సరికొత్తచీర ఊహించినాను..

మే 18, 2010 at 10:28 ఏ ఎమ్ 11 వ్యాఖ్యలు

త్రేతాయుగంలోనిదో,ద్వాపరంలోనిదో ఈ కధ. రాముడో,కృష్ణుడో గోళీలు ఆడుకుంటూ ఉండిఉండొచ్చు. ఆ కాలంలో ఒక గొప్ప ధనవంతుడు ఉండేవాడు. ఇంటి నిండా డబ్బు, ఇంటిలో ఉన్నవారి వంటి నిండా బంగారం. గారంగా పెరుగుతున్న ఒక్కగానొక్క కూతురు. చంద్రుడే వచ్చి ఆమె చెక్కిళ్ళలో తన నీడని చూసి మురిసిపోయేంత అందం.

ఆమె అందం ఆనోట ఈనోట పాకి దేశదేశాల రాజులే ఆమెను పెళ్ళి చేసుకోవటానికి పోటీపడేవారు. అదే ఊరిలో ఉంటున్న ఒక పేదరైతు కొడుకు కూడా ఆమె అందం గురించి విని తనని ప్రేమించాడు. కేవలం తాను విన్న గుర్తులను బట్టి ఒక చిత్రం గీసి రోజూ దానిని చూస్తూ గడిపేవాడు. ఆమె తండ్రి ఈ పెళ్ళికొడుకుల తాకిడి తట్టుకోలేక స్వయంవరం ప్రకటించాడు. తన కూతురికి అత్యంత విలువైన బహుమానం తెచ్చినవాడికి తన కూతురినిచ్చి వివాహం చేస్తా అని ప్రకటించాడు. రాజులంతా మేనాలతో, ఏనుగులతో, ఒంటెలతో బహుమానాలు మోసుకొచ్చారు. పేదరైతు కొడుకు ఏంచెయ్యాలో పాలుపోక గుడికి వెళ్ళి లక్ష్మిదేవిని పూజించి వేడుకున్నాడు. దేవి వచ్చి అంతవిలువకానిది ఒక పొడవైన వస్త్రం ఇచ్చింది. ఆమెని తన నగలన్నీ తీసి ఈ వస్త్రం వేసుకోమని చెప్పు అని దేవి మాయమైంది. 

రైతుకొడుకు స్వయంవరం కి వెళ్ళాడు. రాజుల బహుమానాలన్నీ ఆమె తృణీకరించింది. చివరగా రైతు కొడుకు ఇబ్బంది పడుతూ దేవి ఇచ్చిన వస్త్రాన్ని, దానిని ఎలా ధరించాలో ఒక చిత్రాన్ని ఆమెకిచ్చాడు. వింతగా ఉందే అనుకుని ఆమె తన నగలన్నీ తీసి ఆ వస్త్రాన్ని రైతుకొడుకు చెప్పిన విదంగా ధరించి అద్దం ముందు నిలబడింది. ఆశ్చర్యం!! నగల వెలుగుల్లో ఇన్నాళ్ళూ గుర్తింపు నోచుకోని ఆమె ముఖ సౌందర్యం, మేని ఛాయ స్పష్టంగా కనిపించాయి. ఆమె తన సౌందర్యానికి తానే ముగ్దురాలయ్యింది. ఆమె తండ్రి కూడా తన కూతురి సహజ సౌందర్యాన్ని తెలియచెప్పిన రైతుకొడుకుకి ఆమె నిచ్చి వివాహం చేసాడు. వారు పది కాలలపాటు హాయిగా జీవించారు.ఆ రోజు దేవి ఇచ్చిన ఆ ఆరుగజాల వస్త్రమే స్త్రీలంతా ఇష్టపడే చీరయ్యింది. 

జెస్సీ చీరకట్టు చూసి ఊగిపోతున్న యువతను చూసి చీరలో ఏముందబ్బా అని ఆలోచిస్తూ ఉంటే కలిగిన ఊహలతో అల్లుకున్న టపా ఇది.

ఆమ్మ చీరలో ఊయలూగిన పసితనం

అమ్మ చెంగుతో నడక నేర్చుకున్న బాల్యం

అమ్మ చీర చించి కట్టు కట్టిన గాయం

మధ్య తరగతి మగువలే కాదు, మధ్యతరగతి జీవితాలన్నీ తమని తాము చీరలో చుట్టేసుకున్నాయి. గొప్పవారింట పోతపోసిన బంగారాలు, మణులు, మాణిక్యాలు, సుగంధాలు ఇన్ని కావాలి అందాన్నివ్వటానికి. ఇన్ని కలిపి వంటింటిలో పనుల మధ్య అల్లిబిల్లిగా అల్లుకున్న ముతకచీర అందాన్ని తేగలవా? మధ్యతరగతి సామ్రాజ్యాల్లో మహరాణులకు మకుటాల్లేవు కానీ మెరిసిపోయే చీరలున్నాయి. మరి మగమహారాజులకయితే అలిగిన దేవేరికి ఇవ్వటానికి అగ్రహారాల్లేవు కానీ బోనస్ జీతంతో ఓ కొత్త చీర దొరుకుతుందిగా. చీర అనగానే ఆడవాళ్ళ కళ్ళలో మెరుపులు, ఊహల్లో అంగడిలో రాశులుగా పోసిన చీరలు, మగాళ్ళకు మాత్రం బడ్జెట్టు, కరువు భత్యం. ఎంత ఖర్చయినా మన కుచేలమహరాజులంగారు మాట్లాడలేరు “నేను కొత్త చీర కట్టుకుని అందంగా ఉండేది మీ కోసం కాదూ!” అనే ముద్దుమాటలకి “కాదూ” అని చెప్పగలిగే ధీశాలి భూమ్మీద ఇంతవరకు పుట్టలేదు. 

చీర ముత్తాతలనాటి ముక్కిపోయిన సంప్రదాయం కాదు అది మన సంపద. కొన్ని సంపదల విలువ కాలం గడిచిన కొద్దీ పెరుగుతునే ఉంటుంది. మన జీవితాల్లో భందాలు అనుభందాలు చీరతో పెనవేసుకుపోయాయి. మగ్గాలలో పుట్టి మన ముంగిళ్ళలో మెట్టిన చీరని కేవలం ఒక చిన్న వస్తువుగా మాత్రం తీసిపారేయలేం. పట్టు చీర, సిల్కు చీర, కాటన్ చీర అని ఎంతమంది చెప్పుకుంటారో నాకు తెలియదుగానీ అన్నయ్య పెట్టిన చీర, మరదలి పెళ్ళికి పెట్టిన చీర, పెళ్ళిరోజుకి శ్రీవారు కొన్నచీర అని గుర్తుపెట్టుకునేవాళ్ళే అందరూ. అందుకే చీర ఒక వస్తువు కాదు మధుర ఙ్ఞాపకం. అమ్మ పెళ్ళికి కట్టుకున్న చీర నాకు కావాలి, గుడిలో అమ్మవారి చీర కావాల్ని పోటిపడే అడపిల్లలు ఎందరో. అందుకే చీర ఒక వస్తువు కాదు ఒక ఆశీర్వాదం. 

మన ఇంటి మహాలక్ష్మికి పెళ్ళిలో ఎన్ని నగలుకొన్నా మనం పెట్టిన పట్టుచీరే అన్నింటికంటే గొప్పది.అత్తవారింట అడుగుపెట్టే కొత్త పెళ్ళికూతురికిచ్చే ముచ్చటైన కానుక చీరే. అత్తమనసు, కోడలి కొత్త కాపురం ఆ చీరతోనే తెలిసిపోతుంది. అన్నయ్యలు అభిమానంగా నిజానికి ఆలికి కూడా తెలియకుండా చెల్లెలికి మురిపెంగా ఇచ్చే బహుమతి చీర. చీర ధర ఇంట్లో తగ్గించి చెప్పే అన్నయ్యలు తెలుసు మరి నాకు. మన ఇంటి శుభాలకి ముత్తైదువులకిచ్చే కానుక చీర. చీర ఒక చిన్న వస్తువు కాదు మన ఇంటి సంప్రదాయం, గౌరవం.

 అమ్మ కొంగుపట్టుకు తిరిగే పసితనం పోయి అమ్మాయి కొంగు పట్టుకోవాలని ఆరాటపడే కొంటెతనం లో అబ్బాయిలకి చీర ఊహల్లో రెపరెపలాడే ఒక ఇంధ్రధనస్సు. చుడీదార్లు, పట్టు పరికిణీలే కాకుండా అడపదడపా చీరకట్టులో మెరిసిపోయే కన్నెపిల్లలకి చీర ఒక మంత్రదండం. ఎంత మాయగాడైనా ఆ మాయలో పడకుండా ఉండలేడు. తన ప్రేయసి మొదటిసారిగా చీర కట్టుకుని ఏ గుడికో వెళ్ళింది అని తెలిసిన వెంటనే ఆత్రంగా,ఆశగా పరిగెట్టుకుని వెళ్ళి పెరుగుతున్న గుండె వేగాన్ని అదుపులో పెట్టుకుంటూ చూసే నూనూగు మీసాల కుర్రాడ్నే అడగాలి చీరలోని అందం. “సరికొత్త చీర ఊహించినాను.. సరదాల సరిగంచు నేయించినాను” అయినా చూస్తే చీరంతే ఉంటుందిగానీ చెప్పుకుంటూ పోతే ఊరంతవుతుంది. 

కావ్యాలు వ్రాయటానికి కవితలల్లటానికి కవులే కానక్కర్లేదు, మనసైన మగువ చీరచెంగు చెప్పే మౌనసందేశాలు తెలుసుకునే తెలివి ఉంటే చాలు. నడుమొంపున చేరిన చెంగు, చెదిరిన చీర పనిలో తల మునకలయినా అందాన్ని చెబితే, పెద్ద పట్టు అంచుతో నిలువెల్లా మెరిసిపోతున్న పట్టు చీర దర్పాన్ని చెబుతుంది. అలసి ఇంటికొచ్చిన శ్రీవారి ముఖాన్ని తుడిచే వేల ప్రేమని చెప్పే అదే చీర చెంగు, అల్లరివేళ గాలిలో గిరికీలు కొడుతూ ఊరిస్తుంది. సిగ్గుపడుతుండగా చూపుడువేలుకి చుట్టుకుపోతూ ప్రేయసి అందాన్ని చూపించే అదే చీరచెంగు, నడుమొంపునుండి తీసి విసిరి కొట్టి విసవిసా నడిచి వెళ్ళిపోతుంటే సునామీ హెచ్చరికే.ఈ చివరిది ఇంట్లో రామయ్యలకి నిత్య పేరంటం, పెళ్ళి కలలు కంటున్న బ్రహ్మచారులకు ముందున్న ముచ్చట్ల (ముసళ్ళ?) పండగ. అసలు మనసైన ప్రేయసి చీర కట్టులో వైభవం చెప్పాలంటే, నడకలో వయ్యారానికి అటూ ఇటూ ఊగే చీర కొంగులో మనసు ఉక్కిరిబిక్కిరి అయిపోతుంది. ఇది చాలదన్నట్టు గాజుల గలగలలు, జడగంటలు, మువ్వలు పక్కవాయిద్యాలుగా చేరి అబ్బాయిల మనసులు దోచి కళ్ళని తరింపజేస్తాయి.

చీరలోన దిగివచ్చిన కాంతలకోసం కావ్యాలు వ్రాయలేమేమో గానీ,

కళ్ళలో మీరు రచించిన దృశ్యకావ్యాలు పదిలంగా దాచుకుంటాం. 

ఇంతకంటే ఎక్కువ వ్రాస్తే మా మమ్మీ నాకు అర్జెంటుగా పెళ్ళి చేసేస్తుందనే భయంతో ఇక్కడికి ముగిస్తున్నా….

Entry filed under: తెలుగు. Tags: , , , .

నా ప్రియ నేస్తం నా గూగుల్ బజ్‌లు

అభిప్రాయములు Add your own

  • 1. రవి చంద్ర  |  1:13 సాయంత్రము వద్ద మే 18, 2010

    >>ఇంతకంటే ఎక్కువ వ్రాస్తే మా మమ్మీ నాకు అర్జెంటుగా పెళ్ళి చేసేస్తుందనే భయంతో ఇక్కడికి ముగిస్తున్నా….

    హ హ :-)

    జవాబు
  • 2. మిరియప్పొడి  |  2:27 సాయంత్రము వద్ద మే 18, 2010

    మీకు పెల్లి వయసు వచ్చెసింధి :)

    జవాబు
  • 3. బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్  |  2:48 సాయంత్రము వద్ద మే 18, 2010

    బాగా చెప్పారు.చీరకట్టులో ఉన్న అందం దేనిలోనూ లేదు

    జవాబు
  • 4. subhadra  |  7:07 సాయంత్రము వద్ద మే 18, 2010

    sooooooooooooooooooooooooooooo nice..ending inka super..

    జవాబు
  • 5. sbmurali2007  |  10:57 సాయంత్రము వద్ద మే 18, 2010

    మా ఇంట్లో ఆ మధ్య, తండ్రీ పిల్లలూ “మూడ్ ఎప్పుడూ బాగుండాలంటే ఎమి చెయ్యాలి” అని ఒక లిస్టు రాస్తున్నారు. “ఉదయం అయిదింటికే లేవాలి, సంగీతం బాగా వినాలి, బాగా ప్రాక్టీసు చెయాలి,” ఇలాంటి వన్నీ చేరుతున్నాయి ఆ లిస్టులో. ఉన్నట్టుండి మా చిన్నది, “అమ్మ చీర కట్టుకోవాలి” అని రాసింది. వార్నీ! నా చీరకీ నీ మూడ్ కీ ఏమిటే సంబంధం అని అడిగితే, “నువ్వు చీర కట్టుకుంటే హాయిగా వుంటుందమ్మా!” అని తేల్చేసింది. అప్పణ్ణించీ మా ఇంట్లో శని ఆది వారాలు అమ్మ చీరే కట్టుకోవాలి అని అనధికారిక రూల్ నియమించడమైనది!
    మీ శైలీ, ఆలోచనలూ చాలా బాగున్నాయి. ఇంత సున్నితంగా చీరనీ, చీర మీద అందరి ఇష్టాన్నీ ఆవిష్కరించినందుకు అభినందనలు.
    శారద

    జవాబు
  • 6. sujata  |  4:46 ఏ ఎమ్ వద్ద మే 19, 2010

    Lovely cheera and lovely description. ve shall all remember u for this Post.

    God Bless You.

    జవాబు
  • 7. శ్రీవాసుకి  |  5:38 ఏ ఎమ్ వద్ద మే 19, 2010

    మీ పోస్ట్ కంచి పట్టుచీరంత అందంగా ఉంది. అలాగే పెళ్ళి వయసు కూడా వచ్చినట్టుంది. ఎందుకైనా మంచిది ఓ నాలుగు చీరలు కొని ఉంచండి.

    జవాబు
  • 8. sivaranjani  |  6:04 ఏ ఎమ్ వద్ద మే 20, 2010

    చీర గురించి ఎంత అద్భుతం గా రాసారండి. నిజమే చీర కట్టులో ఉన్నంత గొప్పదనం ఎందులోని లేదు

    జవాబు
  • 9. మోహన  |  9:14 ఏ ఎమ్ వద్ద మే 21, 2010

    బాగుందండి.. చాలా బాగా రాసారు. కథ కూడా నాకు చాలా నచ్చింది.

    ఒక సారి సెలవులకి నేను ఇంటికొచ్చేసరికి, నాన్న తలుపు తీసారు. లోపలికి రాగానే నాకు కనపడిన దృశ్యం, అమ్మ పసుపు రంగు చీరలో , చిరు చెమటలు పట్టిన ముఖంతో, ముడి వేసిన తడి జుట్టు కాస్త చెదిరి, వంట గదిలోంచి నడుస్తూ వచ్చింది. ఆ రోజు అమ్మని కళ్ళార్పకుండా చూసాను నేను. రోజూ చీరలోనే చూసినా ఎందుకో మరి ఆ రోజును మాత్రం ఇప్పటికీ, ఎప్పటికీ కూడా మర్చిపోలేను. మీరన్నట్టు ఆ దృశ్యం నాకు ఒక కావ్యమే!

    ‘భలే అందంగా ఉన్నావు మమ్మీ’ అంటే, ‘చాల్లేవే..’ అంటూ ఎంత సిగ్గుపడిందో చెప్పలేను. :)

    జవాబు
  • 10. satya  |  6:41 ఏ ఎమ్ వద్ద ఆగష్టు 7, 2010

    kadha superb…………..mothaniki cheeera paina me research bagundi……………..

    జవాబు
  • [...] హాస్య టపాలు: 1.కౄర మృగం 2.హ హా హాసిని 3.నేటికి నెరవేరిన మూషికవరం 4.బందరు మామయ్య – బంగారు బాతు 5.హాసిని కి పెళ్ళి చూపులోచ్… 6.జావా జావా కన్నీరు కవితలు: 1.పిచ్చి రాతలు 2.లాలీ జో.. లాలీ జో.. 3.నేను కవిని కాదన్నవాడ్ని కత్తితో పొడుస్తా. 4.నేను రచయిత కాదన్నవారిని రాయిచ్చుకు కొడతా.. 5.ఆమె నన్ను వదిలి వెళ్ళిపోయింది. నివేదికలు: 1.e-తెలుగు విజయవాడ పర్యటన పై నివేదిక 2.ఆంధ్ర తుంబురుడు అవతరించెను నేడు… 3.శంకరా’భరణం’ ఇతరములు: 1.ఇదే నా మొదటి ప్రేమలేఖ… 2.జాజు – ఒక కాకి కధ 3.>భయంగా ఉంది నాన్న… 4.పెళ్ళి-ఒక దృక్కోణం గుర్తింపుకి నోచుకోని నాకు నచ్చిన టపాలు: 1.కాకి దిద్దిన కాఫురం (!?!) 2.పార్టింగ్ నోట్ 3.ఐ హేట్ యు రా 4.సరికొత్తచీర ఊహించినాను.. [...]

    జవాబు

ప్రత్యుత్తరమిమ్ము

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


ఇటీవలి జాబులు

మైలురాళ్ళు

  • 41,718 దాటాను.

Copy Right

Page copy protected against web site content infringement by Copyscape

Follow

Get every new post delivered to your Inbox.