వర్షం

సెప్టెంబరు 6, 2011 at 10:48 ఏ ఎమ్ 10 వ్యాఖ్యలు

వాన వాకిటిలో, గొడుగు ఒడిలో

వాన వాకిటిలో, గొడుగు ఒడిలో

పసిపాపల దగ్గర నుండి పండు ముదుసలి వరకు అందరి మనసుల్ని ఆహ్లాదపరిచే దృశ్యాల్లో ఖచ్చితంగా మొదటి మూడు ఎంపికల్లో ఉండే దృశ్యం, వర్షం. తొలకరి చినుకులు పడటం మొదలవ్వగానే తన్మయత్వంతో ఆకాశం వైపు చూస్తూ, ఆ తడి మట్టివాసన ముక్కుపుటాలకు తగులుతూ ఉంటే ఒక్కసారిగా గుండెల నిండా గాలిని పీల్చుకుని ఆ వాసనను అనుభవించని జీవి జీవికాదు వాడి జీవితం జీవితమే కాదు. ఆరోగ్యపరంగా చల్లని వాతావరణం పనికిరాని వారు కూడా ఆ మట్టివాసన తగలగానే అన్ని మరిచిపోయి వానలోకి వచ్చేస్తారు. అందుకు పెద్ద ఉదాహరణ నేనే. జలుబో, జ్వరమో వస్తే రెండు రోజులు పడుకోటానికి సిద్దమే కాని తొలకరి చినుకుల్లో తడిచే అనుభూతిని మాత్రం వదులుకోను.

ఈ వానతో అనుభందం ఏనాటిదో సరిగ్గా చెప్పటం కష్టమే. కానీ వాన ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసిన మొదటి సందర్భం మాత్రం బాగా గుర్తుంది. బడిలో “వానా వానా వల్లప్ప వాకిలి తిరుగు చెల్లప్ప” నేర్చుకున్నరోజు మొదటిసారిగా అనిపించింది. ఇప్పుడు వానపడితే ఎంచక్కా ప్రయోగ పూర్వకంగా ఈ పాటను ప్రదర్శించొచ్చు కదా అని. చదువుకునే రోజుల్లో వానాకాలం సాయంత్రం బడి అవ్వగానే అక్క,నేను తడకుండా రావాలని ఒక గొడుగు కొనిచ్చారు. వర్షంలో వస్తుంటే గొడుగు నే పట్టుకుంటా అంటే, నేను పట్టుకుంటా అంటూ ఇద్దరం కొట్టుకునేవాళ్ళం. దానితో రోజుకొకరు పట్టుకోవాలనే నియమం పెట్టుకున్నాం. అవతలి వాళ్ళు పట్టుకున్నరోజు నాకు చోటివ్వవేంటి, సరిగ్గా పట్టుకో చూడు ఇటుపక్క తడిచిపోతున్నా అని గొడవ. ఇదికాక రోడ్డు మీద నీరు పారుతూ ఉంటే గెంతటం భలే సరదా.

వాన నీటిలో పడవ ప్రయాణం

వాన నీటిలో పడవ ప్రయాణం

ఇంటికొచ్చాక పడవల సరదా. అవసరమైనదో కాదో చూడకుండా పుస్తకాలు చింపేసి గబగబా పడవలు చేసి నీట్లో వదలటం, ఎవరి పడవ దూరం వెళుతుందో పోటీలుపెట్టుకోవటం తలుచుకుంటే మనసు ఇప్పటికీ కేరింతలు కొడుతుంది. పడవలంటే మరలా రోజూ ఒకేలాంటి పడవలంటే బోర్. పడవల్లో చాలా రకాలు ఉంటాయి సాదా పడవ, కత్తి పడవ, మరపడవ, గొడుగు పడవ అని బోలెడు ఉంటాయి. బడిలో ఎవడో ఒకడు మా మావయ్య ఈ రోజు నాకోసం కత్తి పడవ చేసార్రా అని చూపిస్తూ భుజాలు ఎగరేస్తే ఇంటికొచ్చి మాకూ అది చెయ్యటం నేర్పమని పైకెప్పు ఎగిరిపోయేలా ఏడుపు మొదలపెట్టేవాళ్ళం. పాపం మమ్మీ నాకు రాదు మొర్రో అన్నా వినిపించుకునే వాళ్ళం కాదు. స్కూల్ టీచర్‌వి నీకు పడవ చెయ్యటం కూడా రాదా అని ఏడుపు కొనసాగించేవాళ్ళం. మొత్తానికి ఎక్కడో నేర్చుకుని వచ్చి మాకు చెప్పేది. మరుసటిరోజు చూపుల్లోనే ఎక్కడలేని ఫోజు ప్రదర్శిస్తూ రకరకాల పడవల ఎగ్జిబిషన్ పెట్టేవాడ్ని. ఈ పడవల్లో అప్పుడప్పుడు చీమల్ని ఉంచి వాటికి నీటిలో బలవంతపు సాహసయాత్రలు చేయించటం మరో ప్రహసనం. :P  వడగళ్ళ వాన పడిందంటే సండడే సందడి. వడగళ్ళు క్రిందపడగానే పరిగెట్టి వాకిట్లోకి వెళ్ళి వాటిని ఏరి తెచ్చి ఒక దగ్గర కుప్పగా పోసేవాళ్ళం. ఎవరు ఎక్కువ సేకరిస్తారు, ఎవరు పెద్దది సంపాదిస్తారు అని పోటి.

హైస్కూల్, కాలేజీ రోజుల్లో కావాలనే వర్షంలో తడిచి వచ్చేవాడ్ని. మొత్తం తడిచిపోయి వచ్చాక ఏం పిల్లడోనమ్మా కాస్త ఎక్కడన్నా వర్షం వెళ్ళే దాకా ఆగొచ్చుగా అని తిడుతూ తల తుడిచేది మమ్మీ. వస్తూ ఉంటే సడెన్‌గా పడిపోయింది, ఎలాగూ తడిచిపోయానుగా ఇంకెందుకులే అని వచ్చేసా అని ఎదో కధలు చెప్పేవాడ్ని.  కాలేజ్‌లో ఉన్నప్పుడు లంచ్ బ్రేక్‌కి వెళ్ళే ముందు వర్షం మొదలయితే పండగే. అందరం కావాలనే గొడుగులు ఉన్నా దాచేసి వర్షం తగ్గేదాక ఉండి, ప్రిన్సిపాల్ దగ్గరకి వెళ్ళి దీనంగా మొహాలుపెట్టి అందరం ఇక్కడే ఉండిపోయాం సార్, ఎవ్వరం భోజనం చేయలేదు మద్యాహ్నం రాలేము అని చెప్పి క్లాసులు క్యాన్సిల్ చేయించే వాళ్ళం :)

వర్షంతో పెనవేసుకున్న మరో అత్యంత కమ్మని జ్ఞాపకం ఉంది. వానాకాలంలో వర్షంలో ఇంటికి వచ్చేసరికి శెనక్కాయలు కానీ, జొన్నపొత్తులు కానీ ఉడికించి పెట్టేది మమ్మీ. ఇంటిలో అడుగుపెట్టగానే ఆ కమ్మని వాసన తగిలేసరికి కలిగే ఆనందం మరి దేనితోనూ సరిపోల్చలేం సుమా. వంటి నిండా దుప్పటి కప్పుకుని ఉడికించిన వేరు శెనక్కాయలు తింటూ, ఆకాశవాణిలో పాటలు వింటూ, రోడ్డు మీద పడుతున్న వర్షాన్ని,అటు ఇటూ పరుగులుపెడుతున్న జనాల్ని, కొమ్మల్లో దాక్కుని వంటి మీద తడిని దులుపుకుంటున్న పక్షుల్ని చూస్తూ ఉండటం మరలిరాని ఒక మధురానుభూతి. కాస్త పెద్దవాళ్ళమయ్యాక వర్షం పడితే పకోడి బండి దగ్గర చేరి వేడి వేడి టీతో వేడి వేడి పకోడీలు,బజ్జీలు ఆస్వాదిస్తూ తినటం ఇప్పటికీ అప్పుడప్పుదు కొనసాగిస్తున్నామనుకోండి. కానీ అప్పటి ఆకాశవాణిని నేటి ఎఫ్.ఎమ్.లతో పోల్చలేము కదా. ప్రశాంతంగా ఉండే వాతావరణం, చల్లని గాలి, క్రింద పారుతున్న నీటిలో చినుకులు పడుతూ చేసే శబ్ధం, మధ్య మధ్యలో ఉరిమే ఆకాశం, తళుక్కున మెరిసి మాయమయ్యే మెరుపు తీగలు, ఉండుండి గుండెల్లో గాభరా పుట్టించేలా ఢాం మని పడే పిడుగులు, అర్జునా ఫల్గుణా అనే అమ్మమ్మ వాహ్ అక్షరాలు ఆవిష్కరించలేని అనుభూతి.

వర్షం అంటే ఇష్టం కదా అని ఎలాపడితే అలా ఎప్పుడు పడితే అప్పుడు పడిపోతే ఒప్పుకుంటామేంటి. దానికో టైముండాలి, ఒక రిథమ్ ఉండాలి, ఒక ప్రోసెస్ ఉండాలి. కాస్త సాయంత్రమవుతూ ఉండగా చల్లనిగాలి మొదట శరీరాన్ని తాకాలి. ఆ గాలిలో తేమ మన శరీరాల్ని తాకగానే వళ్ళంతా ఒక జలదరింత కలుగుతుంది. అప్పుడు ఆకాశంలో వెలుగుని తరిమేస్తూ నల్లని మబ్బులు అత్యంత వేగంగా కదలటం కనిపించాలి. అలా కదులుతూ మధ్యలో ఉరుముతూ ఉండాలి. టప్ టప్ మని దూర దూరంగా ఒక్కో చినుకూ పడుతూ శబ్ధం చెయ్యాలి. మేడ మీద ఆరబెట్టిన వడియాలు, బట్టలు తెచ్చుకోవటానికి జనాలు పరుగులు మొదలుపెట్టాలి. రోడ్డు మీద నడుస్తున్నవాళ్ళు, బైకులమీద వెళుతున్న వాళ్ళు షెల్టర్ కోసం తొందరపడుతుండాలి. అప్పుడు ఒక్కపెట్టున ధారగా వర్షం మొదలవ్వాలి. అప్పుడే ఆ వర్షానికి ఒక అందం, మనకి ఆనందం.

వర్షం గురించి ఇన్ని చెప్పును కానీ ఒక్కటి మిగిలిపోయింది. అది రొమాన్స్. మన సినిమాలు చూసుకున్నా, కావ్యాలు, కధలు, కవితలు తీసుకున్నా వర్షంలో ఉండే రొమాన్స్‌ని ఎలుగెత్తిచాటారు. దాదాపుగా తెలుగు సినిమాల్లో వచ్చిన అన్ని వానపాటలు హిట్టేనేమో. “చిటపట చినుకులు పడుతూ ఉంటే చెలికాడే చెంతన ఉంటే” ఏంటి అందరూ పాటని హమ్ చేయటం మొదలుపెట్టేసారా? నాకు తెలుసు :) అంత మంచి పాట గుర్తొచ్చాక నేను చెప్పే రొమాన్స్ ఎక్కుతుందో లేదో కానీ నేను చెప్పకుండా మాత్రం ఆపను :)

చిటపట చినుకుల వేళ చేరువలో నేస్తం

చిటపట చినుకుల వేళ చేరువలో నేస్తం

మనసులో ప్రేమ ఇంకా చెప్పుకోని ప్రేమికులు వర్షంలో ఒకే గొడుగులో వెళ్తున్నప్పుడు లేదా,  వర్షంలో తడవకుండా ఏ చెట్టు క్రిందో ఆగినప్పుడు చోటుచేసుకునే గమ్మత్తైన రొమాన్స్ మనతో ఎప్పటికీ ఫ్రెష్‌గా ఉండిపోయే అనుభూతి. ఇద్దరూ అలా కాస్త సమయాన్ని గడిపే అవకాశం దొరికినందుకు లోలోన ఆనందపడుతున్నా బయటకి ప్రదర్శించరు. ఏంటో ఈ వర్షం కాస్త మనం ఇంటికి వెళ్ళే దాకా ఆగొచ్చుగా, ఎప్పటికి తగ్గుతుందో ఏమో అంటూ ఆకాశం వైపు చూస్తుంటారు కానీ నిజానికి ఇద్దరికీ ఆ వర్షం ఇంకాసేఫు పడాలనే ఉంటుంది. ఇంతలో అనుకోకుండా అమ్మాయి చేయి అబ్బాయికి తగిలిందనుకోండి అబ్బాయి ఉక్కిరిబిక్కిరి అయిపోతాడు. అమ్మాయి కూడా కొత్తగా ఉండే ఆ ఫీలింగ్‌ని ఆస్వాదిస్తున్నా బయటకి మాత్రం “సారీ” అని చెబుతుంది. అబ్బాయి కూడా తన ఫీలింగ్స్ బయటకి కనబడనివ్వకుండా ఇట్స్ ఓకే అంటాడు. ఇద్దరూ కాస్త జరిగి దూరంగా నిలబడతారు.

అబ్బాయి మనసులో కాసేపటికి మరలా తను తాకితే బాగుణ్ణు అనే ఫీలింగ్ చిన్నగా మొదలయ్యి, కాసేపటికి ఏదో ఒకటి చేసి తాకాల్సిందే అనే స్థాయికి చేరుకుంటుంది. అమ్మాయి కదిలితే తగిలేంత దగ్గరగా తను జరుగుతాడు. ఆ జరిగే ప్రక్రియ తాను కావాలనే చేస్తున్నట్టు బయటపడకుండా ఆటూ ఇటూ ఊగుతూ, ఆకాశాన్ని,దిక్కుల్ని చూస్తూ, రకరకాల భంగిమలు, హావభావాలు ప్రదర్శిస్తూ చేస్తాడు. అమ్మాయికి ఇదంతా తెలుస్తూనే ఉంటుంది. పక్కకు తిరిగి లోలోపల ముసిముసిగా నవ్వేసుకుంటుంది. కానీ మొహంలో మాత్రం ఏమీ కనపడనివ్వకుండా వర్షం త్వరగా తగ్గిపోతే బాగుండు అనే ఫాల్స్ ఫీలింగ్‌నే కంటిన్యూ చేస్తూ ఉంటుంది. వర్షం ఎప్పటికి తగ్గుతుందా అనే చూసే ప్రక్రియలో మరోసారి అమ్మాయి చేయి అబ్బాయికి తగులుతుంది. మరలా సేమ్ పైన జరిగిన ప్రాసెస్ రిపీట్ అవుతుంది. ఈ జరుగుతున్న ప్రహసనమంతా మాకు తప్ప ఇంకెవరికీ అర్ధంకాదు, ప్రపంచం మమ్మల్ని గమనించటంలేదు అనుకుంటారు.  కానీ ఒక మూల నాలాంటోడు ఒకడు ఉండి ముసిముసిగా నవ్వుకుంటున్నాడు అని ఎప్పటికీ తెలుసుకోరు ;)

కరి మబ్బును వీడి,
విరుల ఒడిలో ఒదిగే చినుకుల తడి వర్షం.
ఎదురుగానే ఉంటూ చేరువ కానీ నెచ్చెలి భూమికి,
ఆకాశం పంపే ముద్దుల తడి వర్షం.
దూరాన ఉన్న ప్రియునికోసం,
ప్రియురాలు పంపే తడికన్నుల రాయభారం వర్షం.
ఏకాంతంలో ఉన్న చెలికానికి,
చెలి సాన్నిత్యం గుర్తుచేసే తుంటరి అనుభూతి ఈ నా వర్షం.

Entry filed under: తెలుగు, స్పందన. Tags: , .

తేట తేట తెలుగు పునరపి

అభిప్రాయములు Add your own

  • 1. vanajavanamali  |  1:59 సాయంత్రము వద్ద సెప్టెంబరు 6, 2011

    మురళీ గారు చాలా బాగుంది వర్షం హర్షం కురిపిస్తూ.. ఆఖరి మీ కవనం మరింత బాగుంది.

    జవాబు
  • 2. Sravya V  |  5:13 సాయంత్రము వద్ద సెప్టెంబరు 6, 2011

    Superb Murali gaaru !

    జవాబు
  • 3. vennellogodavari  |  5:42 సాయంత్రము వద్ద సెప్టెంబరు 6, 2011

    కొమ్మల్లో దాక్కుని వంటి మీద తడిని దులుపుకుంటున్న పక్షుల్ని చూస్తూ ఉండటం మరలిరాని ఒక మధురానుభూతి.
    మాటలు లేవు మురళి గారు.అద్భుతంగా ఉంది.

    జవాబు
  • 4. బులుసు సుబ్రహ్మణ్యం  |  6:21 సాయంత్రము వద్ద సెప్టెంబరు 6, 2011

    చాలా బాగుంది మురళి గారు. వర్షానుభూతి (తప్పు పదం కాదుకదా) మరువలేనిది. వేడి వేడి పకోడీ, వేడి వేడి కాఫీ/టీ, వర్షం సూపర్ కాంబినేషన్. దహా

    జవాబు
  • 5. రసజ్ఞ  |  6:29 సాయంత్రము వద్ద సెప్టెంబరు 6, 2011

    వర్షం గురించి ఎంతో మంది రాసారు కాని మీదే అద్భుతం. అన్ని అనుభవాలనీ గుర్తు చేశారు. చాలా బాగుంది. మాటలు రావడం లేదు ఇంక.

    జవాబు
  • 6. kiran  |  7:24 సాయంత్రము వద్ద సెప్టెంబరు 6, 2011

    చాలా చాలా బాగుంది …:)
    ఇంకో విషయం ఏంటంటే …మీరు సినిమాలు ఎక్కువ చుసేస్తున్నారు..కదా…:P

    జవాబు
  • 7. Naga Muralidhar Namala  |  9:58 సాయంత్రము వద్ద సెప్టెంబరు 6, 2011

    వనజగారూ, కవనం కూడా బాగుంది అని చెప్పారు ధన్యవాదాలండీ.

    శ్రావ్యగారూ, శైలబాలగారూ ధన్యవాదాలు.

    బుసులుసుగారూ, వర్షాల్లో చక్కగా వేడి వేడి పకోడీ విత్ టీ లాగించేస్తున్నారన్నమాట.
    రసజ్ఞగారూ, మీ మాటలతో ధన్యుడ్ని చేసారు.

    కిరణూ, సినిమా తెలివితేటలేవీ లేవమ్మా. అన్నీ ప్రత్యక్షానుభవాలే.

    జవాబు
  • 8. Avineni Bhaskar / అవినేని భాస్కర్  |  5:30 ఏ ఎమ్ వద్ద సెప్టెంబరు 7, 2011

    బాగరాశావు అంటే ఏం బాగుంటుంది? తొలకరిలో తడిచే హాయిని గురుతుచేశావు, చదువుతున్నంతచేపు తడిసినట్టు ఆనందింపజేశావు :)

    //..చీమల్ని ఉంచి వాటికి నీటిలో బలవంతపు సాహసయాత్రలు చేయించటం మరో ప్రహసనం… //ఈ అనుభవం నాకూ, ఉంది.

    చివర ప్రస్తావించిన రొమాంసు గురించిన విషయమే నాకర్థం కాలేదు ;) రొమాంసర్థంకాలేదనికాదు. నువ్వు రాయడమే? ;)

    కవితబాగుంది. అభినందనలు!

    జవాబు
  • 9. జాన్‌హైడ్ కనుమూరి  |  10:35 ఏ ఎమ్ వద్ద సెప్టెంబరు 7, 2011

    వర్షమంటే… నానోలు
    1
    వర్షం
    అంటే
    చినుకుల
    సవ్వడి-

    2
    కాగితపు
    పడవల
    బాల్యపు
    గుర్తులు-

    3
    వోణీ
    తడిసి
    వొంపిన
    వయ్యారం-

    4
    చినుకు
    చిరుకాంతి
    ఆకాశంతెర
    హరివిల్లు-

    5
    ఎండిన
    విత్తనానికి
    జీవం
    పోయడమే-

    6
    నెరలిల్లిన
    నేలతల్లిని
    పదును
    చేయడమే-

    7

    పెళ్ళలుగా
    పగిలిన
    పుడమికి
    పులకరింపే!-

    8

    దాహంగొన్న
    భూమికి
    తొలకరిజల్లై
    సేదదీర్చడమే!-

    9

    ఘనీభవించిన
    మేఘం
    చినుకై
    ద్రవీభవిండమే!-

    10

    కురిసి
    కురిసి
    పొంగిపొర్లే
    ప్రవాహమవ్వడమే!-

    ఎప్పుడో రాసినవి గుర్తుకొచ్చాయి
    అభినందనలు

    జవాబు
  • 10. కొత్త పాళీ  |  11:59 సాయంత్రము వద్ద సెప్టెంబరు 9, 2011

    బహుబాగు

    జవాబు

ప్రత్యుత్తరమిమ్ము

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


ఇటీవలి జాబులు

మైలురాళ్ళు

  • 36,669 దాటాను.

Copy Right

Page copy protected against web site content infringement by Copyscape

Follow

Get every new post delivered to your Inbox.