ముంగిలి » చర్చ » భయంగా ఉంది నాన్న…

భయంగా ఉంది నాన్న…

 
11 డిసెంబర్ 2008 :

“రాణి, నీ పెళ్ళి ముహూర్తం కూడా నిర్ణయం అయిపోయింది. బట్టలు,నగలు కొనటానికి రేపే అమ్మ,నేను విశాఖపట్నం వెళ్తున్నాం. నీకేం కావాలో చెప్పమ్మా?”

“నాన్న, నీ ఒక్కగానొక్క కూతురి పెళ్ళి ఘనంగా చేస్తావుగా మరి. నన్ను కాదని ఫోజు కొట్టిన సాఫ్ట్ వేర్ బావల చూపులు ఆకాశం నుండి నేలకి దిగిరావాలి. మా కొడుకులే పుత్తడి, మీరు ఇత్తడి అన్న అత్తల డాబు దిగేలాగా బందువుల్ని,ఊరందర్ని పిలవాలి. నువ్వు అడిగిన విధంగా ఖర్చులన్నింటినీ వ్రాసిపెట్టా. 20 లక్షలకి దగ్గరగా వచ్చింది.”

“అంతా నీకు నచ్చినట్టే చేద్దాం. మేము పొద్దున్నే బయలుదేరి రాత్రికి వచ్చేస్తాం. నువ్వు నిదానంగా లేచినా పర్వాలేదు. వచ్చేంతవరకు జాగర్త తల్లి.”

“సరే నాన్న.”

12 డిసెంబర్ 2008:

“రాణీ! తల్లి ఎక్కడున్నావు రా. ఇదిగో చూడు నువ్వు అడిగిన దానికంటే అందంగా ఉన్న చీరలు, నగలు. నా చిట్టితల్లి దగదగా మెరిసిపోతుంది ఇవి వేసుకుంటే. ఎక్కడున్నావమ్మా?”

“అమ్మాయి గది తలుపు వేసి ఉంది. పడుకుందేమోనండి? రేపు చూస్తుంది లెండి.”

“ఒక్కసారి ఇవన్నీ చూపించి నా చిట్టి తల్లి కళ్ళలో అనందం చూడకుండా పడుకున్నా నాకు నిద్రపట్టదు. వెళ్ళి కిటికీ లోంచి పిలువు వినిపిస్తుంది.”

“అలాగే. చెబితే వినరుగా….. ఏవండీ! త్వరగా రండీ. అయ్యో చిట్టి తల్లీ ఎంత పని చేసావమ్మా. నీకే కష్టం వచిందమ్మా. మమ్మల్ని ఒంటరిని చేసి వెళ్ళిపోయావా తల్లీ….”

“అమ్మా…..” 

రాణి తనగదిలో చీరతో ఉరివేసుకుని కనిపించింది ఆ తల్లిదండ్రులకి. వాళ్ళ రోదన అలా కొనసాగుతూనే ఉంది. బందువులు, మితృలు, పోలీసులు అందరూ వచ్చివెళ్ళారు. తలా ఒకమాట అన్నారు. ఆ తల్లిదండ్రుల అజాగ్రత్తకు, అతిజాగ్రత్తకు మందలించారు, తోచిన సలహాలిచ్చారు. కొందరు కూపీలాగారు. కానీ ఈ సంఘటనలో వారు పోగొట్టుకున్నది ఎవరు తిరిగి తెచ్చి ఇవ్వలేదు. రాణి కూడా ఒక ఉత్తరమైనా వ్రాసిపెట్టలేదు. తను ఉత్తరం వ్రాయలనుకుని ఉంటే ఏమని వ్రాసేది…….

 

ఆత్మహత్యకి ప్రత్యమ్నాయం లేదా?

ఆత్మహత్యకి ప్రత్యమ్నాయం లేదా?

ప్రియమైన నాన్నగారికి,

నాన్న నీతో చాలా మాట్లాడాలని ఎప్పుడూ అనుకుంటూనే ఉంటా కానీ నీ పెద్దరికానికి, పెద్ద పెద్ద ఆలోచనలకి నావి ఆకతాయి అల్లరి చేష్టల్లా ఉంటాయని కొట్టి పారేస్తావ్. ఈ ఒక్కసారికి విను నాన్న. ఎందుకంటే ఇకముందు ఇలా చెప్పే అవకాశం ఉండదేమో? నాన్న నువ్వెంత గొప్పవాడివో తెలుసా. బయటవాళ్ళకి నువ్వెవరో తెలియదు గాని నాకు మాత్రం నువ్వు దేవుడివి. నువ్వు నాకు ఏమి ఇవ్వలేదని నాన్న. జీవరాశుల్లోనే ఉత్తమమైన మానవ జన్మనిచ్చావ్, అడిగింది కాదనక అల్లారు ముద్దుగా పెంచావ్, చదువు చెప్పించావ్. ఇప్పుడు నా పెళ్ళికోసం కూడా ఎంత కష్టపడుతున్నావ్.

అసలు ప్రతీ మనిషి ఇంతేనేమో, పెళ్ళి కానంతవరకు తనకోసం బ్రతికి, తనకోసం సంపాదించేవాడు పెళ్ళి కుదిరిన మరుక్షణం నుంచే పిల్లలే జీవితంగా బ్రతుకుతారు. నువ్వు పొద్దున్న లేస్తూనే కష్టపడేది, సంపాదించేది, ఆదా చెసేది ప్రతీది నా కోసమేగా. నీ జీవితం లో నీకోసం పావువంతు బ్రతికి మిగిలిన జీవితమంతా నా కోసమే బ్రతికావు కదా!

మరి నాకోసమే ఇంతలా బ్రతికే నువ్వు, నాకు ఏమి కావాలన్నా ఇచ్చే నువ్వు, నా భవిష్యత్తుని నా వందేళ్ళ జీవితాన్ని నిర్ణయించే పెళ్ళి దగ్గర మాత్రం నా ఇష్టాలతో, ఆశలతొ, ఆశయాలతో, నా భవిష్యత్తు నిర్ణయాలతో పనిలేకుండా పరువు, ప్రతిష్ట అంటావేంటి నాన్న. ఈ పరువు, కుటుంబ ప్రతిష్ట అంటే ఏంటి నాన్న? ఆడపిల్ల పద్దతిగా లేకపోతే కుటుంబ పరువు పోతుందని రోజూ అమ్మకి చెబుతావ్, సమాజం లో తలదించుకొనే పరిస్థితి రాకూడదని రోజూ అంటావ్. అమ్మ సంగతి తెలుసుగా 5వ తరగతి చదువుతో ఆడదానికి కుటుంబమే సర్వస్వం, భర్తే దైవం అని తప్ప వేరే ఏది ఆలోచించలేదు. వ్రతాలు, గాజులు, చీరలు, ఆవకాయ, అప్పడాలు ఇవి తప్ప తన దగ్గర ఇంకేదన్నా చర్చిస్తే తనకి అర్ధం కాదు. అందుకే నీ పరువు కోసం నన్ను గడప దాటనివ్వదు. సమాజం లో నీ గౌరవం కోసం నన్ను ఎవరితోనూ స్నేహం చెయ్యనివ్వదు. నీ బాగు చూసి ఓర్వలేకపోతున్నారు బందువులు అని బలంగా నమ్మి ఎవరితోనూ మాట్లాడనివ్వదు.

నా ఆలోచనలు ఆకాశంలో విహరిస్తే, మీ అర్ధంలేని భయాలు నా ప్రపంచాన్ని చిన్నదిగా చేసాయి. నా వయస్సులోనే ఉన్న అక్కలు,అన్నయ్యలు,బావలు,వదినలు ఎందరో మన భందువుల్లో ఉన్నారు. ఒక్కరోజు ఎవరినీ కలిసే అవకాశం లేదు. మనసు విప్పి మాట్లాడే అవకాశంలేదు. వాళ్ళ భవిష్యత్తు ప్రణాలికలు తెలుసుకోవాలన్న నా కోరిక ఇప్పటికీ తీరలేదు. వాళ్ళు కంప్యూటర్ లో ప్రపంచాన్ని చూస్తుంటే, నేనుమాత్రం ఇల్లే ప్రపంచంగా బ్రతికాను. విశాలమైన మన ఇంటి గదుల్లో ఎంత ఇరుకుగా పెరిగానో నీకు తెలుసా నాన్న.

ఒకరోజున హఠాత్తుగా పెళ్ళిచూపులన్నారు, పెళ్ళన్నారు. వచ్చినవాడికి నేనంటే ఇష్టమా? మీరు ఇస్తానన్న కట్నం ఇష్టమా? నా ఆశలని,ఆలోచనలని అర్ధంచేసుకుంటాడా? లేక వండివార్చితే చాలనుకుంటాడో? ఏమీ తెలియదు. ఇవన్నీ పోని మిమ్మల్ని అడుగుదామంటే ఆడది చదివి చెడిందంటారు. అంతేగా? ఇంకెవర్ని అడగాలి? ఎవరితో పంచుకోవాలి. నాకు ఎవర్ని అందిచారు? ఎవర్ని మిగిల్చారు మీరు? నాకు నేను తప్ప ఎవరూ మిగలలేదు.

అసలు లోకులు,బందువులు ఎవరు నాన్న మన జీవితాల్ని శాసించటానికి? ఇప్పుడు రమ్మను వాళ్ళని కళ్ళు చల్లబడతాయి. ఇప్పుడూ నేను లేని లోటుని తీర్చగలరా వాళ్ళు. పశ్చాత్తాప పడి నేను కోల్పోయిన ప్రాణాన్ని తిరిగి ఇవ్వగలరా. నీ మనసులో గూడు కట్టుకు ఉన్న పరువుని, ప్రతిష్టని అడిగి సమాధానం చెప్పు.. ఇకచాలు నాన్నఇంత పెద్ద ప్రపంచంలో నాకు,నా ఆలోచనలకి స్వేచ్చని,స్థానన్ని ఇవ్వలేని సంకుచిత సమాజాన్ని ద్వేషిస్తూ వెళ్ళిపోతున్నా. నీ రూపం లో నా మెడని వంచి విజయాన్ని అందుకుందామన్నా విధిని పరిహసిస్తూ వెళ్ళిపోతున్నా. నా ఇష్టమయిన ఉయ్యాలని చివరిసారిగా ఊగాలని ఉరివేసుకుని ఊగి వెళుతున్నా.

అంతే నాన్న..  నేను చెప్పాలనుకున్నది అంతే…   ఇంకా చాలా చెప్పగలనేమో..  కానీ ఇప్పటికే జరగాల్సిన ఆలస్యం జరిగిపోయింది..  ఇంకా ఏవో చెప్పి ప్రయోజనం లేదు…

ఇన్ని మాటలు చెప్పాను కానీ నాన్న, భయంగా ఉంది నాన్న. చావాలంటే భయంగా ఉంది నాన్న. ఉరితాడు నా మెడకి బిగుసుకుంటూ ఉంటే ఊపిరాడక నొప్పిగా ఉంటుదేమో? నాన్న భయంగా ఉంది. చనిపోయాక ఎమవుతా నాన్న, అక్కడ ఆలోకంలో ఆకలయితే అన్నం పెట్టే వాళ్ళు ఉంటారా? ఒంటరిగా అందర్ని వదిలి వెళ్ళాలంటే చాలా భయంగా ఉందినాన్న. నన్ను మరిచిపోకండి నాన్న… ప్లీజ్

మీ నిర్భాగ్యురాలయిన కూతురు,

రాణి.  

(ఇది ఈమధ్య మా బందువుల్లోనే జరిగిన ఒక సంఘటన. కారణం ఎవరికీ తెలియదు. బందువుల్లో ఎవరితోనూ కలివిడిగా ఉండే అవకాశంలేదు. ఒక చిన్న పల్లెటూరిలోనే తన నిండు నూరేళ్ళు నిండిపోయాయి. తన చివరి క్షణాల్లో పడ్డ సంఘర్షణ ఆవిష్కరించాలని ఎంతగానో ప్రయత్నించా. కానీ తన ఆలోచనలు, నడవడిక, వ్యక్తిత్వం , గతం, భవిష్యత్తుకై తన ఆలోచనలు ఏమీ తెలియని నేను వ్రాసినవి కేవలం నా ఊహలేగాని వాస్తవాలు కావు. వాస్తవాలు తన మనస్సు అనే రహస్యపు పెట్టెలో శాశ్వతంగా దాచేసి తనతో తీసుకుపోయింది. నావాళ్ళకే నాతో కష్టాలు పంచుకునే చనువు ఇవ్వలేకపోయాను. అందుకేనేమొ ఈ సంఘటన నన్ను పదే పదే వెంటాడుతుంది. నాకిప్పుడు కొన్ని నిజాలు తెలియాలి. తను చనిపోవాల్సిన అవసరం ఏంవచ్చింది? తన  చావుకి నిజమయిన కారకులు ఎవరు? చనిపోయినప్పుడు తన ఆత్మసంఘర్షణ  ఏంటి? చావు తర్వాత ఏమవుతుందో ఇప్పటికీ మానవమేధస్సుకి తెలియదు. తను అసలు ఆవిషయం ఆలోచించిందా? ఉరివేసుకోవటానికి భయపడలేదా? బ్రతకటానికి ఏవయినా అవకాశాలు ఉన్నాయేమొ ఆలోచించలేదా? రేపటినుండి తాను ఏమవుతుంది, తనగది ఏమవుతుంది, తన బట్టలు, పుస్తకాలు, తనకిష్టమయిన వస్తువులు అన్నీ ఏమవుతాయి? ఇంకా కొన్ని వేల ప్రశ్నలు నా మనస్సుని తొలిచేస్తున్నాయి. ఇన్ని ప్రశ్నలు తనకి కలగలేదా? మరి ఏం సమాధానం చెప్పుకుంది. తనని తాను చావుకి మానసికంగా ఎలాసిద్దంచేసుకుంది. నా ప్రశ్నలకి ఎవరు సమాధానం చెప్పగలరు………………….)


20 thoughts on “భయంగా ఉంది నాన్న…

  1. మనసుతో రాసావ్. ఆ అమ్మాయి మనసునీ ఖచ్చితంగా నీ భాష ఆవిష్కరించిందనే అనిపిస్తోంది. చాలా విషాదమైన ఉదంతం. కానీ..ప్రతిక్షణం ఈ ప్రపంచంలో అదొక నిజం.

  2. మీ ప్రశ్నలకి జవాబు చెప్పగలిగిన వాళ్ళు తగిలితే నాకు కూడా చెప్పండి.
    తెలిసిన వాళ్ళకి ఇలా జరగడం మరింత బాధించే విషయం కానీ ఏమీ చేయలేం..

  3. మురళీ గారు..

    రాణీ బాధని, మీరు ఊహించి అందించిన తీరు నిజ్జంగా, కళ్లలో నీళ్లు తిరిగేలా చేసింది. కానీ మీరూహించి రాసిన లేఖలో ఒక ముఖ్యమైన విషయాన్ని మరచిపోయారేమో అనిపించింది. నేననుకోవడం,

    “నన్ను కాదని ఫోజు కొట్టిన సాఫ్ట్ వేర్ బావల చూపులు ఆకాశం నుండి నేలకి దిగిరావాలి. మా కొడుకులే పుత్తడి, మీరు ఇత్తడి అన్న అత్తల డాబు దిగేలాగా బందువుల్ని,ఊరందర్ని పిలవాలి.”

    ఈ ఆలోచనలు కూడా కొంతవరకు కారణమేమో… ఎందుకంటే, నహజంగానే బంధువులల్లో, భావ మరదళ్లు చిన్ననాటినుండి, ఏ బేషజాలు లేకుండా గడిపేస్తారు. ఎన్నో ఆటలు ఆడుకుంటారు, ఊసులు చెప్పుకుంటారు. ఈ సాఫ్ట్వేర్ బావ(లు), చిన్ననాడు ఆ అమ్మాయికి ఎన్ని ఆశలు కల్పించారో..!? తెలియనితనంలో ఎన్ని మాటలిచ్చారో, “పెద్దయ్యక మనం పెళ్లి చేసుకుందాం, నువ్వంటే నాకిష్టం” అంటూ… కాకపోతే కాలం తెచ్చిన ఎడబాటులో ఆ సాఫ్ట్ బావ ఊరుకాని ఊరులో, లేదా వేరే దేశంలో ఎంతో మంది కొత్తపరిచయస్తుల మధ్య, తనమీదే ఆశలుపెట్టుకున్న మరదలిని మరిచి ఉండొచ్చు, కానీ తన భావే లోకంగా బతికే ఆ పిచ్చిపిల్లకి ఇవేవి తెలియక, బ్రమలో బ్రతికి ఉండొచ్చు.

    లోకం పోకడ చెబుతున్నాను…. కొంత కాలం క్రితం వరకు ఎంతో అన్యోన్యంగా ఉండే అక్కా/చెల్లి తమ్ముళ్లు, వాళ్ల అబ్బాయిలు ఒక మంచి పొశిషన్ కి రాగానే, మేనరికాలని కాదని, ఏవేవో కారణాలచేత, బయటి సంబంధలని వెతుక్కుంటున్నారు. ఎక్కడో కొంతమంది, ఎంత ఎత్తుకు ఎదిగినా, “మేనమామ కూతుర్ని చేసుకోకపోతే పాపంరా! ” అంటూ హితభోద చేస్తున్నా.. చాలా మందిమాత్రం అలా చేయకపోవడం, ఈ ఫాస్ట్ జెనరేషన్ మనలో తెచ్చిన మార్పులుగా నాకు తోస్తాయి.

    చివరగా, రాణీ విషయంలో ఏం జరిగిందో మనకు తెలియదు. తను ఎందుకు ఇంత అగాయిత్యానికి ఒడికట్టిందో కూడా తెలియదు. ఇదీ… అని చెప్పలేని ఏదో బలమైన కారణమే ఉండి ఉంటుంది. అది ఇదేనేమో అనుకోవడం మినహా, అది ఇదే… ననిచెప్పడం, తప్పే అవుతుంది.

    – నంద

  4. @నంద,
    కాకపోతే ఈ మేనరికాలు స్ధాయిని దాటితే ప్రమాదం. ఇరవై అయిదేళ్ళ తమ్ముడికి పదమూడేళ్ళ కూతురిమి ఇవ్వాలనుకోవడం మూర్ఖత్వం అవ్వదా,

  5. Hi Murali,
    Idhi chala dhuradrustamaina sangatana. Nedu mana samjamlo unna lopaalni Raani ethi chupinchi thana chanuvu chalinchindhi. Alludu ilanti vaadu raavali, alanti vaadu raavalani kalalu kane Thalli Thandrulu meettinintiki velli migatha kjeevitham gadipe ammaiki ista istalanu endhuko thelusukoru artham kaadu. Antha ayyaka thana manasulo emundho thelusukunte bagundune ani badha pade kante mundhe melkuni unte intha dharunam jarigundedhi kaadu… Anyway thana athma ki aa bagavanthudu shanthi ni chekurchalani korkuntunna…..

    Seenu.N

  6. A beautiful narration to a sad end! idi nee tarapuvallade anesaiki manasu samadhanapadaledu1 ayina entamndi Ranulu ila nelakorigipotunnaro!

    Samajam eppudu marutundi? Parents “Chaduvu-> Vudyogam->Pelli->Manumal Chaduvulu->Chaduvulu+Vudyogalu…….till the dead end!” ee mindset nunchi maarali…….naa website lo OPINION lo ade raasanu….kakapothe konchem different!

    Caste differences inka vishapukoralatho ee samajaanni peedisthondi…if possible pen something abt Caste and its evolution and impact………
    Caste, Religion and Culture ane book lo Swami Vivekananda baga raasaru…DO NOT NEGLECT to pen it!

  7. పింగుబ్యాకు: బ్లాగు ప్రయాణంలో మూడేళ్ళు « మురళీగానం

వ్యాఖ్యానించండి