకుంది హాసిని.
“మీరేంటి ఇక్కడ” అని అడిగింది స్వప్న.

“హాసిని ని కలవటానికి వచ్చా అని ” చెప్పాడు పవన్.

హాసిని ని ప్రక్కకి తోసేసి ఇద్దరూ ఆపకుండా పలకరింపులు, కష్టసుఖాలు కొనసాగించేస్తున్నారు. జీవితం లో వాగుడు తో తనకే చెక్ పెట్టిన జంటని మొదటసారి చూస్తుంది హాసిని.
హాసిని షాకు తట్టుకోలేక మిట్ట మధ్యాహ్నం  నడిరోడ్డుమీద కళ్ళు తిరిగి పడబోయింది. ఆకలి వల్లనేమో అని స్వప్న,పవన్ హాసిని ని అన్నపూర్ణా రెస్టారెంటులోకి తీసుకెళ్లారు.
చికెన్ బిరియాని తెప్పించుకొని దుమ్ములురిచుకుంటూ,జోకులేసుకుంటూ హాసిని తింటుందో లేదో కూడా పట్టించుకోకుండా మాట్లాడేసుకుంటున్నారు స్వప్న,పవన్.వారి తిండి చూసిన హాసిని పక్షి జాతి ఏ జన్మలో ఏ పాపం చేసుకుందో అనుకుంది. వాళ్ళు మాత్రం పరుశరాముడు క్షత్రియ జాతిని నిర్మూలించినట్టు, ఆంధ్రప్రదేశ్ లో కోడీజాతిని నిర్మూలించటమే లక్ష్యంగా తింటూనే ఉన్నారు. అప్పటికే అటూ ఇటూ తిరిగిన సర్వరుకి ఆయాసం వచ్చింది. వండుతున్న వంటవాడికి గుండె నొఫ్ఫి వచ్చింది. ఇక ఆగలేక “మా దగ్గర కోళ్ళు లేవు. మేకలు,గొఱ్ఱెలు మీ దాటికి తట్టుకోలేక పారిపోయాయి. ఇక నేనే మిగిలాను నన్ను తినండి” అని టేబులెక్కి ప్లేటులో కూర్చున్నాడు సర్వరు. వాళ్ళకి ఎంత జాలేసిందంటే అంతజాలేసింది. “పచ్చిమాసం ఎలా తింటాం” అంటూ లేచారు.
ఒకగంట తరువాత పవన్ ఇద్దరికి చెప్పి బయల్దేరాడు. హాసిని స్వప్న ని బర బరా ఈడ్చుకొని లాక్కేల్లి అసలు వాడు నీకెలా తెలుసే అని ఆడిగింది. “ఏముందే మొన్న కుటుంబమంతా వచ్చి నన్ను చూసి వెళ్ళారు. పైగా పెళ్ళిచూపుల్లో మూడు రోజులు మా మూడు గేదెలు కష్టపడి ఇచ్చిన జున్నుపాలని జున్ను చేస్తే ముప్పై నిమిషాల్లో ముక్క మిగల్చకుండా మింగేసి నాకు జున్నంటే చాలా ఇష్టం. మీరే చేసారా. బాగుంది. అని ఒక పొగడ్త నా మొహాన పారేసి ఏ విషయం ఇంటికి వెళ్ళాక తెలియజేస్తాం అన్నారు. ఆ రోజు వాడి తిండికి జడుసు కున్న మా అక్క కొడుక్కి జ్వరం పట్టుకొని 10 నిమిషాల్లో 13 విరేచనాలయ్యాయి. ఇంకా గ్లూకోజు బాటిల్లు ఎక్కిస్తూనే ఉన్నారు. ఈ రోజు బిల్లు ఎలాగూ వాడిదే కదా అని ఒకపట్టు పట్టా  ” అని చెప్పింది స్వప్న.హమ్మయ్య పొరపాటున తను బిల్లు కట్టడానికి కమిటవ్వలేదు అనుకుంది హాసిని.

పదిరోజుల తరువాత పవన్ కి స్వప్న కి పెళ్ళయిపోయింది. హాసిని తనని చూడటానికి వస్తా అన్న  21 వ పెళ్ళికొడుకు  మహేష్ బాబు ని రావొద్దని చెప్పింది

వినాయక చవితి శుభాకాంక్షలు (మూషికవ్రతం మరిచిపోకండి) :)

బ్లాగు మితృలందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. ఆ పరమాత్ముడు మీ సర్వకార్యములలో విఘ్నాలను తొలగించి అన్ని రకముల శుభములను, విజయాలను అందిచాలని కోరుకుంటూ
మీ
మురళీ.

నేటికి నెరవేరిన మూషికవరం వృత్తాంతం చదివి,విని,అందరికి చెప్పి సుఖశాంతులు పొందుదురు గాక.

)

బందరు మామయ్య – బంగారు బాతు

అర్దరాత్రి ఎనిమిది గంటలయ్యింది. అందులోనూ ఆదివారమో ఏమో నేను మంచి శవాసనం లో ఉన్నా. సెల్లుఫోను నిద్రలేచి గోల చేస్తుంది. మా ఇంటిలో వాళ్ళు నిశాచరుల్లా అప్పుడే 6 గంటలకి లేచి పనులు చేసుకుంటున్నారు. సెల్లుగోల నా చెవిన పడితే నా నిద్ర పోతుందని మా మమ్మీ వంట చేస్తున్నది కాస్త పరుగున వచ్చి అందుకుంది. ఫోను ఎత్తిన 2 నిమిషాలకి కెవ్వుమని కేక వేసి అమ్మా ఇలా రా అంటూ మా అమ్మమ్మ ని పిలిచింది. ఆ దెబ్బకి నేనే కాదు ప్రక్కవీధిలో అప్పుడే పోయిన పంతులుగారు కూడా ప్రాణం వచ్చి లేచి కూర్చున్నారు. ఎమయ్యిందో అర్దమయ్యేలోపే మరో కెవ్వు. మా అమ్మమ్మ ఈ సారి నాకు గూబలు అదిరిపోయి దిండు తో చెవులు మూసుకున్నా. పంతులు గారు ఈ సారి జడుసుకొని పడి ‘పోయారు ‘. ఇంకో కెవ్వు పంతులు గారి కుటుంబ సభ్యులు. ఇన్ని కెవ్వులతో లేచాను ఈ రోజు ఎదో మూడింది అనుకున్నా. తాపీగా కాఫీ త్రాగుతూ అడిగా ఈ కెవ్వులకి మూలం ఏంటని. మరలా మా అమ్మమ్మ ఎదో అరిచేదానిలా హావభావాలు పెట్టింది. నేను దడుచుకొని మూల దాక్కున్నా. మా మమ్మీ కాస్త స్థిమిత పరిచి విషయం చెప్పింది బందరు మామయ్య వస్తున్నాడు రా. అమ్మమ్మ చేసే బందరు లడ్డూ తప్ప బందరు మామయ్య ఎవరో తెలియదు నాకు. మా మమ్మీ ప్రోద్భలంతో నా కళ్ళ ముందు రింగులు తిరుగుతున్నాయి, సీలింగు మీద ఫ్యానులా.

నేను పుట్టక మునుపు 30 ఏళ్ళ క్రితం, అంటే బ్లాక్ & వైట్ కాలం రింగులు తిప్పుకుంటున్నారా? అలా అనుకున్న వాళ్ళంతా పప్పులో కాలేసినట్టే. అప్పుడు కూడా చెట్లు పచ్చరంగులోనే ఉండేవిట, మనుషులు రంగుల బట్టలే వేసుకుండే వారు ‘ట ‘ .  కాబట్టి మీకు పూర్తి రంగుల ప్రపంచం ఊహించే అవకాశం ఉంది రెచ్చిపొండి. మా అమ్మకి పెద్దన్నయ్య ప్రకాశం మంచి చురుకైన కుర్రాడు. ఊరిలో అందరి సమస్య లని పట్టించుకొనేవాడు (దూరేవాడు.). అందుకే తనని అందరూ అభిమానం తో బలదూర్ అని పిలిచేవారు. అప్పటిలోనే అభ్యుదయ భావాలతో పక్కవారి పొలం లో చెరుకులు, తోటల్లో మామిడి కాయలు కోసుకొచ్చి తన బ్యాచ్ కి ఇచ్చేవాడంట. ఒకసారి బెల్లం చేస్తుంటే తేవటానికి వెల్లి కంగారు లో ఏదో తన్నేస్తే గుడిసె మొత్తం తగలబడిపోయిందంట. దానితో అటునించటే ఊరొదిలి పారిపోయాడంట. పోయి బందరులో ఉన్న ఇద్దరుపెళ్ళాల షావుకారు దగ్గర పనికి కుదిరాడు. అలా బందరులోనే ఉండిపోయి బందరు మామయ్య అయ్యాడు. మామయ్య చేరిన కొన్ని రోజులకే షావుకారు గారి మొదటి పెళ్ళం పోయింది అవిడే వండిన ఉప్మా తిని. రెండో పెళ్ళాం తప్పిపోయింది (పాలవాడితోనో? పూలకొట్టు వాడితోనో?) ఇద్దరికీ పిల్లలు లేరు షావుకారు గారుకూడా మూడో పెళ్ళి కోసం పెళ్ళి చూపులకి వెళ్తూ కారు కి అడ్డంగా గేదెలు రావటంతో రోడ్డు ప్రక్కన చెట్టుని గుద్ది పోయారు.వారసులు లేని ఇంటికి వాసాలుపట్టుకొని వేలాడినందుకు మా మామ్మయ్య పంట పిచ్చిగడ్డి పండినట్టు పండింది. అయినా ఇంకా బందరు చూరు పట్టుకొనే వేలాడుతున్నాడు. మధ్య లో ఒకటి రెండుసార్లు పెళ్ళిలకి,పేరంటాలకి వచ్చేవాడంట. ఒక్కగానొక్క కూతురున్న తిక్కశంకరయ్య కూతుర్ని పెళ్ళి చేసుకొని తన అంతస్థు పెంచుకున్నాడు. పెళ్ళి తరువాత పూర్తిగా రావటమే మానేసిన మామయ్య ఇన్నాళ్ళకి వస్తున్నాడు. అది కెవ్వుల కధ.

మామయ్య కి ఒక్కగానొక్క కూతురు తన పెళ్ళి విషయం మాట్లడటానికి వస్తున్నాడంట.
“మనూర్లో ఎవరున్నారే “అన్నా.
“నువ్వేరా బడుద్దాయి” అంది అమ్మమ్మ.
అంత డబ్బున్నవాడు నాకెందుకు పిల్లనిస్తాడు అని నాకు అనుమానం. తెగిన బంధుత్వం కలుపుకోటానికి అని వచ్చింది సమాధానం.
నాకు ఇప్పుడు కొంచెం సిగ్గు మొదలయ్యింది. “పేరేమిటో?” నేను సిగ్గుపడుతుంటే నాకే ఏదోలా ఉంది.
“గజాల” చెప్పింది అమ్మమ్మ.
హ.. పేరు గజాలాన. సూపర్. ఆ రోజు రాత్రి కలలో “నన్ను ప్రేమించే మగవాడి వి నువ్వే అని, చేయి కలిపే ఆ మొనగాడివి నువ్వే అని”
మంచం మీద డిస్కోడాన్స్ చేయటం మొదలుపెట్టా. గజాల ఐస్ క్రీం తిందువు రా అంటే తీసుకోబోయా. దబ్ కళ్ళు బైర్లు కమ్మాయి మంచం క్రింద అమ్మమ్మ మీద పడ్డా. అమ్మమ్మ ఒక మొట్టికాయ వేసింది. లేచి మంచం మీద పడుకున్నా.
మరలా గజాల “అప్పుడే ఏం పడుకుంటావ్ లే మరో పాట వేసుకుందాం అని పిలిచింది.”
“నేను ఊహూ..అమ్మమ్మ” అన్నా. తనుమాత్రం “నో. అని ఆకాశం తనరెక్కలతో నను నిద్దురలేపి..”‘ అని నాకు నిద్ర లేకుండా చేసింది.

తెల్లారే సరికి అమ్మమ్మ 10 కేజిల సున్నిపిండి తెప్పించింది. ఏవన్నా పిండి వంటలు చేస్తున్నారేమొ మామయ్యకోసం అనుకున్నా. కానీ నా కాళ్ళు చేతులు కట్టేసి, నోట్లో గుడ్డలు కుక్కి మమ్మీ,అమ్మమ్మ, మా పనోడు అందరు కలిసి ఉదయాన్నెప్పుడో మొదలుపెట్టి లంచ్ టైం లో వాళ్ళకి ఆకలివేసే దాక తోలూడీపోయినా ఆపకుండా తోమారు. నేను అప్పటికి చాలా సేపటి క్రితమే అపస్మారక స్థితిలోకి పోయా. వాళ్ళు వదిలేసాక హమ్మయ్య అనుకున్నా. నా కట్లు విప్పితే ఒక్కొక్కర్ని కండలూడేలా కరిసి చంపేద్దామని సిద్దంగా ఉన్నా. వాళ్ళకి అనుమానం రాకుండా పడుకున్నట్టే నటించా. అయినా వైయస్ ముందా ఇందిరమ్మ భజన. మా అమ్మమ్మ నా కుతంత్రం పోల్చేసి, కట్లు విప్పకుండా రకరకాల ఆయుర్వేదిక మూలికలు కలిపి చేసిన ఏదో పధార్దాన్ని భోజనం పేరు తొ నా నోట్లో కుక్కేరు. అప్పటికి నీరసంగా ఉన్నా వద్దంటే పోతా అని కళ్ళు మూసుకొని మింగేసా. అలా కట్లతోనే పడుకున్నా. కాసేపయ్యాక కళ్ళు తెరిస్తే రాంగోపాల్ వర్మ సినిమా లో కెమెరా ముందే ముఖాలు పెట్టుకు కూర్చున్నా దెయ్యాల్లా ముగ్గురూ మరో 5 కేజీల సున్నిపిండి తో. రాత్రికి క్షురకర్మ కూడా పూర్తిచేసాక నా కట్లు విప్పారు. అంతే శివపుత్రుడు లో విక్రం లా మీదపడ్డా. అమ్మమ్మ గజాలా వద్దా నీకు అని బెదిరించింది. “ఒకే ఒక క్షణం చాలుగా .. ప్రతీ కలా నిజం చేయగా” అంటూ గజాల నా ఊహల్లో. చేసేది లేక అరవటానికి ఓపిక లేక మూలపడుకున్నా. అటూఇటూ కదలినా నొప్పి గా వుంది అందుకే ముడుచుకొని మంచం మీదకాకుండా ఓ మూల పడుకున్నా.

తెల్లవారగానే కొత్తబట్టలు కొనుక్కోమని ఒకటేగోల మొదలుపెట్టారు. సరే అని ఏ.టి.ఎం కి వెళ్తే అది పనిచేయటం లేదు. మా ఊరిలో క్రెడిట్ కార్డ్ కి పేకముక్క కి ఇచ్చే విలువ కూడా ఇవ్వరు. ప్రక్క ఊరిలో ఉన్న ఏ.టి.ఎం కి వెళ్దామని నా పంచకల్యాణి రెండేళ్ళ క్రితం కొన్న బైక్ తీసి “మేరా సప్నోంకి రాణీ కబ్ ఆయోగి తు..” అని పాడుకుంటూ బయలుదేరాను. నేను బైక్ మీద వెళ్తున్న సంగతి ముందే తెలిసిన నా పాత స్నేహితుడు నా కన్నా ముందే కారు లో వెళ్ళి దారిలో నాకోసం చూస్తూ కూర్చున్నాడు. వాడి పేరు శనిగాడు. సరిగ్గా రెండు ఊరులకి మధ్యన అంటే ఎటువైపు బండి నడుపించుకుని పోవాలన్న మా తాతమ్మగారో జేజమ్మగారో పైలోకం నించి వచ్చి నన్ను పలకరించి ప్రోత్సహించాలి అని పూర్తిదా రూఢి చేసుకున్నాక పరిగెడుతున్న నా పంచకల్యాణి పెద్దగా సకిలించి ఆగిచచ్చింది. నా పాట్లు చూసి త్రివిక్రం సినిమా చూసినంత హాయిగా నవ్వుకొని నా మితృడు నా లాంటి మరొ దరిదృడిని కలవాటనికనుకుంటా ప్రత్యేకమైనా విమానం లో బయలుదేరి వెళ్ళిపోయాడు. షరా మాములే నేను బండిని తోసుకుంటూ “కనిపించని దేవుడి నడిగా నా గుండెలో నీ గుడినడిగా నువ్వెక్కడని” అని పాడుకుంటూ వెళ్ళిపోయా. వెళ్ళి నా కార్డులో డబ్బులుకాక, క్రెడిట్ కార్డులో డబ్బులు కూడా మొత్తం గీకేసి తెస్తే బట్టలు, జోళ్ళు, కళ్ళ జోళ్ళు, నిశ్చితార్ధానికి ఉంగరం, స్వీట్లు,మన్ను,మషానం అన్ని కొనిపించారు.

మామయ్య వచ్చేరోజు వచ్చింది. అప్పటికే ఆఫీసుకి సెలవుపెట్టి వారం రోజులు పూర్తయ్యింది. మా వాళ్ళు తోమిన తోముడికి గేదె కూడా ఆవులా అవ్వాల్సిందే. ఇక ఆయుర్వేదిక మందులతో కూడిన తిండి, ఆకు కూరలు, పళ్ళు తినిపించి ఉపవాసం మహాయోగం అనిపించేలా తయారు చేసారు. ఇదికాక రోజు రాత్రి పడుకొనే ముందు మామయ్య కూతురు నిన్నుగాని చేసుకుంటే నీ జీవితం పుల్లరెడ్డి నేతిమిఠాయి గంపలో పడ్డట్టే అని చెవిలో అపార్ట్ మెంట్లు కట్టుకొని మరీ పోరారు. ఇప్పటికి నాకు అర్ధమయ్యింది మాత్రం గజాల నా బంగారు బాతు. మామయ్య వస్తాడని ముందే లేచి వెంకటేశ్వరస్వామి కోవెలకి వెళ్ళి పూజచేసి, చెవిలో పువ్వు పెట్టుకొని వచ్చా. మమ్మీ,అమ్మమ్మ అయితే ఆ రోజంతా ఉపవాసం ముందే అనుకున్నారు. ఇవికాక పెళ్ళి కుదిరితే మా ఇంటిల్లపాది సాముహికంగా గుండు కొట్టించుకుంటామని మొక్కుకున్నారు. నా గుండెళ్ళో రైళ్ళు పరిగెట్టడం మొదలయ్యింది. ఈపాటికి గోదావరి వైజాగ్ వచ్చే ఉంటది అనుకున్నా. ఇంతలో ఫోను వైజాగ్ లో దిగాం టాక్సీ లో వస్తున్నాం అని. టాక్సీ మా ఊరికి రావటానికి 3 గంటలు పడుతుంది. కృతయుగం, త్రేతాయుగం,ద్వాపరయుగం అన్నమాట సరే. టి.వి. పెడితే దానిమీద మనసుపోవటం లేదు. పల్నాటి బ్రహ్మన్నాయుడు సినిమా చూస్తున్నా నాకు కామెడీగా లేదు. పేపరు చదువుతున్నాసరే గోడమీద వాచీనే కనబడుతుంది. అలా ఇంటిల్లా పాది ఒకేసారి అమ్మవారి గుడి ముందు నిప్పులు తొక్కినట్టు అటూఇటూ తిరుగుతూ కారుకోసం చూస్తున్నాం. నా జీవితంలో జాబ్ కోసం కూడా ఇంతలా ఎదురుచూడలేదు.

బయట హారన్ వినిపిస్తే పరిగెట్టి వెళ్ళి చూసా ఎదురింటికి ఎవరో వచ్చారు. అలా రెండుసార్లు హారన్లు వెక్కిరించాక ఇకబయటకి పోవటం మానేసా. ఇంకో హారన్ వినిపిస్తే మెల్లగా వంగుని చూసా ఎదురుగా కారు పరిగెట్టి వెళ్ళా “సుబ్బారావు ఇల్లేక్కడండీ ” అని అడిగాడు డ్రైవర్. “వాడు ఇల్లెక్కడు తాటిచెట్లెక్కుతాడు తాగుబోతు వెదవ” అని తిట్టిపంపించేసా. ఇక నాకు ఓపిక లేక వాకిట్లోనే కూలబడ్డా. పెద్ద శబ్దం చూస్తే పూలకుండి పగిలిపోయింది ఎవరిదో కారు గుద్ది. అమ్మమ్మ తిట్లు మొదలెట్టి పరుగున బయటకి వచ్చింది. కారు లోంచి సూటేసుకొని గుడ్డి కళ్ళద్దాలు పెట్టుకొన్న ఎలుగుబంటి దిగింది.
“ఏరా పెద్దోడా వచ్చేసావా?” అన్న అమ్మమ్మ పొలికేకకి ఇంటిల్లపాది రోడ్డున పడ్డారు అనగా బయటకి వచ్చారు. నా దృష్టంతా వెనుక డోరు వైపే ఉంది. ఇంతలో పరాయిదేశం లో పని ముగించుకొని విమానం లో సరాసరి ఇక్కడే ల్యాండయిపోతున్నాడు నా మితృడు. ఈ ఒక్కసారికి వదిలెయిరా కావాలంటే మరలా రేపు బైక్ మీద వెళ్ళేప్పుడు కలుసుకుందాం అని ప్రాదేయపడుతున్నా. ఇంతలో తలుపు తీసుకొని కాలు కిందపెట్టింది. మా వాడు పైనుంచి నవ్వాడు. జన్మ లో ఎప్పుడూ లేనిది జపాన్ లో వచ్చినట్టు భూకంపం. రేయ్ ఈ రోజు నా చేతిలో నువ్వయిపోతవ్ రోయ్ అన్నా. వాడు మాత్రం నవ్వటం ఆపలేదు. ఇంతలో కారులోంచి ఎవరొ దిగి కారు తలుపువేసిన శబ్దం చూస్తే ఎదురుగా చీకటి కారుమాత్రం కనిపించటం లేదు. తలుపేసిన చప్పుడుకో ఏమిటో మా మమ్మీ, అమ్మమ్మ కిందపడిపోయారు. కళ్ళు తడుముకుని చూసా  ఎదురుగా 70 ఎం ఎం లో నల్ల డ్రెస్సువేసుకున్న గున్న ఏనుగుపిల్ల. కెవ్వుమని అరిచి ఎగిరిపడ్డా. బావా ఐ లవ్ యూ అంది గజలక్ష్మి (ముద్దుగా గజాల).ఈ దెబ్బకి ఏకంగా మూర్ఛపోయాను.  పక్కింటోల్ల బాతు దారిలో అడ్డంగా ఉన్న నా నెత్తి మీద దూకి ఒకటి,రెండు చేసి “క్వాక్..క్వాక్..” అని వెక్కిరించి వెల్లిపోయింది. పైన విమానం లో ఆ వెధవ ఇంకా నవ్వుతూనే ఉన్నాడు.

ఉందిలే మంచికాలం ముందు ముందున …

ఇది చిరు పార్టీ ప్రచారం కోసం అనుకునేరు. నేను చెప్పేది మన తెలుగు బ్లాగుల గురించే. మీకు గుర్తుంటే నేను 1000 మంది సందర్శకులు వచ్చారని టపా రాసినప్పుడు చెప్పాను నా బ్లాగు నేనే బలవంతంగా చదివిస్తున్నా అని. కానీ ఇప్పుడు రోజులు మారాయి. నేను మంచి బ్లాగులని మా స్నేహితులకి, ఆఫీసులో వాళ్ళకి మెయిల్ ద్వారా పంపటం మొదలుపెట్టా. మొదట్లో ఇంత పెద్ద మెయిల్స్ ఏం చదువుతాం అని విసుక్కున్నారు. ఖాళీ గా ఉన్నప్పుడు కొంచెం గా చూసేవారు. ఇప్పుడు మా వాళ్ళకి పనిలో ఒత్తిడి తగ్గించుకోవటానికి ఇదో మార్గం అయ్యింది. ఇప్పుడు వారాంతం లో ఇంటి దగ్గర చదువుకోవటానికి,  పని ఒత్తిడిలో ఉన్నప్పుడు లేదా బెంచి మీద ఉన్నవాళ్ళు ఏవన్నా మంచి బ్లాగులు సూచించమని అడుగుతున్నారు. రెండు నెలల్లో గణనీయమైన మార్పు. నాకు చాల ఆనందం గా వుంది. నిజానికి అసలు చాలా మందికి సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు చేస్తున్నవాళ్ళకి కూడా బ్లాగులంటే ఏమిటో తెలియదు. ఖాళీ సమయం లో మెయిల్ చూసుకుంటారంతే. తెలిసిన కొద్ది మందికి ఇంగ్లీష్ బ్లాగులు, టెక్నికల్ బ్లాగులు మాత్రమే తెలుసు. కనుక తెలియజేసే పని మనం తలకెత్తుకుంటే సువర్ణాధ్యాయం ముందుంది. కొంతమంది మేము ఫ్యాన్స్ ఫలానా బ్లాగరు ఈ-మెయిల్ ఇవ్వమని గొడవ చేస్తున్నారు. ఒక హాస్యబ్లాగుకి అభిమాన సంఘం పెడతా అని అడిగాడొక మితృడు. త్వరలో ఆర్కూట్ కమ్యూనిటి పెట్టినా పెడతాడు. కాబట్టి ఉందిలే మంచి కాలం ముందు ముందున. చిన్న చిన్న పొరపొచ్చాలు వస్తున్నాయి ప్రక్కన పెట్టి ఒక మంచి ప్రయోజనం కోసం పని చేద్దాం. భిన్నాభిప్రాయాలు ఉండి కూడా ఒక మంచి ప్రయోజనం కోసం కలిసి పని చెయ్యొచ్చు గా. అందరం కలిసి కొత్త అధ్యాయాన్ని రచిద్దాం. కొన్ని రోజులకి ఒక ఈనాడు, స్వాతి తెలుగు వారికి ఎంత సుపరిచయమో బ్లాగులు కూడా అలా కావాలని ఆశిస్తూ..

మీ
మురళీ.

బ్లాగుదినోత్సవం

అయ్యా,బాబూ,అమ్మా ఒక చిన్నమాట విని వ్యాఖ్యానించాల్సినది గా నా విన్నపం.

తెలుగు ఆత్మగౌరవ పునరంకిత దినం అనే టపా మితృలు గుర్తించినట్టు లేరు. ఆంధ్రదేశం లో బ్లాగు అంటే ఏంటో తెలియని సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు కూడా ఉన్నారు (నాకు చాలా అనుభవాలు ఎదురయ్యాయి). తెలుగు బ్లాగులకి ఆంగ్లబ్లాగులంత విశేష ఆదరణ కావాలని మనం భావిస్తే జనాలకి అవగాహన కలిగే లా ఏదన్నా కార్యక్రమం చేయాలి. మనం రాష్ట్రం లో ఉన్న కాలేజి విధ్యార్ధులకి కూడా అవగాహన కలిగే లా చెయ్యగలిగితే ఇది మరో ఉద్యమమే అవుతుంది. దీనికి కాస్త సామాజిక భాద్యతని జోడించ గలిగితే మన భాష ని ఉద్దరించిన వాళ్ళం కాకపోయినా ఉడతా భక్తి ఏదో సేవ చేసిన వాళ్ళం అవుతాం. ఇది మనకి మనమే చేసుకునే గొప్పసేవ ఆలోచించి వ్యాఖ్యానిస్తారని ఆశిస్తూ.

మురళీ.